పురంధేశ్వరి, వెంకటేశ్వరరావు…ఇంకా ఎంతకాలం ఈ రాజకీయం?

ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా చివరిదశలో ఎన్టీఆర్‌ని ఏకాకిని చేశారు. ఎన్టీఆర్-లక్ష్మీపార్వతిల బంధానికి అదే ప్రధాన కారణం. ఎన్టీఆర్ కూడా అదే విషయాన్ని చాలా సార్లు చెప్పారు. లక్ష్మీపార్వతి అరంగేట్రం తర్వాత నుంచీ, లక్ష్మీ పార్వతి దూకుడు పెరిగిన దగ్గర నుంచీ ఎన్టీఆర్ వారసులకు వారసత్వ భయం పట్టుకుంది. అంతస్థులు, అధికారం, అర్థబలంలాంటి వాటికి లొంగని మనిషి ఎవరైనా ఉంటారా? అలాంటి ఆశలు చూపించే ఎన్టీఆర్ వారసులందరినీ బుట్టలో పడేశాడు చంద్రబాబు. అందరికీ కూడా రకరకాల ఆశలు చూపించాడు. ఎన్టీఆర్ గొప్పతనం తెలుగు వారందరికీ అర్థమైనంతగా ఆయన వారసులకు అర్థం కాలేదో ఏమో కానీ ఎన్టీఆర్‌ని దూరం పెట్టేసి చంద్రబాబుకు దగ్గరైపోయారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరిలు కూడా చంద్రబాబు రాజకీయ ఆటలో పావులయ్యారు. తనకు అవసరమైనంత కాలం ఉపోయోగించుకున్న చంద్రబాబు ఆ తర్వాత బయటకు గెంటేశాడు.

దగ్గుబాటి పురంధేశ్వరి, వెంకటేశ్వరరావులకు ఎన్టీఆర్‌కి ద్రోహం చేసినందుకు ఎక్కువ బాధ ఉందో, లేకపోతే చంద్రబాబు చేతిలో మోసపోయినందుకు ఎక్కువ బాధపడుతున్నారో తెలియదు కానీ ఇద్దరూ కూడా చంద్రబాబు అంతం-మా పంతం అన్నట్టుగా ఒకటే రాజకీయం చేస్తున్నారు. అలాగని చంద్రబాబు రాజకీయ వ్యూహాలు, తెలివితేటలను తట్టుకునే శక్తి కూడా ఈ ఇద్దరికీ లేదు. బిజెపిలో చేరి ఎంపి అయిపోయి, ఆ తర్వాత నరేంద్రమోడీ కేబినెట్‌లో కూడా మంత్రి అయిపోయి హల్చల్ చేద్దామనుకున్న పురంధేశ్వరి ఆశలకు రాజంపేట ఎంపి సీటు ఇఫ్పించి చంద్రబాబు ఏ రేంజ్‌లో దెబ్బకొట్టాడో అందరికీ తెలిసిన విషయమే. వైఎస్ హయాం విషయం పక్కన పెడితే ఆ తర్వాత…అంతకుముందు మాత్రం చంద్రబాబు రాజకీయ వ్యూహాల ముందు ఎప్పుడూ నిలబడలేకపోయింది పురంధేశ్వరి. అయితే ఎన్టీఆర్‌కి చంద్రబాబు చేసిన ద్రోహాన్ని జనాలకు గుర్తుచేస్తూ చంద్రబాబును చికాకు పెట్టడంలో మాత్రం కాస్త సక్సెస్ అవుతున్నారు. అలాగే ఇప్పుడు బిజెపి నేతగా ఉన్న పురంధేశ్వరికి ఆ పార్టీ ఇచ్చిన ప్రత్యేక గుర్తింపు అంటూ ఏమీలేదు. అయినప్పటికీ ఆరు మాసాలకు ఓ సారి అన్నట్టుగా మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర అభివృద్ధి(?) క్రెడిట్ మొత్తం కూడా మోడీ అకౌంట్‌లో వేస్తూ చంద్రబాబును జీరోని చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో కూడా ముందు సోనియాను కాపాడే రేంజ్‌లో మాట్లాడి బోలెడంత చెడ్డపేరు తెచ్చుకుని, ఆ వెంటనే బిజెపిలోకి దూకేసి కామెడీ అయిపోయింది పురంధేశ్వరి. ఇప్పుడు కూడా పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావుల రాజకీయం అలానే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బిజెపి ఏమీ చేయడం లేదు అన్న మాట వాస్తవం. ఒకవేళ చేస్తున్నా కూడా…. ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలతో పోల్చుకుంటే అది శూన్యం అన్నట్టే లెక్క. అలాంటప్పుడు చంద్రబాబు పైన కోపంతో పురంధేశ్వరిలాంటి నాయకులు బిజెపిని వెనకేసుకురావడం మాత్రం ఎపి ప్రజలకు అస్సలు రుచించే అవకాశమే లేదు. చేతనైతే కేంద్రం ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌లాంటి వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మాట్లాడడం మానేసి పార్టీ ప్రయోజనాల కోసం పాకులాడడం మాత్రం పురంధేశ్వరి రాజకీయ జీవితానికి ఏమాత్రం ఉపయోగపడదు. అలాగే చంద్రబాబు వ్యతిరేకత ఒక్కటే అజెండా అన్నట్టుగా కాకుండా ఏమైనా ప్రజలకు ఉపయోగపడే రాజకీయం చేస్తే దగ్గుపాటి దంపతుల రాజకీయ అస్థిత్వానికి మరింత ప్రమాదం వాటిల్లే పరిస్తితి ఉండదు. అలా కాకుండా ఎంత ద్రోహం చేస్తున్నా కూడా బిజెపి గొప్పది అని చెప్తూ, చంద్రబాబుపైన విమర్శలు చేస్తూ ఉంటే మాత్రం రాజకీయంగా పూర్తిగా కనుమరుగైపోయినా పెద్దగా ఆశ్ఛర్యపోవాల్సింది ఏమీ ఉండదేమో.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.