ప్రొ.నాగేశ్వర్ : టీఆర్ఎస్ పై మోడీ విమర్శల్లో నిజం ఉందా..?

తెలంగాణలో రాజకీయ వాతావరణం…పూర్తి స్థాయిలో వేడెక్కింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా తెలంగాణలో రెండు సభల్లో పాల్గొన్నారు. ఈ సభల్లో ఆయన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసినప్పటికీ… తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ పైనా ఘాటు విమర్శలు చేశారు. అందులో ఒకటి.. ఆయన నాయకత్వం మొత్తం కాంగ్రెస్ పార్టీలో నేర్చుకున్నారని.. దాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నారని.. నిజామాబాద్ లో అన్నారు. మహబూబ్ నగర్ వచ్చే సరికి టీడీపీని కలిపారు. సోనియా, చంద్రబాబు దగ్గర అప్రెంటిస్ చేశారని.. అందుకనే వాళ్లలాగనే అప్రెంటిసీ చేశారని విమర్శలు చేశారు.

కాంగ్రెస్ తో కేసీఆర్ కు లింక్ పెట్టడం కరెక్టేనా..?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. తన స్పీచ్ ను సొంతంగా రాసుకున్నారో.. లేదా ఎవరా రాసిచ్చారో కానీ… ఇవి కాస్త విపరీత ఆరోపణలే. అప్రెంటిస్ విషయం చూస్తే ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షునిగా ఉన్న కన్నా లక్ష్మినారాయణ ఎవరి దగ్గర అప్రెంటిస్ షిప్ చేశారు. ఇలా మాట్లాడితే జనం నవ్వుకోరా..? బీజేపీ ఏపీ అధ్యక్షుడు… జీవిత కాలం మొత్తం కాంగ్రెస్ లో అప్రెంటిస్ షిప్ చేసిన వ్యక్తిని.. అదీ కూడా… జగన్ దగ్గరకు అప్రెంటిస్ షిప్ చేసేందుకు వెళ్లే సమయంలో బీజేపీ .. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఆఫర్ ఇవ్వడంతో ఆయనకు బీపీ వచ్చింది. పురంధేశ్వరి ఎవరి దగ్గర అప్రెంటిస్ షిప్ చేశారు..?. పురంధేశ్వరి యూపీఏ ప్రభుత్వంలో పదేళ్లు మంత్రిగా ఉన్నారు. కేసీఆర్… చాలా పరిమిత కాలమే ఉన్నారు. అస్సాం లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్, అస్సాగణపరిషత్ లాంటి పార్టీలకు రాష్ట్ర అధ్యక్షులుగా చేసిన వారిని బీజేపీలో చేర్చుకుని రాజకీయాలు చేస్తున్నారు. అలాంటిది.. సంకీర్ణ రాజకీయాల్లో భాగంగా.. తెలంగాణ సాధన రాజకీయాల్లో భాగంగా.. కేసీఆర్ కాంగ్రెస్ కూటమి చేరారు. అందులో తప్పపట్టవలసింది ఏముంది..?. మోడీ స్థాయిలో ఈ ఆరోపణలు చేయడం ఆశ్చర్యం వేస్తోంది.

తెలంగాణలో బీజేపీకి వంద సీట్లలో డిపాజిట్లొస్తాయా..?

అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ… కాంగ్రెస్, టీఆర్ఎస్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నాయని విమర్శించారు. ఆ రెండు పార్టీల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ అయితే.. మరి ఎవరి మధ్య సీరియస్ ఫైట్ నడుస్తోంది. బీజేపీతోనా..? అందుకే.. కేసీఆర్ చాలెంజ్ చేశారు… బీజేపీ వంద సీట్లలో డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ చేశారు. నిజానికి అదే పరిస్థితి కూడా. తెలంగాణలో టీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్య ప్ఱెండ్లీ మ్యాచ్ నడుస్తోంది అంటే.. దేశంలో బీజేపీ , కాంగ్రెస్ మధ్య కూడా అలాంటి మ్యాచ్ నడుస్తున్నట్లే కదా..! . అందువల్ల ఓ ప్రాతిపదిక ఉండాలి. ప్రధానమంత్రి స్థాయిలో విమర్శలు చేసేటప్పుడు.. ఓ ప్రాతిపదిక ఉండాలి. రేపు టీఆర్ఎస్ ఢిల్లీలో అవకాశం వస్తే.. బీజేపీ కూటమిలోనే చేరుతుంది. కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి కాబట్టి.. కేసీఆర్.. ఆ పార్టీ పంచన చేరడానికి కేసీఆర్ ఆలోచిస్తారు. తక్కువ అవకాశాలు ఉంటాయి. ఏమైనా అవకాశం ఉంటే… బీజేపీ ప్రభుత్వంలోనే.. టీఆర్ఎస్ చేరుతుంది. అవకాశం వస్తే.. మోడీ సర్కార్ లో చేరుతామని.. స్వయంగా కవితనే చెప్పారు. తెలంగాణలో పోటీ టీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్య ఉంది. అలాంటిది.. వారి మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ ఉందని విమర్శించడం ప్రధాని స్థాయి కాదు.

పాలమూరుకు కేంద్రం ఏం చేసింది..?

అలాగే.. కృష్ణా, తుంగభద్ర ప్రవహిస్తున్న నేలపై నీటికి కటకటేటి అన్నారు. నీళ్లడిగేత పాలిచ్చే పుణ్యభూమి అన్నారు. పాలు, పెరుగులు నదులుగా ప్రవహించడం వల్ల… దానికి పాలమూరుగా పేరు వచ్చిందన్నారు. చాలా బాధపడ్డారు. అయితే ఈ పరిస్థితులను మార్చేందుకు మోడీ ఏం చేశారు..?. ఇదే మహబూబ్ నగర్ గడ్డపైనే… బీజేపీ ముఖ్యనేత సుష్మస్వరాజ్.. పాలమూరు ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇస్తామన్నారు. కానీ ఇవ్వలేదు. అదేదో ఇచ్చి పుణ్యం కట్టుకోవచ్చు కదా..!. ఇస్తామని చెప్పి కూడా ఎందుకివ్వలేదు..?

బీజేపీలో వారసత్వ రాజకీయాలు లేవా..?

మరో విమర్శ కూడా మోదీ చేశారు.. టీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని విమర్శించారు. కానీ అలా పరివార్ పార్టీల్లో మోడీకి ఒక్క టీఆర్ఎస్ గురించే తెలుసా..? బీజేపీ శివసేనతో పొత్తు పెట్టుకుంది.. పీడీపీతో పొత్తు పెట్టుకుంది.. టీడీపీతో పొత్తు పెట్టుకుంది. ఇలాంటి వన్నీ కుటుంబపార్టీలు కాదా.. ఆయా పార్టీలతో ప్రచారం చేసినప్పుడు.. ఇలాంటి విమర్శలు ఎందుకు చేయలేదు. .?. ఇప్పటికైనా ఏపీకి వెళ్లి జగన్మోహన్ రెడ్డి పార్టీ.. కుటుంబపార్టీ అని విమర్శిస్తారా..?. అంత ఎందుకు.. బీజేపీ జాతీయ స్థాయిలో కుటుంబ పార్టీకాకపోవచ్చు కానీ.. ప్రాంతీయ స్థాయిలో ఆ పార్టీకి చెందిన నేతలు.. వారి వారసులే… కీలక పాత్ర పోషిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.