ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిటల్ కార్పొరేషన్ ప్రభుత్వ పథకాల ప్రచారం పేరుతో నిధులను విడుదల చేసి, వాటిని పక్కదారి పట్టించి ఒక ప్రైవేట్ సినిమా నిర్మాణానికి వాడటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, కూన రవికుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఐ అండ్ పీఆర్ శాఖ సంచలన వివరాలను వెల్లడించింది.
యాత్ర2 నిర్మాతలకు రూ. 2.12 కోట్ల మళ్లింపు
ప్రభుత్వ పథకాల వీడియో మేకింగ్ పేరుతో త్రీ ఆటమ్ లీవ్స్ అండ్ ఏ స్టోరీ ఎల్ఎల్పీ సంస్థకు ఏపీడీసీ నుంచి రూ. 2.12 కోట్లు చెల్లించారు. అయితే, డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ జరిపిన విచారణ, బ్యాంక్ స్టేట్మెంట్ల ఫోరెన్సిక్ ఆడిట్లో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఏపీడీసీ నుంచి నిధులు అందుకున్న సదరు సంస్థ, ఆ మొత్తంలో మెజారిటీ నిధులను యాత్రా-2 సినిమా నటీనటులకు పారితోషికాలుగా బదిలీ చేసినట్లు విచారణలో తేలింది.
సీఐడీ దర్యాప్తుకు ఆదేశం.. రికవరీకి సిద్ధం
ప్రైవేట్ సినిమా కోసం ప్రభుత్వ నిధులను వెచ్చించే అధికారం ఎవరికీ లేదని, ఇది నిబంధనల ఉల్లంఘన అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ విభాగం చేసిన సిఫార్సు మేరకు, ఈ కేసును ప్రస్తుతం సీఐడీ కి అప్పగించారు. ఈ నిధుల మళ్లింపు వెనుక ఉన్న ఉద్దేశం, జీఎస్టీ ఎగవేత వంటి అంశాలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. సీఐడీ నివేదిక ఆధారంగా అక్రమంగా మళ్లించిన ప్రజాధనాన్ని తిరిగి రాబట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ సంస్థల దుర్వినియోగం
ప్రభుత్వ పథకాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఏపీడీసీ, గత ప్రభుత్వంలో కేవలం ఒక రాజకీయ నాయకుడి ఇమేజ్ బిల్డింగ్ కోసం, ఆయన జీవిత చరిత్రతో తీసిన సినిమాల కోసం పని చేసిందని అధికార పక్షం ఆరోపిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులకు, సంస్థలకు ప్రజాధనాన్ని కట్టబెట్టడంపై ప్రబుత్వం సీరియస్గా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయింది.
