ప్రొ.నాగేశ్వర్ : తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనలో ఈసీ తొందరపడిందా..?

ఎన్నికల సంఘం.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, మిజోరంలతో పాటు.. తెలంగామ రాష్ట్రానికి కూడా.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్ ఏడో తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. సహజంగా ఇది విమర్శకు తావిచ్చే నిర్ణయం. ఎందుకంటే.. ఓటర్ జాబితాలో అవకతవకలు ఉన్నాయని… కోర్టులో పిటిషన్లు ఉన్నాయి. దీనిపై విచారించిన హైకోర్టు.. ఓటర్ జాబితాను తమకు సమర్పించాలని ఆదేశించింది. అంటే.. ఓటర్ జాబితాలో అవకతవకాలు ఉన్నాయని … సూత్రబద్ధంగా అంగీకరించినట్లే. లేకపోతే.. పిటిషన్ కొట్టి వేసేది. పిటిషన్‌లో ఎంతో కొంత న్యాయం ఉంటేనే విచారణకు స్వీకరిస్తుంది. పైగా తమకు చూపించిన తర్వాత ప్రింట్ చేయాలని ఆదేశించింది కూడా.

ఓటర్ల జాబితా అంశం కోర్టులో ఉన్నా షెడ్యూల్ ఎందుకు ప్రకటించారు..?

హైకోర్టు ఉన్న ఓటర్ల జాబితా ఇష్యూ ఇంకా హైకోర్టు దగ్గరే ఉంది. ఇంకా ఖరారు కాలేదు. అయినప్పటికీ.. ఎందుకు ఆఘమేఘాలపై .. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. మార్చి ఐదో తేదీ వరకూ… ఎన్నికల వరకూ నిర్వహించడానికి అవకాశం ఉంది. రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల సమయం ఎన్నికలు నిర్వహించడానికి. అయినప్పటికీ.. చాలా సమయం ఉన్నప్పటికీ.. ఈ నాలుగు రాష్ట్రాలతో పాటే.. ఎన్నికలు నిర్వహించాలని ఈసీ ఎందుకు తొందరపడింది…? తుది ఓటర్ల జాబితా లేకుండా.. షెడ్యూల్ ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది. ..? దీనికి ఎన్నికల కమిషన్ వద్ద సమాధానం లేదు. కానీ.. పన్నెండో తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని.. దానిపై కోర్టు సంతృప్తి వ్యక్తం చేస్తుందని ఈసీ చెబుతోంది. హైకోర్టు ఓటర్ల జాబితాపై సంతృప్తి వ్యక్తం చేస్తుందా లేదా.. అనేది చెప్పే అధికారం ఈసీకి లేదు. రాజ్యాంగ వ్యవస్థ ఈ విధంగా ఆభిప్రాయపడుతుందని.. మరో రాజ్యాంగ వ్యవస్థ భావించడానికి వీల్లేదు. మరి ఏ విధంగా… హైకోర్టు.. ఓటర్ల జాబితాపై సంతృప్తి వ్యక్తం చేస్తుదని ఎలా భావించింది..? ఒకసారి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక… ఆ షెడ్యూల్‌ను ఆపడం కానీ… జోక్యం చేసుకోవడం కానీ… కోర్టులు చేయవు. అలాంటి అధికారం కోర్టులకు ఉండదు. ఇది భారతదేశ ఎన్నికల చట్టం. ఇది ఈసీకి తెలియుకండా ఉండదు. అందుకని.. కోర్టు పూర్తిగా ఓటర్ల జాబితాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత తెలంగాణకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి ఉండాల్సింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ ఫలితాలు.. తెలంగాణ ఎన్నికలపై ఎలాంటి ప్రభావాన్ని చూపవు. అయినా ఈసీ తొందరపడింది.

తెలంగాణలో సీఈసీ ఎందుకు పర్యటించలేదు..?

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే..కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నేతృత్వంలో.. తెలంగాణకు బృందం వచ్చి.. ఎన్నికల ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో సమీక్షించిన తర్వాతే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలి. ఇది సంప్రదాయం. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు రావత్ వెళ్లారు. ఏర్పాట్లు సమీక్షించి వచ్చారు. కానీ మిజోరంకు వెళ్లలేదు.. అలాగే తెలంగాణకు వెళ్లలేదని రావత్ చెబుతున్నారు. కానీ మిజోరం వేరు… తెలంగాణ వేరు. మిజోరం అంత చిన్న రాష్ట్రం తెలంగాణ కాదు. ఇంకో పాయింట్ కూడా ఉంది. మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్ 15తో ముగుస్తుంది. ఆలోపే.. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సిఉంది. ఇప్పుడు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 11న కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత రాజ్యాంగరపరమైన లాంఛనాలు పూర్తి కావడానికి మూడు, నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంటుంది. సమయం లేదు కాబట్టి.. మిజోరంకు వెళ్లకుండా.. షెడ్యూల్ ప్రకటించడంలో అర్థం ఉంది. కానీ తెలంగాణకు అలాంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ.. ఎన్నికల సంఘం తెలంగాణకు రాకుండానే..షెడ్యూల్ ప్రకటించింది. ఈ రెండు ప్రశ్నలకు… ఈసీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

కేంద్రం ఒత్తిడి చేసి షెడ్యూల్ ప్రకటన చేయించిందా..?

ఎన్నికల సంఘం నిర్ణయం వల్ల లాభపడింది తెలంగాణ రాష్ట్ర సమితినే. వీలైనంత త్వరగా ఎన్నికలు జరగాలని..ఆ పార్టీ అసెంబ్లీని రద్దు చేసుకుంది. కేంద్రంలోని బీజేపీ కూడా వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని కోరుకుంది. ఎందుకంటే…మహాకూటమి ఏర్పడకూడదు… మహాకూటమి కన్సాలిడేట్ కాకూడదననేది.. బీజేపీ లక్ష్యం. ఈసీ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రత్యక్షంగా టీఆర్ఎస్ లాభపడుతుంది. ఓ పార్టీ లాభపడే నిర్ణయాన్ని ఈసీ ఎలా తీసుకుంటుంది..?. ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో… కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం.. ఈసీ సహా.. సీబీఐ , కాగ్ అన్నీ స్వతంత్ర వ్యవస్థలే. కానీ ఎలా పనిచేస్తున్నాయో మనం చూస్తున్నాం. కచ్చితంగా… ఎన్నో ప్రశ్నలు వస్తున్నప్పటికీ.. ఆఘమేఘాల మీద తెలంగాణ షెడ్యూల్ ప్రకటించడం వెనుక కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి ఉందనే స్పష్టం.

అనుమానాలు రెకేతెత్తించేలా ఈసీ శైలి ఉందా..?

ఇప్పుడు ఈసీపై అనేక అనుమానాలు వస్తాయి. ఓటర్ల జాబితా అంశం కోర్టులో ఉన్నప్పుడు… దానిపై అనేక అనుమానాలు ఉన్నప్పుడు సమయం ఉండి కూడా.. హడావుడిగా ఎన్నికల షెడ్యూల్ ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వీటికి సరైన సమాధానం చెప్పడం లేదు కాబట్టే… ఈసీపై రాజకీయ ఆరోపణలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.