విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న స్లమ్‌డాగ్ టీజర్ బయటికి వచ్చింది. పూరి నేరుగా తమిళంలో తెరకెక్కిస్తున్న తొలి చిత్రం ఇది. టీజర్ విడుదల కార్యక్రమంలో పూరి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికరంగా వున్నాయి.
ఈ సినిమా గురించి మాట్లాడిన పూరి “నేను ఈ సినిమాను జెన్-జీ యువత కోసం తీశాను. వాళ్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ సినిమాను చూడాలి” అని కోరారు. సాధారణంగా పూరి సినిమాలు మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి. ఆయన కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి.
అయితే గత కొన్నేళ్లుగా పూరి నుంచి ఆశించిన స్థాయిలో విజయాలు రావడం లేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. చివరకు ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్‌గా వచ్చిన చిత్రం కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ముఖ్యంగా పూరి బలంగా నమ్ముకున్న మాస్ ప్రేక్షకులు కూడా ఆ సినిమాను పెద్దగా ఆదరించలేదు.
అయినప్పటికీ పూరి ప్రతిభపై ప్రేక్షకుల్లో ఎలాంటి సందేహాలు లేవు. సరైన కథ, సరైన సమయం దొరికితే మరోసారి ఇండస్ట్రీని షేక్ చేసే సినిమా ఇవ్వగల దర్శకుడు అనే నమ్మకం ఇప్పటికీ ఉంది. అందుకే ఆయన తాజా వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఒకప్పుడు “ఇది అందరూ చూడాల్సిన సినిమా” అనే ప్రచారం సాధారణంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రేక్షకుల అభిరుచులు డివైడ్ అవుతున్నాయి. దాంతో ఫిల్మ్ మేకర్లు కూడా నిర్దిష్ట వర్గాలను లక్ష్యంగా చేసుకుని సినిమాలు రూపొందిస్తున్నారు. “ఇది యువత కోసం”, “ఇది అమ్మాయిల కోసం”, “ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కోసం” అంటూ ప్రత్యేకంగా చెప్పడం కూడా ప్రమోషన్లో భాగమైపోయింది.
ఈ నేపథ్యంలో పూరి ప్రత్యేకంగా జెన్-జీ యువతను ప్రస్తావించడం గమనించాల్సిన విషయం. దాదాపు రెండు తరాల ప్రేక్షకులను అలరించిన దర్శకుడు ఇప్పుడు కొత్త తరాన్ని లక్ష్యంగా చేసుకుని సినిమా చేయడం ఆసక్తికర పరిణామం. సోషల్ మీడియా, డిజిటల్ కల్చర్, వేగంగా మారుతున్న జీవనశైలికి అలవాటు పడిన జెన్-జీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం అంత సులభం కాదు. కానీ ఆ తరానికి నచ్చే అంశాలను సరిగ్గా పట్టుకుని పూరి స్లమ్‌డాగ్ ని రూపొందించి ఉంటే, అది ఆయన కెరీర్లో కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు. ముఖ్యంగా జెన్-జీ ప్రేక్షకులు ఈ సినిమాను తమదిగా భావించి ఆదరిస్తే, పూరికి మరో కొత్త ఆడియన్స్ బేస్ ఏర్పడినట్లే.