ప్రొ.నాగేశ్వర్ : మోదీని ఎదుర్కొనే దమ్ము విపక్షాలకు ఉందా..?

రేపో మాపో ఎన్నికల ప్రకటన రానున్న సమయంలో బీజేపీ, నరేంద్రమోడీకి వ్యతిరేకంగా… విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన ధర్నా తర్వాత.. శరద్ పవార్ ఇంట్లో విపక్ష నేతలందరూ సమావేశమై… ఓ కూటమిగా ఏర్పడాలని నిర్ణయించారు. అది కూడా.. ఎన్నికలకు ముందు ఓ కూటమిగా ఏర్పడాలనే ఆలోచన చేస్తున్నారు. ఇది సాధ్యమవుతుందా..?

బీజేపీయేతర పార్టీలన్నీ ఎన్నికలకు ముందు కూటమి ఖాయమేనా..?

ఎన్నికలకు ముందే… కాంగ్రెస్ నేతృత్వంలో ఓ జాతీయ కూటమిని ఏర్పాటు చేయాలన్న ఆలోచన… విపక్ష పార్టీల్లో ప్రారంభమైంది. మమతా బెనర్జీ లాంటి నేతలు కూడా.. ఈ కూటమి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ కూటమిలో ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. మమతా బెనర్జీ – చంద్రబాబు మధ్య ప్రీ పోల్ అలయెన్స్ ఏమి ఉంటుంది. బెంగాల్‌కు, ఏపీల్లో తప్ప.. వారి పార్టీలు.. ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయవు కదా. అలాగే కూటమిలోని ఇతర పార్టీలైన జేడీఎస్, ఆప్, ఎస్పీ లాంటి పార్టీలతో.. ఇతర పార్టీలతో పొత్తులేమీ ఉండాల్సిన అవసరం లేదు. ఉండవు కూడా. ఒకరికి ఒకరు పోటీ కాదు. కాబట్టి.. ప్రిపోల్ అలయెన్స్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. అయినా కూడా.. పార్టీలన్నీ.. ప్రిపోల్ అలయెన్స్‌కు ముందుకు వస్తున్నాయి.

పెద్ద పార్టీగా అవతరించే బీజేపీకి అడ్వాంటేజ్ రాకూడదనే ప్రయత్నమా..?

పరస్పర రాజకీయ ప్రయోజనాలు లేకపోయినప్పటికీ… బీజేపీయేతర పక్షాలన్నీ.. ప్రిపోల్ అలయెన్స్‌కు ముందుకు రావడానికి ఓ గట్టి కారణం ఉంది. వచ్చే ఎన్నిభారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గుతాయి. వంద సీట్లు తగ్గుతాయా.. అంత కన్నా ఎక్కువ తగ్గుతాయా.. అన్నదానిపై అనేక విశ్లేషణలు ఉన్నప్పటికీ.. సీట్లు మాత్రం తగ్గుతాయి. బీజేపీకి పెద్దగా మిత్రులు కూడా లేరు. శివసేన కూడా విడిగా పోటీ చేస్తే.. బీజేపీకి ఒంటరిగా… మెజార్టీ కన్నా.. చాలా దూరంగా ఉంటుంది. అయితే.. బీజేపీకి తగ్గుతాయి కానీ.. కాంగ్రెస్‌కు పెరుగుతాయా.. అన్నదే ఇక్కడ కీలకం. హంగ్ వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే.. రాష్ట్రపతి రూపంలో బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే.. ఎన్నికల తర్వాత.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానంలో రాష్ట్రపతికి ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి. రాష్ట్రపతి నిష్పాక్షికగా ఉండాలని మనం కోరుకుంటాం.. కానీ.. ఆయన కూడా.. బీజేపీ నేతనే. ఆరెస్సెస్ నుంచి వచ్చిన వ్యక్తే. రాజకీయ భావాలున్న వ్యక్తే. అందుకే.. ఆయన నిర్ణయం బీజేపీకి అనుకూలంగా ఉంటుందని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. హంగ్ వచ్చి.. బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించినా… ఎన్నికల తర్వాత కూటమి కట్టిన పార్టీలకు మెజార్టీ ఉన్నప్పటికీ… రాష్ట్రపతి.. బీజేపీని ఆహ్వానించే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఆ పార్టీలన్నీ.. ఎన్నికల్లో విడిగా పోటీ చేశాయి.. కూటమి కట్టలేదని.. పోస్ట్ పోల్ అలయెన్స్‌ను గుర్తించబోమని చెప్పే అవకాశం ఉంది. ఈ ప్రమాదాన్ని నివారించడానికి జరుగుతున్న ప్రయత్నమే ప్రిపోల్ అలయెన్స్.

రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకోకుండా కూటమి ఎలా సాధ్యం..?

ప్రిపోల్ అలయెన్స్‌లో ప్రధానంగా జరగాల్సింది.. రాష్ట్రాల స్థాయిలో… బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌లు ఏర్పడాలి. ఈ విషయంలో.. ఓ కీలక పరిణామం జరిగింది. మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ… చర్చించుకున్నారు. బెంగాల్‌లో ప్రిపోల్ అలయెన్స్‌కు సిద్ధమని ఆమె ప్రకటించారు. అలాగే.. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ పార్టీలు కాంగ్రెస్‌ను కలుపుకునే ప్రయత్నం చేయలేదు. ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్.. ప్రిపోల్ పెట్టుకోలేదు. పెట్టుకుంటామని చెబుతున్నారు. కానీ సాధ్యమేనా అన్నదానిపై అనుమానాలున్నాయి. రాష్ట్రాల్లో ప్రిపోల్ అలెయన్స్‌ను పెట్టుకోబోమని.. దేశంలో పెట్టుకుంటామని చెబుతున్నారు. రాష్ట్రాల్లో లేని అలయెన్స్.. దేశంలో ఎలా వస్తుంది. రాష్ట్రాలన్నీ కలిపితేనే … దేశం కదా..! . నిజంగా.. మోడీకి వ్యతిరేకంగా.. కూటమి కట్టాలంటే… యూపీలో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీ, ఢిల్లీలో ఆప్ కాంగ్రెస్, బెంగాల్ లో టీఎంసీ, కాంగ్రెస్, కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్, ఏపీ, తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ కూటమిగా పోటీ చేయాలి. రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకోకుండా.. జాతీయ స్థాయిలో మాత్రమే పొత్తులు పెట్టుకుంటామంటే… అది ఎంత వరకు సాధ్యమవుతుందగో మాత్రమే చెప్పలేం. రాష్ట్రాల్లో కలవకపోయిన దేశంలో కలుస్తామని చెప్పడం మాత్రం.. కాస్త ఆచరణ సాధ్యం కానిదిగానే కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com