హోదాపై రాహుల్ వ్యాఖ్యలకు ఏపీ స్పంద‌నేంటి..?

కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ మ‌రోసారి ప్ర‌త్యేక హోదా గురించి మాట్లాడారు. ప్ర‌స్తుతం బెర్లిన్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రాహుల్, అక్క‌డ ఇండియ‌న్ ఓవ‌ర్సీస్ కాంగ్రెస్ స‌మావేశంలో పాల్గొన్నారు. అక్క‌డ కూడా ఆంధ్రా ప్ర‌త్యేక హోదా గురించి మాట్లాడ‌టం విశేషం! ఏపీకి హోదా ఇస్తామ‌ని నాడు కేంద్ర ప్ర‌భుత్వం ఒప్పుకుంద‌నీ, దాన్ని తాము అధికారంలోకి రాగానే నెర‌వేరుస్తామ‌ని చెప్పారు. ఇదే అంశ‌మై ఆంధ్రా ప్ర‌జ‌ల‌కు మ‌రోసారి తాను హామీ ఇస్తున్నాన‌నీ, ఇచ్చిన మాట‌పై వెన‌క్కి త‌గ్గే ప‌రిస్థితి ఉండ‌ద‌ని రాహుల్ గాంధీ స్ప‌ష్టం చేశారు. ఇదే విష‌యం ఈ మ‌ధ్య తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో చెప్పారు. ఆ మ‌ధ్య సీడ‌బ్ల్యూసీ స‌మావేశంలో కూడా రాహుల్ ఇదే అంశ‌మై గట్టిగా ప‌ట్టుబ‌ట్టి, ఇత‌ర రాష్ట్రాల నేత‌ల్ని ఒప్పించే ప్ర‌య‌త్నం చేశారు.

ఈ నేప‌థ్యంలో హోదాపై రాహుల్ గాంధీ హామీలని ఆంధ్రాలో ప్ర‌జ‌లు న‌మ్ముతున్నారా..? కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో వ‌స్తే… ఏపీకి హోదాని ఇచ్చి తీర‌తార‌ని విశ్వ‌సిస్తున్నారా..? రాష్ట్రంలో కాంగ్రెస్ ను బ‌తికించుకోవాలి కాబ‌ట్టి, ప్ర‌స్తుతం హోదా సెంటిమెంట్ బలంగా ఉంది కాబ‌ట్టి, దీన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు రాహుల్ ప్ర‌య‌త్నిస్తార‌ని భావిస్తున్నారా…. ఇలాంటి అంశాలు ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయం! అయితే, హోదా అంశ‌మై కొంత చిత్త‌శుద్ధితోనే రాహుల్ గాంధీ హామీ ఇచ్చార‌నే న‌మ్మ‌కం ఏపీలో కొంత పెరుగుతోంద‌నే చెప్పొచ్చు. దానికి కార‌ణం లేక‌పోలేదు. ఆంధ్రాకు భాజ‌పా ఎట్టి ప‌రిస్థితుల్లోనూ న్యాయం చెయ్య‌దు అనే ఒక బ‌ల‌మైన అభిప్రాయం ప్ర‌జ‌ల్లో స్థిర‌ప‌డిపోయింది. సో.. ఈ నేప‌థ్యంలో భాజ‌పా ఇవ్వ‌దు కాబట్టి, ప్ర‌త్యామ్నాయంగా జాతీయ స్థాయిలో క‌నిపిస్తున్న‌ది కాంగ్రెస్సే.

ఇంకోటి… జాతీయ స్థాయిలో మూడో కూట‌మి ఏర్ప‌డే అవ‌కాశాలు కూడా కాస్త త‌క్కువ‌గానే క‌నిపిస్తున్నాయి. ఫెడ‌ర‌ల్ ఫ్రెంట్ అంటూ మొద‌లుపెట్టిన కేసీఆర్‌.. ఇప్పుడు భాజ‌పాకి అప్ర‌క‌టిత మిత్ర‌ప‌క్ష నేత‌గా మారిపోయారు. మమ‌తా బెన‌ర్జీ లాంటివారు కాంగ్రెస్ ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న ప‌రిస్థితి లేదు. ప్రాంతీయ పార్టీల ప్రాధాన్య‌త విష‌య‌మై కాంగ్రెస్ కూడా కొంత ప‌ట్టువిడుపు ధోర‌ణుల‌కు సిద్ధంగా ఉన్న‌ట్టు సంకేతాలు ఇస్తోంది. కాబ‌ట్టి, ఏపీ పాయింటాఫ్ వ్యూ నుంచి చూస్తే… కేంద్రంలో భాజ‌పాకి ప్ర‌త్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే క‌నిపిస్తున్న ప‌రిస్థితి. దీంతో హోదాపై రాహుల్ చేస్తున్న వ్యాఖ్య‌ల‌కు స‌హ‌జంగానే కొంత సానుకూల స్పంద‌నే వ‌స్తోంది. ఏపీ విష‌యంలో భాజ‌పా కంటే కాంగ్రెసే కొంత న‌యం… అసంబద్ధంగా విభ‌జించి త‌ప్పు చేసినా, దాన్ని దిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నామ‌నే క‌న్సెర్న్ చూపిస్తోంద‌న్న అభిప్రాయ‌మూ పెరుగుతోంది. ఏపీ ప్ర‌జ‌ల్లో కాంగ్రెస్ పై కొంత సానుకూల‌త ప్రారంభమైన తొలి ద‌శ ఇది. దీన్ని రాహుల్ ఎంత‌వ‌ర‌కూ నిల‌బెట్టుకుంటార‌నేది చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com