రాహుల్ గాంధీ ఎక్కడ?

మీడియాలో ఇదే ప్రశ్న. గురువారం రాత్రి అనేక జాతీయ న్యూస్ చానళ్ల లో చర్చ సందర్భంగా చాలా మంది ఇదే ప్రశ్న అడిగారు. వేర్ ఈజ్ రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ కహా హై? బెంగళూరులో టాంజానియా యువతికి ఘోర అవమానం జరిగినా, పాపం రాహుల్ గాంధీ విపాసన యోగాలో బిజీగా ఉన్నారో లేక ఏం చేస్తున్నారో అని చాలా మంది ప్రశ్నించారు. బెంగళూరు ఘటన కచ్చితంగా జాత్యహంకార దాడే అని చాలా మంది తేల్చి చెప్పారు. కర్ణాటక పోలీసులు మాత్రం అదేమీ కాదంటూ తాపీగా ప్రకటన చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పట్లాగే పోలీసులను సమర్థించింది. ఈ ఘటన గురించి తెలియగానే కర్ణాటక ముఖ్యమంత్రిని రాహుల్ గాంధీ వివరణ అడిగారని వార్తలు వచ్చాయి. ఈయన ఏం వివరణ పంపారో, ఆయనకు ఏం అర్థమైందో గానీ ఈ దారుణం మీద పల్లెత్తు మాట అన్న పాపాన పోలేదు. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో జరిగిన దారుణంపై పోలీసులు సరిగా స్పందించకపోవడం, నిందితులను అరెస్టు చేయడంలో మెతక వైఖరి అవలంబించడాన్ని తిడితే తన పరువే పోతుందని భావించారేమో. ఇదే వేరే రాష్ట్రమై ఉంటే ఈపాటికి ప్రధాని మోడీ మీద దుమ్మెత్తి పోసేవారు. బీజేపీయేతర పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రమైనా సరే బీజేపీని శాపనార్థాలు పెట్టేవారు. కానీ ఇది పూర్తిగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రం. కాబట్టి తేలుకుట్టిన దొంగలా నోరుమూసుకున్నారని విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ ఆత్మహత్య గురించి తెలియగానే దళిత ఓటు బ్యాంకు కోసం రాహుల్ గాంధీ తెగ ఆరాటపడ్డారు. ఆగమేఘాల మీద చార్టర్డ్ ప్లేన్ వేసుకుని హైదరాబాద్ లో దిగిపోయారు. తాను వచ్చి మద్దతిస్తే తప్ప ఇక్కడ ఎవరూ ఆందోళన చేయరేమో అన్నంతగా ఆవేదనను ఒలకబోశారు. మోడీ ప్రభుత్వాన్ని, అమేథీలో తనకు ప్రత్యర్థిగా తయారై తలనొప్పి తెప్పిస్తున్న స్మృతి ఇరానీని కసిదీరా తిట్టారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ వచ్చారు. కొన్ని గంటలు నిరాహార దీక్ష చేసి దళిత ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడానికి మళ్లీ ప్రయత్నించారు. బెంగళూరు ఘటనే కాదు, కర్ణాటకలో జరిగిన ఏ దారుణం మీదా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా స్పందించలేదు. రాహుల్ గాంధీకి ఏమాత్ర బాధ కలిగినట్టు లేదు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా చిన్నారి బాలికలపై స్కూళ్లలో రేప్ ఘటనలు బెంగళూరులో చోటు చేసుకున్నాయి. ఒకటి తర్వాత ఒకటి ఇలాంటి దారుణాలు జరిగినా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అదేం పెద్ద విషయం కాదన్నట్టు చిద్విలాసంగా స్పందించే వారు. ఆ స్కూల్ యాజమాన్యాలకు, ప్రభుత్వానికి ఉన్న బాంధవ్యం ఏమిటో గానీ కేసు పెట్టడం నుంచి అరెస్టు చేయడం వరకూ అంతా నత్తనడకే. బెంగళూరు పోలీసులు తోలు మందం అని ప్రతిపక్షాలు ఎంతగా విమర్శించినా షరా మామూలే. అంతటి దారుణాలు జరిగినప్పుడు రాహుల్ గాంధీ అడ్రస్ లేరు. ఓట్ల కోసం కక్కుర్తి పడటం చాలా మంది రాజకీయ నాయకులకు అలవాటే. రాహుల్ గాంధీ వంటి వారు నలభయ్యో పడిలోనే ఓట్ల యావ తప్ప, బాధ్యతగా ఎందుకు ప్రవర్తించరని టీవీ టాక్ షోలో మేధావులు ప్రశ్నిస్తుంటారు. రాహుల్ మాత్రం ఇవేమీ పట్టించుకోరు. మరీ బోర్ కొడితే హటాత్తుగా ఫారిన్ టూరుకు వెళ్లిపోతారు. తిరిగి వచ్చిన తర్వాత అడపా దడపా మోడీని, తనకు గిట్టని మరి కొందరిని తిడుతూ ఉంటారు. బెంగళూరు ఘటనపై ఇకనైనా రాహుల్ మనస్ఫూర్తిగా స్పందిస్తారని అనుకోవచ్చా అని చానళ్లలో కొందరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పేదెవరు? ఇది జవాబు లేని ప్రశ్న !!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com