ప్రొ.నాగేశ్వర్: ఏపీ రాజకీయాల్లో కేసీఆర్‌ది ప్రత్యక్ష పాత్రా..? పరోక్షమా..?

తెలంగాణ రాజకీయాల్లో తమ పాత్ర తప్పని సరి అంటూ.. అటు కేసీఆర్.. ఇటు కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే పేద చెప్పుకొస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో .. టీడీపీ పోటీ చేసి.. చంద్రబాబు ప్రచారానికి వచ్చారు కాబట్టి.. తాము ఎందుకు వెళ్లకూడదనేది వారి వాదన. అయితే.. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ… తాము ఏ రూపంలో ఏపీ రాజకీయాల్లోకి వెళ్తామన్న విషయాన్ని ప్రకటించలేదు. సొంతంగా పోటీ చేస్తారా.. లేక ఇతర పార్టీలకు మద్దతిస్తారా.. లాంటి విధానపరమైన అంశాలపై వారిద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

ఏపీలో టీఆర్ఎస్ పోటీ చేయడానికి అవకాశం ఉందా..?

తెలంగాణ రాష్ట్ర సమితి గతంలో ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసింది. పార్టీ పెట్టిన మొదట్లో.. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం గుర్తింపు రావాలంటే.. ఎక్కువ చోట్ల పోటీ చేయాల్సి వచ్చింది. ఆ కారణంగా… టీఆర్ఎస్ కొన్ని చోట్ల నామినేషన్లు వేసింది. అయితే.. అప్పడు కనీస మాత్రం ఓట్లు కూడా రాలేదు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని… చెబుతూ.. పోటీ చేస్తామన్నంత హడావుడి చేస్తున్నారు. అప్పుడు రాని ఓట్లు ఇప్పుడు వస్తాయా..?. కేసీఆర్… ఏపీలో వేలు పెడతామని ప్రకటించే సరికి.. అది కచ్చితంగా చంద్రబాబుకు వ్యతిరేకంగానే ఉంటుందని… వైసీపీ, జనసేన పార్టీలు ఏపీలో సంతోషం వ్యక్తం చేశాయి. అయితే… ఎలాంటి పాత్ర పోషిస్తారో క్లారిటీ లేదు. టీఆర్ఎస్ ఏపీలో పోటీ చేయగలదా..? చేస్తే ఓటింగ్ వస్తుందా.. అన్నదానిపై.. చాలా విశ్లేషణలు ప్రారంభమయింది. కేసీఆర్ ఏపీకి వచ్చి.. పోటీ చేసి..చంద్రబాబును టార్గెట్ చేస్తే.. అది తమకు లాభం కలిగిస్తుందని.. టీడీపీ నేతలు అంచనాకు వస్తున్నారు.

వైసీపీ, జనసేనలకు మద్దతిస్తే అది లాభమా..? నష్టమా..?

చంద్రబాబు… తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పటి నుంచి.. ఆ మాటకొస్తే.. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి… కేసీఆర్ ఒకటే ప్రచారం చేశారు. చంద్రబాబు పెత్తనానికి వస్తున్నారా.. చాన్స్ ఇద్దామా..? అని సెంటిమెంట్ రెచ్చగొట్టారు. ఇప్పుడు.. కేసీఆర్ ఏపీలో అడుగు పెట్టినా… ఆయన పార్టీ పోటీ చేసినా.. ఎవరికైనా మద్దతిచ్చినా… ఇదే తరహా సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు టీడీపీ ప్లాన్ రెడీ చేసుకుందని మాత్రం స్పష్టమవుతోంది. అయితే… ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ ఎంట్రీ చంద్రబాబుకు లాభం చేస్తుందా..? నష్టం చేకూరుస్తుందా..? అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. టీడీపీ తెలంగాణలో పోటీ చేసినప్పుడు.. తాము ఎందుకు ఏపీలో పోటీ చేయకూడదని..టీఆర్ఎస్ అనొచ్చు. టీడీపీ.. తెలుగువాళ్లు ఎక్కడ ఉంటే.. అక్కడ పోటీ చేస్తామని టీడీపీ చెబుతోంది. ఒడిషాలో కూడా పోటీ చేయడానికి సిద్ధమవుతోంది. అలాగే.. ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్ ఎవరితోనైనా పొత్తు పెట్టుకునే చాన్స్ ఉందా..?. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే.. తమకు వచ్చే లాభం ఏమీ లేదని… జరిగేది నష్టమేనని.. వైసీపీ, జనసేనలకు ఇప్పటికే అర్థం అయింది. అందుకే.. వైసీపీ నేతలు.. టీఆర్ఎస్ మద్దతు తమకు అవసరం లేదని ప్రకటనలు చేస్తున్నారు.

విమర్శలు చేసి ఇరుకున పెడతారా..?

ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా… మద్దతు ఇవ్వకపోయినా… పరోక్షంగా ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉంది. కేసీఆర్ బీజేపీయేతర, కాంగ్రెస్సేతర ఫ్రంట్ పెడతామని ప్రకటించారు. చంద్రబాబు ఇప్పటికే కాంగ్రెస్ కూటమిలోఉన్నారు. ఫెడరల్ ఫ్రంట్ లో ఉండే అవకాశం వైసీపీ, జనసేనలకు మాత్రమే ఉన్నాయి. వైసీపీ ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్‌కు అనుకూలంగా మాట్లాడుతోంది. ఇలా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌ లో వైసీపీ భాగమయితే.. టీడీపీ మళ్లీ… వైసీపీని అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ పెత్తనానికి వస్తుందని ప్రచారం మొదలు పెడతారు. అందువల్ల ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ ఏ పాత్ర పోషిస్తారు..? చంద్రబాబు నాయుడ్ని ఓడించడానికి ఏం చెబుతారు అన్నదానిపై క్లారిటీ లేదు. అయితే కేసీఆర్ సొంతంగానే కూటమి ద్వారానో… ఏపీ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు కానీ.. తెలుగుదేశం పార్టీపై తీవ్రమైన విమర్శలు చేయవచ్చు. ప్రత్యేకహోదా విషయంలో.. ఆయన ఇప్పటికే విమర్శలు చేశారు. కేసీఆర్ విమర్శలను ఎదుర్కోవడం…టీడీపీకి సమస్యగా మారే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.