కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవ్వాళ్ళ విశాఖ ఏజన్సీ ప్రాంతంలో పాదయాత్రకి రావలసి ఉంది. కానీ జిల్లాలో అనుకూల వాతావరణం లేకపోవడంతో ఆయన పర్యటన రద్దయింది. విశాఖ ఏజన్సీ ప్రాంతంలో బాక్సైట్ త్రవ్వకాలని వ్యతిరేకిస్తూ ఆయన పాదయాత్ర చేపట్టాలనుకొన్నారు. నర్సీపట్నం, జెర్రెల, చింతపల్లి ప్రాంతాలలో బాక్సైట్ త్రవ్వకాలని వ్యతిరేకిస్తున్న గిరిజనులని కలిసి వారికి మద్దతు తెలపాలనే ఉద్దేశ్యంతో రాహుల్ గాంధీ ఈ పాదయాత్ర కార్యక్రమం పెట్టుకొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా రూపొందించుకోరనే సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులని, పార్టీ అవసరాలని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, పిసిసి అధ్యక్షుడు అందుకు అనుగుణంగా కార్యక్రమాలు రూపొందించి అధిష్టానానికి తెలిపితే, ఆ ప్రకారమే కార్యక్రమాలని రూపొందించుకొంటారు. కనుక రాహుల్ గాంధీ వంటి జాతీయ నేతల పర్యటన ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి ప్రయోజనం పొందేవిధంగా రూపొందించుకోవలసి ఉంటుంది. దాని వలన కలిగే మంచి లేదా చెడు ఫలితాల బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ నేతలదే అవుతుంది.
ఉదాహరణకి తెలంగాణాలో ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టులు, భూసేకరణపై ప్రతిపక్షాలు చాలా తీవ్ర పోరాటాలు చేస్తున్నాయి. కనుక టీ–కాంగ్రెస్ నేతలు అదే ప్రధాన అంశంగా తీసుకొని ఆదిలాబాద్ లో నిన్న రైతు గర్జన సభ నిర్వహిస్తే దానికి రైతుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. దాని వలన టీ–కాంగ్రెస్ పార్టీకి, దాని నేతలకీ కూడా మంచి రాజకీయ మైలేజ్ వస్తుంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాక్సైట్ త్రవ్వకాల గురించి ఎవరూ చర్చించడం లేదు. అందరి దృష్టి ప్రత్యేక హోదా అంశంపైనే ఉంది. అధికార, ప్రతిపక్ష పార్టీలతో సహా అందరూ ప్రత్యేక హోదా, రైల్వేజోన్ వంటి హామీల అమలు గురించే మాట్లాడుతున్నారు. కనుక ప్రజల దృష్టి కూడా వాటిపైనే ఉంది. ఇది గుర్తించకుండా అప్రస్తుత అంశంగా ఉన్న బాక్సైట్ త్రవ్వకాలని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ చేత పాదయాత్ర చేయించాలనుకోవడం నిరుపయోగమే కాదు వృధా ప్రయాస కూడా! కనుక రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినా చేయకున్నా ఒకటే! దాని వలన ఆయనకి, కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ప్రయోజనం కలుగకపోగా, ఆయనకి భద్రత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు పరుగులు తీయవలసి ఉంటుంది.