పాపం రాహుల్! చివరికి ఆ పరిస్థితి కూడా ఎదురైంది

రాజకీయ నేతలపై ప్రజలు అప్పుడప్పుడు బూట్లు, చెప్పులు విసరడం మామూలే. డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన మంత్రులకి చాలాసార్లు అటువంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఆ జాబితాలో చేరిపోయారు. ఈరోజు అయన ఉత్తరప్రదేశ్ లో సీతాపూర్ లో రోడ్ షో నిర్వహిస్తుంటే ఒక యువకుడు ఆయనపైకి బూటు విసిరాడు. కానీ అది వెంట్రుకవాసిలో చెవిని రాసుకొంటూ వెళ్లిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఆ తరువాత రాహుల్ గాంధీ భద్రతా సిబ్బంది ఆ యువకుడిని పట్టుకొని పోలీసులకి అప్పగించారు. వారు ఆ యువకుడుని అదుపులోకి తీసుకొని అతను రాహుల్ గాంధీపై ఎందుకు బూటు విసిరాడు? అతను ఊరు, పేరు ఏమిటి? మొదలైన వివరాలు సేకరిస్తున్నారు. ఈ వ్యవహారం వలన రాహుల్ గాంధీకి అవమానం కలగడం, దానిపై కాంగ్రెస్, భాజపాలు వాదోపవాదాలు కొన్ని రోజులు చేసుకోవడం తప్పదు.

వాటి రాజకీయాలు, వాదోపవాదాలు ఎలాగున్నా ఈ సంఘటన రాహుల్ గాంధీ భద్రతలో డొల్లతనాన్ని బయటపెట్టింది. ఒక సామాన్యుడు రాహుల్ గాంధీపై అంత సులువుగా దాడి చేయగలిగాడంటే, ఒకవేళ తీవ్రవాదులు లేదా కాంగ్రెస్, భాజపా వ్యతిరేకశక్తులు దాడికి పూనుకొని ఉంటే ఏమై ఉండేది? బూటుకి బదులు బుల్లెట్ అయితే గురి తప్పి ఉండేదా? ఆలోచించవలసిన విషయమే. రాహుల్ గాంధీలో చాలా లోపాలు ఉండి ఉండవచ్చు కానీ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఇటువంటి సమయంలో ఏదైనా జరుగరానిది జరిగితే దేశానికి అదో పెద్ద సమస్యగా మారిపోతుంది. కనుక ఆయన భద్రత పట్ల మరింత పటిష్టమైన ఏర్పాట్లు, అప్రమత్తత చాలా అవసరం. రాహుల్ గాంధీ కూడా దేశంలో నెలకొన్ని ప్రమాదకర పరిస్థితులని దృష్టిలో ఉంచుకొని మెలగవలసిన అవసరం ఉంది.

ఇక రాహుల్ గాంధీకి మళ్ళీ మరో అవమానకరమైన సూచన లభించింది. కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్న ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ యుపి ఎన్నికల ప్రచార బాధ్యతలు ప్రియాంకా వాద్రాకి అప్పగిస్తే బాగుంటుందని ఇచ్చిన సలహానే కాంగ్రెస్ అధిష్టానం ఇంకా జీర్ణించుకోలేకపోతుంటే, ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ కూడా రాహుల్ గాంధీకి షాకింగ్ సలహా ఇచ్చారు.

రాహుల్ గాంధీ ఇకనైనా రాజకీయాల నుంచి తప్పుకొని, పెళ్ళి చేసుకొని హాయిగా సంసారా జీవితం గడిపితే ఆయనకి, దేశానికి కూడా చాలా మంచిదని చెప్పారు. మరో రెండు దశాబ్దాల వరకు దేశాన్ని భాజపా(మోడీ) ఏలే సూచనలు ఉన్నాయని చెప్పారు. కనుక రాహుల్ గాంధీకి ఇక అధికారం గురించి కలలు కననక్కర లేదని చెప్పకనే చెప్పినట్లయింది.
రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపడదామంటే పార్టీలో వాళ్ళే ఒప్పుకోరు. పోనీ ఎన్నికల ప్రచారం చేసుకొందామంటే ప్రశాంత్ కిషోర్ ఒప్పుకోడు. అయినా ధైర్యం చేసి ప్రచారానికి బయలుదేరితే జనాలు బూట్లు విసురుతున్నారు. ఇంకా రామచంద్ర గుహ అయితే నీకీ రాజకీయాలు అవమానాలు ఎందుకు…పెళ్ళి చేసుకొని సుఖంగా బ్రతకొచ్చు కదా? అని ఉచిత సలహా ఇస్తున్నారు. పాపం.. రాహుల్ గాంధీని ఎవరూ అర్ధం చేసుకోరు ఏమిటో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com