ప్రొ.నాగేశ్వర్ : ఏపీలో టీఆర్ఎస్ పోటీ చేయగలదా..?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కుమారుడు.. కేటీఆర్.. కొద్ది రోజులుగా.. ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని.. ప్రకటనలు చేస్తున్నారు. రాజకీయంగా చంద్రబాబు అంతు చూస్తామని కూడా చెబుతున్నారు. ఆయన ఇప్పుడే కాదు.. గతంలో కూడా.. ఆయన ఇలాంటి ప్రకటనలు చేశారు. కేసీఆర్‌కు కూడా ఆంధ్రప్రదేశ్‌లో చాలా ఇమేజ్ ఉంది. తాను భీమవరం నుంచి పోటీ చేస్తానని కూడా ప్రకటించుకున్నారు.

ఆంధ్రలో తెలంగాణ పార్టీ పోటీ ఎలా సాధ్యం..?

సహజంగా.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ.. ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే.. తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్. . భారతీయుల కోసం పార్టీ అయితే ఎక్కడైనా పోటీ చేయవచ్చు. కానీ… ప్రాంతీయ పార్టీలు.. ఉప ప్రాంతీయపార్టీలు.. తమ తమ పరిధుల మేరకే పోటీ చేయగలవు. తమిళనాడులోని ద్రవిడ పార్టీలు చిత్తూరులో పోటీ చేయలేవు. అలాగే కర్ణాటక , ఒడిషాలోని ప్రాంతీయ పార్టీలు కూడా ఉంతే. భాషా ప్రాతిపదికన రాజకీయ పార్టీలు ఏర్పడినప్పుడు.. ఆ భాష మాట్లాడే రాష్ట్రాల్లో పోటీ చేస్తారు. తెలుగుదేశం అని పార్టీ పెట్టుకున్నారు కాబట్టి… రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తామని టీడీపీ చెబుతోంది. అంగీకరిస్తారా లేదా..అన్నది ప్రజల ఇష్టం. అయితే ఏపీ ప్రజలు అంగీకరించినట్లుగా.. తెలంగాణ ప్రజలు అంగీకరించలేరు. అలాగే ఒక ప్రాంతానికే పరిమితమైన పార్టీ.. ఆ ప్రాంతాన్ని దాటి బయటకు వెళ్లి పోటీ చేయడం సాధ్యం కాదు. జార్ఖండ్ ముక్తి మోర్చా .. వెళ్లి బీహార్‌లో పోటీ చేయలేదు కదా..! అందుకే…ప్రాక్టికల్‌గా సాధ్యం కాదు.

పెళ్లికి వెళ్లినప్పుడు ఆదరించారని ఓట్లు వేస్తారా..?

జేడీఎస్, ఎన్సీపీ లాంటి పార్టీలు.. భాషా పార్టీలు కాదు. కానీ.. ఇతర ప్రాంతాల్లోకి వెళ్లలేకపోయింది. ఇక ఎస్పీ, బీఎస్పీ లాంటివి యూపీలోనే ఉంటాయి. ఇతర రాష్ట్రాల్లో పెద్దగా ఉనికి ఉండదు. ఇక తృణమూల్ కాంగ్రెస్.. బెంగాల్‌లో మాత్రమే ఉంది. అకాలీదళ్ పంజాబ్ దాటి రాలేకపోయింది. అందుకే… ఈ పార్టీల తీరును పరిశిస్తే… టీఆర్ఎస్‌ ఏపీలో పోటీ చేస్తుందని.. కానీ.. ఆ దిశగా.. కేసీార్ ఆలోచిస్తారని కానీ నేను అనుకోవడం లేదు. కేసీఆర్‌ పట్ల ఏపీ ప్రజల్లో అభిమానం ఉంది. కారణం ఏమిటంటే… ఉద్యమ సమయంలో.. ఆంధ్రుల్ని నిందించారు. తెలంగాణ వస్తే.. ఆంధ్రుల్ని తరిమేస్తారని అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఆంధ్రులకు ఏ ఇబ్బందీ కలగలేదు. ఈ కారణాల రీత్యా… కేసీఆర్‌పై ఏపీ ప్రజల్లో అభిమానం ఉంటుంది. అయితే.. ఇది ఓటింగ్ గా మారే అభిమానం కాదు. చంద్రబాబునాయుడు గురించి ఒడిషాలో కూడా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే చంద్రబాబు కు దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. యూపీలోనూ.. చంద్రబాబుపై అభిమానం చూపేవారు ఉంటారు. అంత మాత్రాన.. ఆయన పార్టీని అక్కడకు విస్తరించలేరు కదా.. ఆ అభిమానం వేరు.. ఓటింగ్‌గా మారే అభిమానం వేరు.

సీమాంధ్రులు వేరు.. టీడీపీ వేరు అని చెప్పడానికేనా ఆ వ్యాఖ్యలు..!?

మరి కేటీఆర్ ఎందుకు హెచ్చరికలు జారీ చేశారు..? తెలంగాణ ఎన్నికల ప్రచారం చంద్రబాబు చురుకుగా వ్యవహరిస్తున్నారన్న కారణంగా.. ఇరిటేట్ అయి… ఈ వ్యాఖ్యలు చేశారా..? అంటే.. కాదని చెప్పుకోవాలి. కచ్చితంగా కేటీఆర్ మాటల వెనుక.. రాజకీయ సమీకరణాలు ఉంటాయి. చంద్రబాబు… ఈ స్థాయిలో తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేస్తారని ఊహించలేదు. అందుకే చంద్రబాబును ప్రచారంలోకి దింపాలని హరీష్ సవాల్ చేశారు. ఎందుకంటే… చంద్రబాబు తెలంగాణలోకి రారని అనుకున్నారు… అందుకే సవాళ్లు చేశారు. కానీ.. చంద్రబాబు వాళ్లు ఊహించని విధంగా ప్రచారానికి వచ్చారు. ఫలితంగా..ఇప్పుడు కౌంటర్‌ చేయడానికి టీఆర్ఎస్ నేతలు మాట్లాడాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో.. చంద్రబాబును టార్గెట్ చేద్దామా… సీమాంధ్రులా..అన్న ప్రస్తావన వచ్చింది. అందుకే చంద్రబాబును మాత్రమే కానీ.. సీమాంధ్రుల్ని అనడం లేదని క్లారిటీ ఇవ్వాలనుకున్నారు. అందుకే అలా మట్లాడారు. చంద్రబాబు మీదే కోపం ఉందని..సీమాంధ్ర ఓటర్ల మీద లేదని చెప్పుకునే ప్రయత్నం చేశారనుకోవచ్చు.

సీమాంధ్రుల ఓట్లను చీల్చడమే అసలు లక్ష్యమా..?

ఇక.. సీమాంధ్ర ఓటర్లందరూ.. చంద్రబాబు వైపు ఉంటారన్నట్లుగా…చర్చలు జరుగుతున్నాయి. కానీ.. అలా లేదు పరిస్థితి. జగన్, పవన్ లు… టీడీపీకి మద్దతు ప్రకటించడం లేదు. కూకట్ పల్లిలో… టీడీపీ, వైసీపీ,జనసేన కు సపోర్ట్ చేసే వాళ్ల వర్గాలున్నాయి. సీమాంధ్ర ఓటర్లు అనే భావన గంపగుత్తగా… ప్రజాకూటమికి పడకూడదన్నది.. కేటీఆర్ వ్యహం. కనీసం.. సగం ఓట్లను.. యాంటీ చంద్రబాబు ఓట్లుగా మారాలన్నది..కేటీఆర్ వ్యూహం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.