ప్రొ.నాగేశ్వర్ : ఏపీలో కాంగ్రెస్ కన్నా చంద్రబాబుకే రాహుల్ ప్రాధాన్యం..!

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ నేతలు వరుసగా ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో అరవై దశాబ్దాల అనుబంధం ఉన్న మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబం .. తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటోంది. అలాగే.. అరకు మాజీ ఎంపీ, మరో కేంద్రమాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. గత ఐదేళ్లలో.. పురందేశ్వరి సహా ఎంతో మంది నేతలు కాంగ్రెస్ ను వీడారు. వీరంతా కేంద్ర స్థాయిలో పదవులు అనుభవించిన వాళ్లే. ఆ పరంపరం ఇంకా కొనసాగుతోంది.

విభజన దెబ్బతో కాంగ్రెస్ నిర్వీర్యం..!

కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పదేళ్ల పాటు పరిపాలించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాదు.. కేంద్రంలో కూడా.. యూపీఏ -1, యూపీ ఏ -2 ప్రభుత్వాలు అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశే అత్యంత కీలకం. ఏపీలో ఉన్న పార్లమెంట్ సీట్లలో 30కిపైగా కాంగ్రెస్ పార్టీకి రావడం వల్లే… యూపీఏ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. లేకపోతే పరిస్థితి వేరుగా ఉండేది. అయినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ చేసిన పొరపాటేమిటంటే… విభజన సమయంలో.. ఆ పార్టీ నేతలు.. రెండు ప్రాంతాల నేతలు.., రెండు వర్గాలుగా విడిపోయి.. తమ తమ వాదన వినిపించారు. నిజానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. చంద్రబాబు హయాంలో.. ఆయనను దెబ్బతీయడానికి తెలంగాణ వాదాన్ని తెరపైకి తీసుకు వచ్చారు. వైఎస్ .. తెలంగాణ ఎమ్మెల్యేల్ని హైకమాండ్ వద్దకు పంపారు. తెలంగాణ వాదాన్ని తెరపైకి తీసుకువస్తే… చంద్రబాబు బలహీనపడతారనేది… వారి అంచనా. అక్కడ్నుంచి… రాష్ట్ర విభజన సమయానికి రెండు ప్రాంతా నేతలుగా విడిపోయారు. మామూలుగా.. అయితే తెలంగాణ వాదం వినిపిస్తే.. చంద్రబాబు బలహీనపడతారని… తాము బలపడతామని అనుకున్నారు. కానీ వేరేగా జరిగింది. అంటే.. రాజకీయ అవసరాలకు అనుగుణంగా… రాష్ట్ర విభజన సమస్యను పరిష్కరించాలని ప్రయత్నం చేయడమే.. కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారింది.

ఏపీ కాంగ్రెస్ నేతలకు అవకాశాలు కావాలి..!

తెలంగాణ విషయంలో పదేళ్ల పాటు కామ్‌గా ఉండి.. ఎన్నికల ముందు హడావుడిగా విభజన చేసారు. అంతకు ముందు.. రకరకాల మాటలు మాట్లాడారు. ఏం చేసినా… ఓ రాజకీయ లక్ష్యంతో చేశారు. సీమాంధ్ర ప్రాంతం నుంచి.. సమైక్యాంధ్ర ఉద్యమానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రే నేతృత్వం వహించారు. అయినప్పటికీ.. కాంగ్రెస్ హైకమాండ్ వెనక్కి తగ్గలేదు. విభజన చేసింది.. అయితే.. ఆ సమయంలో.. ఏపీకి ఏమైనా ఇవ్వండి ..మాకు అభ్యంతరం లేదని.. ఉద్యమకారులు అన్నారు కూడా. అయినప్పటికీ.. రాజకీయ ప్రయోజనాల కోణంలోనే విభజన చేశారు. ఫలితంగా.. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. తెలంగాణలో.. కేసీఆర్ పోరాటం వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ప్రజలు నమ్మారు. అక్కడ కాంగ్రెస్ వల్ల నష్టపోయామని ప్రజలు అనుకున్నారు. ఈ పరిస్థితి కారణంగా.. కాంగ్రెస్‌లో ఇక భవిష్యత్ లేదని నేతలు అనుకున్నారు. అంతకు ముందు చిరంజీవి కూడా.. పార్టీ పెట్టి లక్షల ఓట్లు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ లో కలిపి.. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో కూడా తెలియడం లేదు. అలాగే…ఇప్పుడు కోట్ల, కిషోర్ చంద్రదేవ్. రాజకీయం చేయాలనుకుంటే.. పదవులు కావాలనుకుంటే.. కాంగ్రెస్ లో ఉంటే సాధ్యం కాదు. తెలంగాణలో మహాకూటమి ఏర్పాటయిన తర్వాత… ఏపీ కాంగ్రెస్ నేతల్లో కాస్త ఆశలు ఏర్పడింది. తెలంగాణలో మహాకూటమి గెలిస్తే.. టీడీపీ పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు వస్తాయని.. ఆశించారు. కానీ అక్కడ ఫెయిలవడంతో… కాంగ్రెస్ తో స్నేహాన్ని జాతీయ స్థాయికే పరిమితం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. దీంతో కాంగ్రెస్ నేతలకు అవకాశాలు రావడం కష్టం. అందుకే పార్టీలు మారిపోతున్నారు. చంద్రబాబునాయుడు కూడా తన పార్టీకి ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో చూసుకుని.. అక్కడ పార్టీ నేతల్ని చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

చంద్రబాబుతో స్నేహం కోసమే కాంగ్రెస్ నేతలు టీడీపీలో చేరినా రాహుల్ సైలెంట్..!

రాహుల్ గాంధీ… ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని .. మళ్లీ పునరుజ్జీవింప చేయాలనే ఆలోచన చేయడం లేదు. రాహుల్ గాంధీకి తెలంగాణలో పార్టీ గెలుస్తుందన్న ఆశలు ఉన్నాయి. కానీ ఏపీలో మాత్రం… ఒక్క సీటు వస్తుందన్న అంచనా కూడా లేదు. అందుకే.. చంద్రబాబుతో… స్నేహం ఉంటే.. టీడీపీ సాధించే సీట్ల వల్ల.. ఢిల్లీలో మోడీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయవచ్చని ఆశిస్తున్నారు. అందుకే.. ఏపీలో పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా.. చంద్రబాబుతో స్నేహానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. మామూలుగా అయితే.. మిత్రపక్షాలుగా ఉన్న పార్టీల్లో నేతలు చేరరు. కానీ.. కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ స్థాయిలో మద్దతు ఇస్తున్న చంద్రబాబు.. కాంగ్రెస్ పార్టీ నేతల్ని చేర్చుకుంటున్నారు. సహజంగా.. అయితే మా పార్టీ నేతల్ని ఎందుకు చేర్చుకుంటున్నారని.. రాహుల్ గాంధీ ప్రశ్నించేవారు. కానీ అలాంటి ఆలోనచ లేదు. తమ పార్టీకి ఎలాగూ చాన్స్ లేదు కాబట్టి… బీజేపీ వ్యతిరేక పక్షానికి ఎక్కువ సీట్లు రావాలని కోరుకుంటున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేయడానికన్నా.. చంద్రబాబుతో స్నేహానికి రాహుల్ గాంధీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com