ప్రొ.నాగేశ్వర్ : చంద్రబాబు మళ్లీ బీజేపీకి దగ్గరవుతాడా..?

భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు మిత్రుల అవసరం ఏమిటో తెలుస్తున్నట్లుగా ఉంది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. తెలుగుదేశం మళ్లీ తమతో కలసి వచ్చినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత.. మోడీ మరో సారి ప్రధానమంత్రి కాకూడదన్న లక్ష్యంతో… బీజేపీయేతర కూటమి ప్రయత్నాలను చంద్రబాబు సీరియస్‌గా చేస్తున్నారు. ఈ తరణంలో.. రామ్ మాధవ్.. మళ్లీ టీడీపీ పై ఆశలు పెట్టుకున్నట్లుగా మాట్లాడారు.

విశాఖపట్నంలో రామ్‌మాధవ్ ఏం చెప్పారు..?

విశాఖపట్నంలో జరిగిన ఇండియాటుడే సదస్సులో.. రామ్ మాధవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఆయనను అడిగిన ప్రశ్న ఏమిటంటే… తెలంగాణలో బీజేపీ అంత ఘోరంగా ఎందుకు ఓడిపోయింది..? అని. దానికి ఆయన చెప్పిన సమాధానం… తమను… టీఆర్ఎస్‌ను ప్రజలు వేర్వేరుగా భావించలేదన్నారు. అది నిజమే. గతంలో నేను చాలా సార్లు విశ్లేషణల్లో చెప్పారు. భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ మిత్రుడో, శత్రువో తేల్చుకోలేని పరిస్థితి ఉందని. గతంలో కేంద్రమంత్రులు ఎప్పుడు వచ్చిన కేసీఆర్‌ను పొగిడి వెళ్తారు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా.. ఆయనను పార్లమెంట్‌లో పొగుడుతారు. పరిపాలన దక్షత ఉన్న నేతగా పొగుడుతారు. ఇక్కడ బీజేపీ నేతలు మాత్రం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తూంటారు. అసలు అభివృద్ధేమీ జరగడం లేదని..అంతా అవినీతి చేస్తున్నారని విమర్శలు చేస్తూంటారు. మిషన్ భగీరథ అనే ప్రాజెక్ట్ లో వేల కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ నేతలు ఎన్నో విమర్శలు చేశారు. బీజేపీ నేతలు చెప్పిన ఆ అవినీతిమయ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడానికి నేరుగా మోడీ వచ్చారు. ఇలాంటి విధానం మొదటి నుంచి ఉంది. అందుకే.. రామ్‌మాధవ్… టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని ప్రజలు భావించడం వల్ల తమకు ఓటమి ఎదురయిందని చెప్పుకొచ్చారు.

టీడీపీ కోసం బీజేపీ అంత ఆరాట పడుతోందా..?

విశాఖపట్నం ఇండియా టుడే సదస్సులో.. తెలంగాణలో బీజేపీ ఎందుకు ఓడిపోయిందనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ… టీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని ప్రజలు భావించినప్పుడు.. ఆ పార్టీతో 2019లో పొత్తులు పెట్టుకోవచ్చు కదా.. అని ప్రయోక్త.. అడిగితే .. దానిదేముందు పెట్టుకుంటాం…. టీడీపీ కూడా తమతో కలసి వచ్చినా ఆశ్చర్యం లేదన్నట్లుగా వ్యవహరించారు. ఇప్పుడు ప్రజలకు రామ్‌మాధవ్, బీజేపీ నేతలు సమాధానం చెప్పాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ నేతలు.. చంద్రబాబును తీవ్రంగా విమర్శిస్తున్నారు. పోలవరం సహా.. ప్రతీ దాంట్లోనూ అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ప్రతీ విషయాన్ని విమర్శిస్తున్నారు. అయినప్పటికీ.. చంద్రబాబును ఎన్డీఏలో చేర్చుకోవడానికి ఎందుకు ఉత్సాహపడుతున్నారు..?. ఈ అంశం టీడీపీకి వర్తిస్తుంది. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం చారిత్రక తప్పిదం అన్నారు. కానీ తర్వాత కలిశారు. ఇప్పుడు మోడీ పర్యటనను అడ్డుకుంటామంటున్నారు. ఇలాంటి సందర్భంలో ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని.. చంద్రబాబు చెప్పగలరా..?. గతంలో ఇలా చెప్పి.. మళ్లీ బీజేపీతో కలిశారు కాబట్టే.. ఇలాంటి సందేహాలు వస్తున్నాయి.

కౌంటింగ్ జరగకముందే టీఆర్ఎస్‌కు మద్దతిస్తామని బీజేపీ ఎందుకు అన్నది..?

రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం తప్పు కాదు.. కానీ ఇలా… ఓ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసి.. అదే పార్టీతో పొత్తులు పెట్టుకోవడం ప్రజల్ని మోసం చేయడమే. తెలంగాణ ఎన్నికల్లోనూ ఇది చూశాం. ప్రధానమంత్రి నరేంద్రమోడీ వచ్చి… కేసీఆర్.. అవినీతి కాంగ్రెస్… అవినీతి చంద్రబాబు వద్ద ట్రైనింగ్ తీసుకున్నారని ఆరోపించారు. ఆ తర్వాత జరిగింది ఏమిటి..? ఎన్నికల ఫలితాలు రాక ముందు… తాము టీఆర్‌ఎస్‌కు మద్దతిస్తామని ప్రకటించారు. ఇలాంటి ఘటనల వల్ల… రాజకీయ పార్టీలపై ప్రజలకు నమ్మకం పోతోంది. ఇప్పుడు రాజకీయ పార్టీలకు పొత్తులకు ప్రాతిపదిక అధికారం మాత్రమే అయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.