ప్రొ.నాగేశ్వర్ : ఎన్నికలకు ముందు చేరికల రాజకీయాలెందుకు..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయారాం..గయరాంల సీజన్ ప్రారంభమయింది. రేపోమాపో ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్న ప్రచారం.. టిక్కెట్లు, ఇతర రాజకీయ అవసరాలు చూసుకుని నేతలు… పార్టీలు మారుతున్నారు. వైసీపీలో ఓ ఎమ్మెల్యే, ఎంపీ చేరారు. రాజకీయాల్లో ఇది సహజమే కానీ.. ఇలా పార్టీలు మారుతున్న వారు.. టీడీపీలో ఉన్నంత కాలం.. చంద్రబాబు ఇంద్రుడు, చంద్రుడు అని పొగిడి.. లోటస్ పాండ్ దగ్గరకు వెళ్లేసరికి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఆ అలాంటి రాజకీయ నేతను చూడలేదంటున్నారు. ఈ విమర్శలను ప్రజలు నమ్ముతారా..?

అమంచి, అవంతి ఎల్లకాలం వైసీపీలోనే ఉంటారా..?

రాజకీయ నాయకులు చేసే విమర్శలు… వారు మనస్ఫూర్తిగా చేస్తారని.. మనం నమ్మకూడదు. వారి విమర్శలు కూడా రాజకీయ కోణంలోనే ఉంటాయి. నిన్నామొన్నటి వరకు.. కేసీఆర్ మంత్రి వర్గంలో ఉన్న ఓ మంత్రి ఒకప్పుడు టీడీపీలో ఉన్నారు. ఆయన ఓ సారి.. ఉదయం టీవీ డిబేట్‌లో నాతో పాల్గొన్నారు. ఆ సమయంలో కేసీఆర్‌ను ఇష్టం వచ్చినట్లు తిట్టారు. టీవీ చర్చలో.. ఇష్టం వచ్చినట్లు కేసీఆర్‌ను తిట్టి.. ఆ తర్వాత నేరుగా ఢిల్లీకి వెళ్లారు. కేసీఆర్ అప్పుడు.. ఢిల్లీలో ఉన్నారు. కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిపోయారు. అంటే.. ఉదయం కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించి.. మధ్యాహ్నానికి గులాబీ కండువా కప్పుకున్నారు. అలా జరగాలంటే.. ఆయన ముందుగానే.. పార్టీలో చేరేందుకు మాట్లాడుకుని ఉండాలి. మాట్లాడుకుని కూడా.. కేసీఆర్ ను విమర్శించారు. రాజకీయ పార్టీలు కూడా వీరిని ప్రొత్సహిస్తున్నాయి. తప్పు రెండు వైపులా ఉంది. వారు చేర్చుకుంటున్నారు కాబట్టే.. తాము అలా మాట్లాడతామని వారంటారు. ఇప్పుడు టీడీపీపై విమర్శలు చేసిన ఆమంచి కానీ.. అవంతి కానీ.. రేపు మరో పార్టీలో చేరితే ఇలాంటి విమర్శలు చేయరని గ్యారంటీ లేదు. వీరు.. తమ వాదనకే కట్టుబడి… జీవితాంతం… రాజకీయ అవకాశాలు లేకపోయినా… వైసీపీలోనే ఉంటారని జగన్మోహన్ రెడ్డి కూడా నమ్మరు.

తీవ్రంగా విమర్శించిన ఎమ్మెల్యేలను టీడీపీలోకి ఎందుకు చేర్చుకున్నారు..?

చంద్రబాబు నాయుడ్ని తీవ్రంగా విమర్శించిన వైసీపీ ఎమ్మెల్యేలను… టీడీపీలో చేర్చుకున్నారు. తమ అవసరం ఉంది కాబట్టే.. పార్టీలో చేర్చుకున్నారని వారు అంటున్నారు. ప్రజలు కూడా.. ఈ విషయంలో… పెద్దగా పట్టింపులు లేకుండా ఉంటున్నారు. వారు ఏ పార్టీలో ఉండి.. ఎలా మాట్లాడినా.. ఏ పార్టీకి మారినా ప్రజలు గెలిపిస్తున్నారు. తెలంగాణలో జరిగింది అదే. ఫిరాయింపులు.. ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని.. ఎంత మంది మేధావులు గొంతు చించుకున్నా.. ప్రజలు ఓట్లు వేస్తే.. అది ఒప్పవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే కరెక్ట్. ప్రజాతీర్పులో గెలిచిన తర్వాత… తమ నిజాయితిని తాము నిరూపించుకున్నామని.. వారు ఫీలవుతున్నారు. అందరూ.. ఫిరాయింపులకు పాల్పడుతున్న నేతలే. పార్టీల అధ్యక్షులే తప్ప.. ఏ ఒక్క నేతా.. అదే పార్టీకి కట్టుబడి ఉంటారన్న గ్యారంటీ లేదు. పార్టీ ఇచ్చిన పదవులన్నింటినీ అధిగమించి.. ఇప్పుడు టిక్కెట్ కోసం మరో అవసరం కోసం. .. పార్టీ మారుతున్నారని చంద్రబాబు విమర్శిస్తున్నారు. టీడీపీలో కూడా అలా చేరిన వాళ్లు ఉన్నారు కదా..!

ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేరిపోవడం నయా నేతల లక్షణమా..?

తమ దగ్గరకు వస్తే పుణ్యకార్యం.. వేరే పార్టీలోకి వెళ్తే పాపం.. అన్నట్లుగా.. రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నాయి. రాజకీయ పార్టీలు చేర్చుకుంటున్నాయి కాబట్టి.. ఆ నేతలు అలా వ్యవహరిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఇలానే వ్యవహరిస్తున్నాయి. ప్రజలు ఫిరాయింపుదారులను శిక్షించనంత కాలం.. రాజకీయ పార్టీలు ఇలా నేతల్ని ఆహ్వానిస్తూనే ఉంటాయి. వారికి ఎన్నికల్లో గెలవడమే… చాలా ముఖ్యం. వెళ్లే వాళ్లు.. ఎందుకు వెళ్తున్నారో.. ప్రజంలదరికీ క్లారిటీ ఉంటుంది. ఒకాయనకు ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి కావాలనే కోరిక ఉంటుంది. ఇప్పుడు ఉన్న చోట.. అది సాధ్యం కాదు. గంటా ఉన్నంత కాలం అవంతికి మంత్రి పదవి రాదు. దానికేం చేయాలి.. వేరే పార్టీలో చేయాలి. ప్రతి పార్టీలోనూ ఈ అంశాలుంటాయి. ఈ గట్టున అవకాశాలు లేవంటే.. ఆ గట్టుకు వెళ్తున్నారు. ఆ గట్టున అవకాశం లేని వారు.. ఈ గట్టుకు వస్తున్నారు. అంటే రాజకీయ నేతలు.. ఏ గట్టునా శాశ్వతగా ఉండరు… ఎక్కడ అవకాశం ఉంటే.. అక్కడ ఉంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com