రాజ‌మౌళి స‌ర్‌ప్రైజ్ ఇస్తాడా??

బాహుబ‌లి 2 త‌ర‌వాత రాజ‌మౌళి తీయ‌బోయే సినిమా ఏంట‌న్న విష‌యంలో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. రాజ‌మౌళి అడ‌గ్గానే కాల్షీట్లు ఇవ్వ‌డానికి టాప్‌స్టార్స్ రెడీగా ఉంటారు. ఆయ‌న కోరుకొంటే బాలీవుడ్ లోనూ ఓ సినిమా చేయొచ్చు. కానీ… రాజ‌మౌళి దృష్టి తెలుగు సినిమాపైనే ఉంది. ఇప్ప‌ట్లో ఆయ‌న బాలీవుడ్ వెళ్లే ఆలోచ‌న చేయ‌క‌పోవొచ్చు. ఎన్టీఆర్‌, మ‌హేష్ బాబుల‌లో ఎవ‌రితోనో ఒక‌రితో సినిమా చేసే అవ‌కాశాలున్నాయ‌న్న‌ది సుస్ప‌ష్టం. అయితే… అంద‌రినీ ఆశ్చర్య‌ప‌రిచే మ‌రో కొత్త ప్రాజెక్ట్‌తోనూ రాజ‌మౌళి రావొచ్చ‌న్న‌ది విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

ఐదేళ్లు కేవ‌లం ఒకే సినిమాపై (రెండు భాగాలైన‌ప్ప‌టికీ) ఫోక‌స్ చేసి, ఇప్పుడు మ‌రో సినిమాపై దృష్టి పెట్ట‌డం క‌ష్ట‌మైన విష‌య‌మే. బాహుబ‌లి నుంచి మైండ్ డైవ‌ర్ట్ చేసుకోవ‌డానికి జ‌క్క‌న్న‌కు కొంత స‌మ‌యం ప‌డుతుంది. పైగా… ఐదేళ్లుగా రాజ‌మౌళికి విరామం అంటూ లేదు. అందుకే బాహుబ‌లి త‌ర‌వాత రెండు నెల‌లు విశ్రాంతి తీసుకోవాల‌ని జ‌క్క‌న్న ప్లాన్ చేస్తున్నాడు. ఈ రెండు నెల‌లు సినీ వాతావ‌ర‌ణానికి దూరంగా ఉండాల‌న్న‌ది రాజ‌మౌళి ఉద్దేశం. ఆ త‌ర‌వాతే.. కొత్త సినిమా గురించి ప్లాన్ చేస్తాడ‌ట‌. అయితే నేరుగా మ‌హేష్‌తోనో, ఎన్టీఆర్‌తోనే సినిమా చేయ‌క‌పోవ‌చ్చు. మ‌గ‌ధీర త‌ర‌వాత రాజ‌మౌళి ఏం చేశాడో.. ఇప్పుడూ అలాంటి ప్లానింగ్‌తోనే ఉన్నాడ‌ని తెలుస్తోంది. మ‌గ‌ధీర త‌ర‌వాత రాజ‌మౌళిపై అంచ‌నాలు తారా స్థాయికి చేరుకొన్నాయి. అప్పుడు కూడా ఇలానే.. స్టార్ హీరోలంతా రాజ‌మౌళితో సినిమా చేయ‌డానికి త‌హ‌త‌హ‌లాడారు. కానీ… రాజ‌మౌళి మాత్రం సునీల్‌తో మ‌ర్యాద రామ‌న్న తీసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. స‌రిగ్గా ఇప్పుడూ అలాంటి స్ట్రాట‌జీ ఫాలో అయ్యే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. ఓ చిన్న హీరోతో, లేదంటే చిన్న బ‌డ్జెట్ తో ఓ సినిమా తీసి.. సింపుల్‌గా రిలీజ్ చేద్దామ‌నుకొంటున్నాడ‌ట రాజ‌మౌళి. ఓ డిఫ‌రెంట్ క‌థ‌తో స‌ర్‌ప్రైజ్ చేద్దామ‌నుకొంటున్నాడ‌ట‌. త‌ద్వారా త‌న సినిమాపై తానే అంచ‌నాలు త‌గ్గించుకొనే ప్ర‌యత్నాల్లో ఉన్నాడ‌ని టాక్‌. అందుకు సంబంధించిన ఓ క‌థ కూడా రాజ‌మౌళి సిద్ధం చేశాడ‌ని, త‌ప్ప‌కుండా జ‌క్క‌న్న నుంచి మ‌ర్యాద రామ‌న్న, ఈగ త‌ర‌హా సినిమా ఒక‌టి ఆశించొచ్చ‌ని తెలుస్తోంది. మ‌రి రాజ‌మౌళి ఎలాంటి స‌ర్‌ప్రైజ్ ఇస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com