ప్రొ.నాగేశ్వర్ : టీడీపీతో పొత్తు ఉంటే కాంగ్రెస్ గెలుస్తుందా..?

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం. అన్ని శక్తులూ కూడదీసుకుని టీఆర్ఎస్‌ను ఓడించాలని ప్రయత్నిస్తోంది. ఇందు కోసం.. తెలుగుదేశం పార్టీని కలుపుకోవాలని.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. టీడీపీతో పొత్తు కోసం కాంగ్రెస్ ప్రయత్నించడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే.. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజే్పీ ఇప్పుడు కలసి లేదు. టీడీపీకి మిత్రపక్షం లేదు. తెలంగాణలో బలం తగ్గిన తర్వాత చంద్రబాబు నాయకత్వం.. తెలంగాణలో ఉండదు కనుక.. టీడీపీ మనుగడ సాగించాలంటే.. ఎవరితో ఒకరితో పొత్తు ఉండటం తప్పనిసరి.

టీడీపీతో పొత్తు కోసం కాంగ్రెస్ ఆరాటం ఎందుకు..?

ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే చెల్లా చెదురైన తమ క్యాడర్ నిలబడుతుందని.. టీడీపీ నమ్ముతోంది. కాంగ్రెస్‌తో పార్టీతో పొత్తు పెట్టుకుంటే.. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న టీడీపీకి పునరుజ్జీవం లభిస్తుందని..టీడీపీ నేతలు భావిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేతలు పోటీ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా.. టీడీపీతో పొత్తు కోసం… తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నిజానికి తెలుగుదేశం పార్టీ ఆంధ్రా పార్టీ అని.. కేసీఆర్ విమర్శిస్తున్నారు. ఆంధ్రా పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటారని.. ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో ఉదయం లేస్తే.. తెలంగాణ ప్రయోజనాలను చంద్రబాబు అడ్డుకంటున్నారని.. కేసీఆర్ ఆరోపిస్తున్నారు. టీడీపీకి 0.1, 0.2 శాతం మాత్రమే ఓటింగ్‌ ఉందని చెబుతున్నారు. అలాంటప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకి నష్టమే. అయినా కూడా.. కాంగ్రెస్ పార్టీ తన సీట్లు కూడా వదులుకు ఎందుకు టీడీపీ పార్టీతో పొత్తు కోసం సిద్ధమవుతోంది. దీనికి ప్రాతిపదికేమిటి..?

తెలంగాణలో టీడీపీ బలం ఎంత..?

2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలసి పోటీ చేశాయి. టీడీపీకి 15 సీట్లు వచ్చాయి. బీజేపీకి ఐదు సీట్లు వచ్చాయి. ఈ పొత్తులో.. టీడీపీ కన్నా.. బీజేపీకి ఎక్కువ మేలు జరిగింది. టీడీపీ, బీజేపీకి కలిసి 20 స్థానాలొచ్చాయి. అదే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి 21 సీట్లు వచ్చాయి. దాదాపుగా కాంగ్రెస్ పార్టీతో సమాన స్థాయిలో.. టీడీపీ, బీజేపీకి సీట్లు, ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 45 లక్షల ఓట్లు వస్తే.. టీడీపీ, బీజేపీకి కలిపి 41 లక్షల ఓట్లు వచ్చాయి. అంటే 2014 ఎన్నికలు ముక్కోణపు పోటీ జరిగింది. నిజానికి అప్పట్లో టీడీపీ పూర్తిగా నిరుత్సాహపడి ఉంది. ఉద్యమ సమయంలో… సెంటిమెంట్ టీడీపీకీ తీవ్రంగా వ్యతిరేకత పెంచింది. అయినప్పటికీ.. టీడీపీ అన్ని ఓట్లు, సీట్లు వచ్చాయి. అందుకే టీడీపీతో పొత్తు తమకు లాభం అని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసుకుంటోంది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 72 సీట్లలో పోటీ చేసింది. 15 స్థానాల్లో గెలుపొందింది. గెలుపు శాతం 31 . బీజేపీ 45సీట్లలో పోటీ చేసి.. ఐదు సీట్లు మాత్రమే గెలిచింది. గెలుపు శాతం.. 12శాతం. అంటే.. టీడీపీకి సొంతంగా బలం ఉందని.. 2014లో తేలిపోయింది.

టీడీపీ ఓటింగ్‌కు కాంగ్రెస్‌కు కలసి వస్తుందా..?

2014లో టీఆర్ఎస్‌కు 66 లక్షల ఓట్లు వచ్చాయి. 34 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఐదు శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీ, బీజేపీకి 21 శాతం ఓట్లు వచ్చాయి. ఇందులో ఒక్క టీడీపీ ఓటింగ్‌ మాత్రం 15 శాతం ఉందనుకుందాం. టీడీపీ, కాంగ్రెస్ ఓటింగ్ శాతం కలుపుకుంటే.. 40 శాతం. టీఆర్ఎస్ కన్నా… ఎక్కువ అవుతుంది. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వంపై నాలుగున్నరేళ్లలో వ్యతిరకత ఉంటుంది. ఈ వ్యతిరేకత కూడా కలసి వస్తే… టీఆర్ఎస్‌ కన్నా.. చాలా ముందు ఉంటామని.. కనీసం 70, 80 సీట్లలో గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ అంచనా. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా… ఈ కూటమిని ప్రజలు భావిస్తే.. వ్యతిరేక ఓటు కచ్చితంగా ఈ కూటమికే వస్తుంది. టీడీపీ ఇప్పుడు బలహీన పడిందనుకుందాం. ఎంత బలహీన పడినా.. గతంలో వచ్చిన.. పదిహేను శాతం ఓట్లు కాకపోయినా.. ఏడు శాతమో..ఎనిమిది శాతమో.. ఓటింగ్ ఉన్నా… కాంగ్రెస్ పార్టీకి అదో మేజర్ ప్లస్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు టీడీపీ నేతలు, కార్యకర్తలు చెల్లాచెదురై ఉన్నారు. గెలుస్తామని విశ్వాసం వస్తే.. మళ్లీ టీడీపీ ఓటర్లంతా టీడీపీ వైపు వస్తారు. ఆ విశ్వాసం కాంగ్రెస్, టీడీపీ పొత్తు వల్ల వస్తుంది. కాంగ్రెస్, టీడీపీ రెండు పార్టీలూ ఇలానే ఆలోచిస్తున్నాయి.

టీడీపీకి ఓటింగే లేదని టీఆర్ఎస్ ఎందుకు భావిస్తోంది..?

కానీ టీఆర్ఎస్ మాత్రం వేరే విధంగా ఆలోచిస్తోంది. టీఆర్ఎస్ మా ప్రభుత్వానికి వ్యతిరేకత ఎక్కడ ఉందని ప్రశ్నిస్తోంది. మా ప్రభుత్వానికి అనుకూల ఓటు వస్తుందని.. టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో 34 శాతం ఓట్లే వచ్చినా.. ప్రభుత్వ పనితీరుకు మెచ్చిన ప్రజలు… 50, 60 శాతం ఓట్లు వేస్తారని చెబుతున్నారు. కేసీఆర్ కూడా.. పదే పదే 50, 60 శాతం ఓట్లు ఉన్నాయని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. అలాగే.. 2014లో టీడీపీకి ఓట్లు వేసిన వాళ్లు… ఇప్పుడు ఆ పార్టీతో పాటు ఉన్నారా ఆని ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఆ పార్టీతో ఉంటే.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలా గెలిచేవాళ్లమని వాదిస్తున్నారు. చంద్రబాబునాయుడు అసలు ప్రచారమే చేయడం లేదు. తెలంగాణ నాయకత్వానికి దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేయడం లేదు కాబట్టి… టీడీపీకి 0.1, 0.2 శాతం ఓటింగ్ ఉందని చెబుతున్నారు. అలాగే.. కాంగ్రెస్. టీడీపీ పొత్తును ప్రజలు అంగీకరించని చెబుతున్నారు. ఎన్టీఆర్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే పార్టీనిపెట్టారు. ఏపీలో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకోవడం ప్రజలు అంగీకరించరు. అదే సమయంలో చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందువల్ల కాంగ్రెస్, టీడీపీ పొత్తును ప్రజలు అంగీకరంచరు. అలా అంగీకరించనప్పుడు.. ఓటింగ్ ఇద్దరికీ కలిసి వస్తుందని ఎలా చెబుతామని.. టీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు.

ప్రజలు మార్పు కోరుకుంటనే కూటమికి అధికారం..!

కాంగ్రెస్ – టీడీపీ, టీఆర్ఎస్ వాదనల్లో ఎవరి వాదన నిజం..? కచ్చితంగా.. 2014లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఓటింగ్ లెక్కల ఆధారంగా పొత్తులు పెట్టుకంటే సక్సెస్ అవుతుందని అంచనా వేయలేం. ఇక్కడ ప్రధానమైన విషయం ఏమిటంటే… ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితికి మరో అవకాశం ఇద్దామనుకుంటున్నారా.? లేదా..? అన్నదానిపైనే ఓటింగ్ ఆధారపడి ఉంటుంది. ఇక టీఆర్ఎస్‌కు చాలు… ప్రత్యామ్నాయానికి మరో చాన్స్ ఇద్దామనకుంటే.. మాత్రం… కాంగ్రెస్ – టీడీపీ కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ… ప్రజల్లో మార్పు ఆలోచన లేకుండా.. ఎన్ని కూటములు పెట్టినా ప్రయోజనం ఉండదు. 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా..టీడీపీ, టీఆర్ఎస్, వామపక్షాలు కలిశాయి. కానీ గెలవలేకపోయాయి. 2004లో టీడీపీకి వ్యతిరేకంగా.. కాంగ్రెస్, టీఆర్ఎస్, వామపక్షాలు కలిశాయి. అప్పుడు ఓడించగలిగారు. అంటే.. అర్థం ఏమిటంటే.. ప్రతిపక్షాలు… కలవడం అనేది ఓ ప్రాతిపదిక మాత్రమే. అంతిమంగా.. అధికారపక్షాన్ని కొనసాగించాలా.. ఇంటికి పంపాలా అన్నది ప్రజల నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది.ఇంటికి పంపాలని భావిస్తే.. అప్పుడు ప్రతిపక్షాల కూటమి.. ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com