ప్రొ.నాగేశ్వర్ : మోడీ, మమతా కూడబలుక్కునే రాజకీయం చేస్తున్నారా..?

కోల్‌కతాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చకు కారణం అవుతున్నాయి. సీబీఐ అధికారులు.. కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను.. అరెస్ట్ చేసేందుకు వెళ్లడం.. అదే సమయంలో.. పోలీస్ కమిషనర్‌ను అరెస్ట్ చేస్తే.. కోల్‌కతాలోని సీబీఐ జాయింట్ డైరక్టర్‌ను అరెస్ట్ చేయడానికి… బెంగాల్ పోలీసులు… ఆయన ఇంటిని చుట్టముట్టడంతో పరిస్థితి తీవ్రంగా మరిపోయింది. ఆ తర్వాత కేంద్ర భద్రతా దళాలు కూడా… సీబీఐ జాయింట్ డైరక్టర్‌కు.. సపోర్ట్‌గా వచ్చాయి. అంటే.. బెంగాల్‌లో స్టేట్ పోలీస్ వర్సెస్ సెంట్రల్ పోలీస్ అన్నట్లుగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది…?

శారదా చిట్ ఫండ్ స్కాంలో నాలుగున్నరేళ్లు ఏం చేశారు..?

శారదా చిట్‌ఫండ్ స్కాం విచారణ 2013లో ప్రారంభమయింది. మోడీ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లయింది. ఈ స్కామ్‌కు సంబంధించిన ప్రతీ డాక్యుమెంట్.. కీలకమైన ఆధారం సీబీఐ వద్ద ఉన్నాయని.. భారతీయ జనతా పార్టీ నేతలు.. చాలా కాలంగా చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత టీవీచానళ్లలోనూ చెప్పారు. మరి ఇప్పుడు ఎలాంటి డాక్యుమెంట్ల కోసం.. పోలీస్ కమిషనర్ వద్దకు వెళ్లారో మరి..!శారదా చిట్ ఫండ్ స్కాంలో.. తృణమూల్ నాయకులు ఉన్నారన్నది నిజం. ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ తో పాటు మరికొంత మందిని అరెస్ట్ చేశారు. మమతా బెనర్జీకి కూడా సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. అయితే ప్రత్యక్షంగా సంబంధం ఉందా లేదా.. అన్నది తేలాల్సి ఉంది. లక్షలాది మంది బాధితులు ఉన్నారు. మరి ఎందుకు ఈ నాలుగున్నరేళ్ల పాటు.. నరేంద్రమోడీ… కానీ సీబీఐ కానీ సైలెంట్‌గా ఉన్నారు..? ఈ స్కాంపై విచారణ జరపమని… సుప్రీంకోర్టే ఆదేశించింది. అయినప్పటికీ చాలా కాలం పాటు సైలెంట్‌గా ఉండి.. ఇప్పుడే ఎందుకు హడావుడి చేస్తున్నారు.

మమతా బెనర్జీ ఇక మిత్రపక్షంగా మారదని తేల్చుకున్నాక దాడులు చేస్తున్నారా..?

నాలుగున్నరేళ్ల పాటు మోడీ.. సైలెంట్‌గా ఉండటానికి కారణాలు ఉన్నాయి. బెంగాల్‌లో మమతా బెనర్జీ.. ఎప్పటికైనా మిత్రపక్షం అవుతుందని.. మోడీ, షాలు భావించారు. కానీ.. మమతా బెనర్జీ మాత్రం.. పూర్తిగా యాంటీ బీజేపీ ఫ్రంట్‌లోకి మారిపోయాయి. కోల్‌కతాలో… అంత పెద్ద ర్యాలీ నిర్వహించిన తర్వాత ఇక బీజేపీతో మిత్రపక్షంగా వ్యవహరించే పరిస్థితి లేదని తేలిపోయాక.. సీబీఐలో కదలిక వచ్చింది. ఒక్క మమతా బెనర్జీ విషయంలోనే కాదు.. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ విషయంలోనూ అదే చేశారు. ఆ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకోవాలని నిర్ణయించారు. అధికారిక ప్రకటన చేయబోతున్నారన్న సమాచారం బయటకు రాగానే వారిపై.. సీబీఐ, ఈడీల్ని ప్రయోగించారు. సోదాలు చేశారు.. కొత్త కేసులు నమోదు చేశారు. గతంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలోనూ మాయావతిని టార్గెట్ చేశారు. ఫలితంగానే ఆమె కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోలేదు. టెక్నికల్‌గా… ఒకదానితో ఒకటి సంబంధం ఉండదు. కానీ అంతా రాజకీయంగా జరుగుతోందని మాత్రం.. సులువుగా అర్థం చేసుకోవచ్చు.

జగన్ పై కేసుల్లో ఎందుకు కదలిక లేదు..?

ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నంత కాలం… సీబీఐ, ఈడీ, ఐటీలు … ఏపీలో అడుగు పెట్టలేదు. కానీ.. ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్ని దర్యాప్తు సంస్థలు వరుసగా సోదాలు ప్రారంభించాయి. అలాగే.. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో.. కర్ణాటకకు చెందిన డీకే శివకుమార్ బెంగళూరులో క్యాంప్ ఏర్పాటు చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అందుకే.. డీకే శివకుమార్ పై .. తరచూ ఐటీ, సీబీఐ దాడులు జరుగుతూ ఉంటాయి. అలాగే.. నితీష్ కుమార్.. ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి.. ఆయనపై ఎలాంటి దాడులు జరగవు. జగన్మోహన్ రెడ్డి .. పై సీబీఐ కేసుల్లో నాలుగున్నరేళ్ల పాటు కదలికలేదు. ఎందుకంటే.. ఆయనకు బీజేపీతో కలిసే అవకాశం ఉంది. అయితే.. కేసులు లేకపోతే.. కలుస్తాడన్న గ్యారంటీ లేదు. అందుకే కేసులు ఉండాలి.. వాటిపై నిర్లక్ష్యం చేయాలి. అప్పుడే వారికి రాజకీయ ప్రయోజనం లభిస్తుంది.

పరిస్థితిని రాజకీయం చేసి మమతా, మోడీ ఇద్దరూ లాభపడుతున్నారా..?

సీబీఐలో పరిస్థితులు దిగజారిపోయిన తర్వాత కేవలం రాజకీయ పరమైన కేసుల్లోనే ఆ సంస్థ దర్యాప్తు.. అదీ కూడా.. బీజేపీ , మోడీ వ్యతిరేక వర్గీయులనే టార్గెట్ చేసుకుంటున్నట్లుగా సీబీఐలో పరిస్థితులు ఏర్పడిన సమయంలో.. కోల్‌కతాలో జరిగిన పరిణామాల్లో.. స్పష్టంగా.. మోడీ వ్యూహం కనిపిస్తోంది. దీన్ని మమతా బెనర్జీ.. పక్కాగా ఉపయోగించుకుంటున్నారు. మోడీ వ్యతిరేక శిబిరంలో తనను తాను.. ప్రముఖురాలిగా చూపించుకుంటున్నారు. బీజేపీకి లాభం ఏమిటంటే… అక్కడ తృణమూల్ కి తామే ప్రధాన ప్రత్యర్థి అని చెప్పుకోవడం. అక్కడ సీపీఎం బీజేపీకి ప్రధాన పోటీ ఇస్తోంది. ఇప్పుడు తృణమూల్ వర్సెస్ బీజేపీ అని చెప్పుకోవాలనుకుంటోంది. అలాగే..మమతా బెనర్జీకి దేశవ్యాప్తంగా మద్దతు తెచ్చి పెట్టడం ద్వారా.. ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీకి.. పోటీ తెచ్చి పెట్టినట్లయింది. అందువల్ల ఇది.. మోడీ వర్సెస్ మమతా బెనర్జీ అని అనలేం కానీ.. ఇద్దరికీ.. రాజకీయ ప్రయోజనం మాత్రం కలిగే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.