రివ్యూ: రాజా ది గ్రేట్

హీరోయిన్ క‌ష్టాల్లో ఉంటుంది
ఓ క్రూర‌మైన విల‌న్ త‌న‌ని వెంటాడుతుంటాడు.
హీరో కాపాడ‌తాడు
ఇదే రాజా ది గ్రేట్ క‌థ‌.
ఈ క‌థ‌ని వేరే ఏ ద‌ర్శ‌కుడు చెప్పినా దిల్‌రాజు – సెకండాఫ్ విన‌కుండానే బ‌య‌ట‌కు పంపించేద్దుడు. కానీ చెప్పింది ఎవ‌రు?? రెండు హిట్లు ఇచ్చిన అనిల్ రావిపూడి. ప‌టాస్‌, సుప్రీమ్ ల‌తో త‌న ద‌మ్ము చూపించిన ద‌ర్శ‌కుడు కాబ‌ట్టి… క‌థ గురించి ప‌ట్టించుకోకుండా త‌న‌పై ఉన్న న‌మ్మ‌కంతో ఈ అవ‌కాశం ఇచ్చుంటాడు. రొటీన్ క‌థ‌కు – హీరో అంధుడు అనే పాయింట్ చేర్చ‌డం ఒక్క‌టే అనిల్ రావిపూడి చేయ‌గ‌లిగింది. దానికి ర‌వితేజ ఎన‌ర్జీ, అనిల్ రావిపూడి రైటింగ్ స్కిల్స్‌, దిల్ రాజు మేకింగ్ తోడ‌య్యాయి. మ‌రి ఈ మూడు క‌లిసి ఏమ‌య్యాయి?? రాజా ది గ్రేట్ అనిపించాయా, లేదా?? చూద్దాం రండి.

* క‌థ‌

ఈ సినిమా క‌థేంట‌న్న‌ది ఇంట్ర‌డ‌క్ష‌న్‌లోనే చెప్పేశాం. ఇంకాస్త క్లుప్తంగా చెప్పాలంటే.. ఓ సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ (ప్ర‌కాష్ రాజ్‌) కూతురు ల‌క్కీ (మెహ‌రిన్‌). త‌న ప్రాణానికి ప్రాణ‌మైన త‌మ్ముడ్ని చంపేశాడ‌న్న కోపంతో దేవ‌రాజు అనే ఓ గుండా ప్ర‌కాష్‌రాజ్‌ని చంపేస్తాడు. ల‌క్కీనీ చంపేయ‌డానికి వెంటాడ‌తాడు. ల‌క్కీని కాపాడే బాధ్య‌త ఐజీ (సంప‌త్‌రాజ్‌) తీసుకొంటాడు. ఓ టీమ్‌ని సెట్ చేస్తాడు. ల‌క్కీ డార్జిలింగ్‌లో త‌న స్నేహితురాలు ఇంట్లో ఉంటుంది. అక్క‌డికి టీమ్ ని పంపుతాడు ఐజీ. ఆ టీమ్‌లో రాజా (ర‌వితేజ‌) కూడా ఉంటాడు. రాజా పోలీస్ కాదు. అత‌నో అంధుడు. కాక‌పోతే బోలెడ‌న్ని తెలివితేట‌లు, ధైర్యం ఉంటాయి. త‌ల్లి (రాధిక‌) ఓ కానిస్టేబుల్. త‌న రిక‌మెండేష‌న్‌తో.. ఈ టీమ్‌కి స‌హాయం చేయ‌డానికి డార్జిలింగ్ వెళ్తాడు రాజా. ల‌క్కీతో ప‌రిచ‌యం పెంచుకొని త‌న‌కు ద‌గ్గ‌ర కావాల‌ని చూస్తాడు. విషాదం నిండిన జీవితాన్ని సంతోష‌మ‌యం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు. అది ఎంత వ‌ర‌కూ స‌ఫ‌లం అయ్యింది?? ల‌క్కీని దేవ‌రాజు నుంచి ఎలా కాపాడాడు?? అనేదే మిగిలిన క‌థ‌.

* విశ్లేష‌ణ‌

ఒక్క ముక్క‌లో చెప్పాలంటే హీరోయిన్‌ని హీరో కాపాడ‌డం ఈ సినిమా బెసిక్ కాన్సెప్ట్‌. ఇంత ప‌ర‌మ రొటీన్ లైన్ తో దిల్‌రాజు త‌న కెరీర్‌లోనే సినిమా తీసి ఉండ‌డు. కేవ‌లం ద‌ర్శ‌కుడిపై న‌మ్మ‌కంతో ఈ ప్రాజెక్టుకి ఓకే చెప్పేశాడేమో. హీరో క‌ళ్లు తీసేయ‌డం మిన‌హా ఇదేం కొత్త పాయింట్ కాదు. ఆ హీరో క‌ళ్లు లేక‌పోయినా, మామూలు క‌మర్షియ‌ల్ హీరో చేసే అద్భుతాల‌న్నీ చేసేస్తుంటాడు. హీరోకి క‌ళ్లు లేవు అన‌గానే… విషాదం, నీర‌సం, చాద‌స్తం, సెంటిమెంట్ ఇవ‌న్నీ ఉంటాయ‌నుకొంటాం. కానీ ఇది ర‌వితేజ సినిమా. ఆయ‌న సినిమా అంటే హుషారు ఉండాలి. ఆ డోసు సీను సీనుకీ పెంచుకొంటూ పోయేలా స‌న్నివేశాలు రాసుకొన్నాడు ద‌ర్శ‌కుడు. అదే ఈ సినిమాకి శ్రీ‌రామ‌ర‌క్ష‌. ర‌వితేజ ఎంట్రీ, క‌బ‌డ్డీ సీన్లు… ఆక‌ట్టుకొంటాయి. డార్జిలింగ్‌లో సీన్లూ ఓకే అనిపిస్తాయి. అయితే ఆ బ్యాంకు దోపిడీ మాత్రం మ‌రీ సిల్లీగా అనిపిస్తుంది. బ్యాంకు దోపిడీకి పోలీసుల్ని కూడా వాడుకోవ‌డం చూస్తే – ఈ ద‌ర్శ‌కుడు లాజిక్కుల‌కు ఏమాత్రం విలువ ఇవ్వ‌డు అన్న సంగ‌తి అర్థం అవుతుంది. ఓ పోలీస్ ఆప‌రేష‌న్‌కి డిపార్ట్‌మెంట్‌తో సంబంధం లేని వ్య‌క్తిని, అందునా అంధుడిని ఎలా తీసుకొంటారు?? పైగా పూత‌రేకుల కోసం.. ఐజీ క‌మిట్ అయిపోవ‌డం మ‌రీ సిల్లీ..

సెకండాఫ్ లో హీరో – విల‌న్‌ల మ‌ధ్య పోరు మొద‌లవుతుంది. హీరోయిన్ ఎక్క‌డుందో తెలిసిపోవ‌డంతోనే ఈ క‌థ అయిపోవాలి. కానీ అలా చేస్తే గంట‌న్న‌ర‌లోనే శుభం కార్డు వేయాలి. అందుకోసం.. సినిమాని లాగి లాగి ల్యాగ్ చేశాడు. `ఈ గీత దాటి రండ్రా చూసుకొందాం` అని హీరో అనగానే… షాక్‌కి గురైపోయి విల‌న్ అక్క‌డ్నుంచి పారిపోవ‌డంతోనే సినిమా ప‌ట్టు త‌ప్పింది. హీరోని మ‌ళ్లీ బెదిరించ‌డానికి వ‌స్తాడు విల‌న్‌. ఈసారి హీరోయిన్‌తో పాటు అమ్మ‌నీ తీసుకెళ్లిపోతాడు. వాళ్లిద్ద‌రినీ రక్షించుకోవ‌డంతో క‌థ అయిపోవాలి. కానీ ఇక్క‌డ మాత్రం అవ్వ‌దు. విల‌న్ కీ హీరో త‌ల్లికీ మ‌ధ్య ఛాలెంజ్ పెట్టి… మ‌రో ఫైట్ పెట్టి, ఈమ‌ధ్య‌లో ఓ పాట వేసి.. ఇక చాలు.. చాలు అని ప్రేక్ష‌కుడు అనుకొనేంత వ‌ర‌కూ తీసుకొచ్చాడు ద‌ర్శ‌కుడు. అయితే ఆ యాక్ష‌న్ సీన్లు ఒకొక్క‌టీ ఒక్కో కాన్సెప్ట్‌లో రాసుకోవ‌డం, ర‌వితేజ ఎన‌ర్జీ మిక్స్ కావ‌డం వ‌ల్ల‌.. అక్క‌డ‌క్క‌డా ఓకే అనిపిస్తూ.. కూర్చోగ‌లిగాడు ప్రేక్ష‌కుడు.

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

ఈ క‌థ ముందు రామ్ కోసం రాసుకొన్నాడు అనిల్‌. ఆ త‌ర‌వాత ఎన్టీఆర్‌కీ చెప్పాడు. తీరా చూస్తే ర‌వితేజ‌తో సెట్ అయ్యింది. సినిమా చూస్తే మాత్రం ర‌వితేజ త‌ప్ప ఇంకెవ్వ‌రూ ఈ పాత్ర చేయ‌లేరు అనిపించేలా తీశాడు అనిల్‌. ఆ పాత్ర‌లో ర‌వితేజ అంత బాగా ఇమిడిపోయాడు. ర‌వితేజ ఎన‌ర్జీ లేక‌పోతే ఈ సినిమా ఓ సాదాసీదా సినిమాలా మిగిలిపోయేది. త‌న‌కు మాత్ర‌మే సాధ్య‌మయ్యే టైమింగ్‌తో ఆక‌ట్టుకొన్నాడు. మెహ‌రీన్ సినిమా అంతా ఉన్నా.. త‌న మార్క్ చూపించ‌లేక‌పోయింది. `నా ఎక్స్ ప్రెష‌న్ ఇంతే` అన్న‌ట్టు నిల‌బ‌డిపోయింది. ప్ర‌కాష్‌రాజ్‌ది చిన్న పాత్రే. రాధిక త‌న న‌ట‌న‌తో మెప్పించింది. మిగిలిన‌వాళ్లూ ఓకే అనిపిస్తారు.

* సాంకేతిక వ‌ర్గం

క‌థ‌కుడిగా అనిల్‌రావిపూడి విఫ‌లం అయ్యాడు. త‌న క‌థ‌లో కొత్త‌ద‌నం లేదు. హీరోని ఎలాగూ గుడ్డివాడ్ని చేసేశాం కాబ‌ట్టి… ఇంకా ఎక్కువ ప్ర‌యోగాలు చేయ‌కూడ‌దు అని ఫిక్స‌యిపోయిన‌ట్టున్నాడు. కామెడీ సీన్లు రాసుకోవ‌డంలో త‌న ప్ర‌త్యేక‌త చూపించాడు. కానీ అక్క‌డ‌క్క‌డా ఆ డోస్ ఓవ‌ర్ అయ్యింది. ఇంట్లో పెళ్లాల్ని కొట్ట‌డం, పిల్ల‌ల్ని త‌న్న‌డం.. వీటి నుంచి కూడా కామెడీ వ‌స్తుందని ఎలా అనుకొన్నాడో?? సాయికార్తీక్ పాట‌లు ఈ సినిమాకి మైన‌స్‌. తొలి పాట మిన‌హాయిస్తే. పెద్ద‌గా ఊపు లేదు. గున్నా గున్నా మామిడి.. పాపుల‌ర్ గీత‌మే. ఆ పాటేదో ఊపేస్తుంద‌నుకొంటారంతా. కానీ.. దాన్నీ బ‌ల‌వంతంగా చొప్పించిన‌ట్టే అనిపిస్తుంది. కెమెరా, ఆర్ట్ విభాగాలు బాగా ప‌నిచేశాయి. దిల్ రాజు పెట్టిన ఖ‌ర్చు తెర‌పై క‌నిపించింది.

* ఫైన‌ల్ ట‌చ్‌: ఉహుహుహూ…..

తెలుగు360.కామ్ రేటింగ్ : 2.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com