శంకర్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే

శంక‌ర్‌పై ర‌జ‌నీ అభిమానుల‌కు కొండంత కోపం ఉండొచ్చు. ఎందుకంటే ‘రోబో 2.0’ని బాగా లేట్ చేస్తున్నాడుగా. ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసి, ఎదురుచూసి విసిగిపోయారంతా. వాళ్లంద‌రూ ఇప్పుడు ‘కాలా’ హ‌డావుడిలో ప‌డిపోయారు. ‘కాలా’ ముచ్చ‌ట్ల‌లో ఉన్న ర‌జ‌నీ ఫ్యాన్స్‌కి ‘రోబో 2.0’ ఓ స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. మేకింగ్ వీడియోని విడుద‌ల చేసి. మేకింగ్ వీడియో అంటే సెట్లో ఏం జ‌రిగిందో అది చూపించ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. కానీ సినిమాలో ఏముందో.. దాన్ని విజువ‌ల్‌గా ఎలా చూపిస్తారో… అవ‌న్నీ ఈ మేకింగ్ వీడియోలో క‌నిపించాయి. యానిమేష‌న్ రూపంలో ఈ సినిమాలోని కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాల్ని చూపించేశాడు శంక‌ర్‌. పేరుకి యానిమేష‌న్ అయినా, తెర‌పై అవ‌న్నీ ఏ స్థాయిలో ఉంటాయో ప్రేక్ష‌కులు ఊహించుకోవొచ్చు. సినిమా క‌థ‌, అందులోని సన్నివేశం ముందే తెలిసిపోతే.. సినిమా చూస్తున్న‌ప్పుడు ఆ కిక్ ఉండ‌ద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తుంటారు. త‌న క‌థ‌ల‌న్నీ ముందే చెప్పేసే రాజ‌మౌళి సైతం `బాహుబ‌లి` గురించి ఒక్క ముక్క కూడా చెప్ప‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు. కానీ శంక‌ర్ మాత్రం మేకింగ్ వీడియోల పేరుతో… సినిమాలోకి కంటెంట్‌ని ముందే చూపించ‌డానికి సాహ‌సిస్తున్నాడు. నిజంగా ఈ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. శంక‌ర్ విజ‌న్ అద్భుతంగా ఉంటుంది. అది రోబో 2.0 మేకింగ్ వీడియోలో మ‌రోసారి క‌నిపించింది. ఈ మేకింగ్ వీడియోలో ఉన్న‌ది కేవ‌లం.. ఓ న‌మూనా మాత్ర‌మే. దాన్ని శంక‌ర్ ఏ స్థాయిలో తీశాడో అని అభిమానులంతా చర్చించుకుంటున్నారిప్పుడు. వాళ్లంద‌రి అంచ‌నాలూ నిజ‌మైతే… ‘రోబో 2’ ఎవ్వ‌రికీ అంద‌ని అద్భుతాలు సృష్టించ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.