ఈ విమ‌ర్శ‌ను జ‌గన్ ఎలా తిప్పికొడ‌తారు..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ మ‌రికొద్ది రోజుల్లో పాద‌యాత్ర‌కు బ‌య‌లుదేరుతున్నారు. అసెంబ్లీ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించి మ‌రీ ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు. రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న సాగుతోంద‌నీ, చంద్ర‌బాబు నాయుడు స‌ర్కారు పునాదుల‌ను క‌ద‌ల్చ‌డ‌మే పాద‌యాత్ర ల‌క్ష్యం అంటూ యాత్ర‌కు దిగుతున్నారు. అయితే, ఈ యాత్ర గురించి ఈ మ‌ధ్య ఎప్పుడు మాట్లాడినా… ‘మీ అంద‌రూ మెచ్చే అన్న ముఖ్య‌మంత్రి కాబోతున్నాడు. దేవుడుని ప్రార్థించండి’ అని చెబుతూ వచ్చారు. నిజానికి, గ‌త ఎన్నిక‌లు ముగిసిన ద‌గ్గ‌ర్నుంచీ కూడా ‘ముఖ్య‌మంత్రి’ అనే కాన్సెప్ట్ ను ఏదో ఒక సంద‌ర్భంలో జ‌గ‌న్ ప్ర‌స్థావిస్తూనే వ‌స్తున్నారు. కొద్దిరోజులు ఓపిక ప‌ట్టండీ, ముఖ్య‌మంత్రిని కాగానే స‌మ‌స్య‌లు తీర్చేస్తా, మ‌న ప్ర‌భుత్వం రాగానే ప‌రిష్కారం చేసేస్తా అంటూ చెబుతూనే ఉన్నారు. ఆ ధీమాతోనే అసెంబ్లీ సమావేశాల‌కు కూడా హాజ‌రు కావ‌డం లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు గుర్తు చేసుకోవ‌డం అంటే… అనునిత్యం జ‌గ‌న్ వినిపిస్తూ ఉన్న ఈ ప‌ద‌వీ కాంక్షే ఇత‌ర పార్టీల‌కు ప్ర‌ధాన విమ‌ర్శ‌నాస్త్రంగా మారుతోంద‌ని చెప్ప‌డం కోసం.

విప‌క్ష నేత‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ విమ‌ర్శ‌లు చేస్తోంది. అసెంబ్లీ స‌మావేశాల‌కు జ‌గ‌న్ రాక‌పోవ‌డాన్ని ఏపీ పీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరా రెడ్డి మ‌రోసారి త‌ప్పుబ‌ట్టారు. అసెంబ్లీకి గైర్హాజ‌రు అవుతూ పాద‌యాత్ర‌కు వెళ్ల‌డం, యుద్ధ‌భూమిని వ‌దిలేసి పారిపోవ‌డ‌మే అని విమ‌ర్శించారు. శాస‌నస‌భ‌లో స‌మ‌స్య‌లు ప్ర‌స్థావించి ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల్సింది పోయి, జ‌నంలోకి వెళ్లి పోరాటం చేస్తా అనే ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు ఎప్పుడూ చూడ‌లేద‌ని ఎద్దేవా చేశారు. త‌న‌ను ముఖ్య‌మంత్రి చేస్తే త‌ప్ప ఏ స‌మ‌స్య‌ల‌కూ పరిష్కారం ఉండ‌ద‌ని చెప్పే ప్ర‌తిప‌క్ష నేత‌ను దేశంలో ఎక్క‌డా చూడ‌లేద‌ని మండిప‌డ్డారు. న‌న్ను సీఎంను చేయండీ అంటూ ఎదురుచూపులు చూసే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిని గ‌తంలో ఎన్న‌డూ చూడ‌లేద‌ని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఇలా జ‌గ‌న్ ను విమ‌ర్శించ‌డం వ‌ల్ల కాంగ్రెస్ కు కొత్త‌గా వ‌చ్చేసే పొలిటిక‌ల్‌మైలేజ్ ఏదీ ఉండ‌దు. కానీ, ఈ త‌ర‌హా విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం ఇచ్చింది ఎవ‌రంటే జ‌గ‌న్ స్వ‌యంకృత‌మే అని చెప్పొచ్చు. ఇదే అంశాన్ని టీడీపీ కూడా ప్ర‌ధాన విమ‌ర్శ‌నాస్త్రంగా మార్చుకునే అవ‌కాశం క‌చ్చితంగా ఉంది. నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చార స‌మ‌యంలో కూడా త్వ‌ర‌లో తానే ముఖ్య‌మంత్రి కాబోతున్నా అని భారీ ఎత్తున ప్రచారం చేసుకుని భంగ‌ప‌డ్డారు. క‌నీసం, త్వ‌ర‌లో మొద‌లు కాబోతున్న పాద‌యాత్ర‌లోనైనా ‘కాబోయే ముఖ్య‌మంత్రిని నేనే, మన ప్రభుత్వం వచ్చేస్తోంది, పూజలూ పునస్కారాలూ చేయండి’ అంటూ చెప్పుకోకుండా ఉండే కొంతైనా బాగుంటుంది. లేదంటే.. ఇలాంటి విమ‌ర్శ‌ల్ని తిప్పికొట్టే ఆస్కారం లేకుండా పోయేది వారికే! ఇవాళ్ల రఘువీరా చేసిన విమర్శకు జగన్ స్పందించకపోవచ్చు. కానీ, రేప్పొద్దున టీడీపీ కూడా ఇదే తరహాలో విమర్శకు దిగితే.. ఎలా తిప్పికొడతారు..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.