భాజ‌పా ఆరాటం బ‌య‌ట‌పెట్టిన రాజాసింగ్ వ్య‌వ‌హారం..!

ప్ర‌జాప్ర‌తినిధిని ర‌క్త మోడేలా కొట్ట‌డం దారుణం! ఒక ఎమ్మెల్యేపై పోలీసులు దాడి చేయ‌డం అమానుషం. తెలంగాణ‌లో ప్ర‌జా పాల‌న ఉందా, ర‌జాకార్లు పాల‌న ఉందా? – తెలంగాణ భాజ‌పా అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ ఈరోజు ఉదయం చేసిన ట్వీట్వ‌లో ఇదొక‌టి. భాజ‌పా ఎమ్మెల్యే రాజాసింగ్ మీద పోలీసులు దాడి చేశార‌నీ, త‌ల‌పై గాయ‌ప‌ర‌చారంటూ నిన్న అర్ధ‌రాత్రి నుంచి వివాదం మొద‌లైంది. ఇంత‌కీ ఈ వివాదం ఎందుకు అంటే… హైద‌రాబాద్ లోని జుమెరాత్ బ‌జార్ లో, రాణీ అవంతీ భాయ్ విగ్ర‌హాన్ని నిన్న‌టి అర్ధ‌రాత్రి వేళ ప్ర‌తిష్టించాల‌ని రాజాసింగ్ ప్ర‌య‌త్నించారు. అంత‌కుముందున్న ప‌ది అడుగుల విగ్ర‌హానికి బ‌దులు, ఇప్పుడు దాదాపు పాతిక అడుగులు ఎత్తున్న కొత్త‌ది పెట్టాల‌ని భావించారు. అయితే… విగ్ర‌హ ఏర్పాటుకు జీహెచ్ ఎంసీ నుంచిగానీ, పోలీసుల నుంచి ఎలాంటి అనుమ‌తులు లేవ‌ట‌! దాంతో నిన్న‌టి అర్ధ‌రాత్రి రాజాసింగ్ తోపాటు ఆయ‌న అనుచ‌రుల‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది. ఈ స‌మ‌యంలోనే రాజాసింగ్ త‌ల‌పై గాయ‌మైంది.

ఆయ‌న్ని గాయ‌ప‌రిచింది పోలీసులేన‌నీ, రాష్ట్రంలో త‌మ‌ని అణ‌చివేసేందుకు తెరాస ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోందంటూ భాజ‌పా అధ్య‌క్షుడు లక్ష్మ‌ణ్ తో స‌హా కొంత‌మంది విమ‌ర్శ‌లు మొద‌లుపెట్టేశారు. రాజాసింగ్ కి పోలీసుల బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌నీ, ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన ఘోషామ‌హ‌ల్, అసిఫ్ న‌గ‌ర్ ఏసీపీల‌పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే… అస‌లు విష‌యాన్ని పోలీసుల ఈ మ‌ధ్యాహ్న‌మే బ‌య‌ట‌పెట్టారు. రాజాసింగ్ ను ఎవ్వ‌రూ గాయ‌ప‌ర‌చ‌లేద‌నీ, త‌న‌కు తానే ఒక రాయి తెచ్చుకుని.. త‌ల‌పై బ‌లంగా కొట్టుకున్నారంటూ దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ను కూడా మీడియాకి విడుద‌ల చేశారు. త‌న‌ని తానే గాయ‌ప‌ర‌చుకుని, దాన్ని పోలీసుల మీదికీ నెట్టేసి, త‌ద్వారా ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసేందుకు రాజాసింగ్ వేసిన ప్లాన్ ఉల్టా అయింద‌నే విమ‌ర్శ‌లు ఇప్పుడు వినిపిస్తున్నాయి!

ఆప‌రేష‌న్ తెలంగాణ అనే మిష‌న్ మీద భాజ‌పా బాగా ఫోక‌స్ చేస్తున్న స‌మ‌యం ఇది! ఇలాంట‌ప్పుడు, ఏదో ఒక సున్నిత‌మైన అంశం భాజ‌పా చేతుల్లో ప‌డితే… దానికి వ‌చ్చే చిలవ‌లూ ప‌ల‌వ‌లూ తొడిగేసి వాడుకోవ‌డం వారికి తెలియ‌ని విద్య కాదు క‌దా! బెంగాల్ లాంటి ఉదాహ‌ర‌ణ‌లు చాలా ఉన్నాయి! ఇప్పుడీ రాజాసింగ్ పై దాడి అనే అంశానికి కూడా అదే స్థాయి స్క్రీన్ ప్లే జోడించేస్తారేమో అన్న‌ట్టుగా రాష్ట్ర భాజ‌పా అధ్య‌క్షుడు మొద‌లుకొని నేత‌లంతా ఒక్క‌సారి విమ‌ర్శ‌ల దాడి పెంచేశారు. ఇప్పుడిదంతా రాజాసింగ్ స్వ‌యంకృతం అని బ‌య‌ట‌ప‌డేస‌రికి… వ్య‌వ‌హారం గాడిత‌ప్ప‌టిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇంత‌కీ… త‌న‌ది స్వీయ‌దాడి అని ఇత‌ర భాజ‌పా నేత‌ల‌కు రాజాసింగ్ చెప్ప‌లేదా..? పోనీ, ఈ ఘ‌ట‌న గురించి భాజ‌పా నేత‌లైనా పూర్తిగా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌కుండానే విమ‌ర్శ‌లు చేసేశారా..? ఏతావాతా భాజ‌పా ఆరాటాన్ని బ‌య‌ట‌పెట్టిన వ్య‌వ‌హారంగా ఇది క‌నిపిస్తోంది!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com