టార్గెట్ మోజో టీవీ..! రామేశ్వరరావు కుట్రలంటున్న జర్నలిస్టులు..!

తెలంగాణలో మీడియా.. గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కార్పొరేట్ శక్తుల గుప్పిట్లో.. నలిగిపోతోంది. తాజాగా… ఈ బాధిత టీవీ చానళ్ల జాబితాలోకి మోజో టీవీ కూడా చేరింది. ఆ చానల్ ప్రసారాలను… నిన్న రాత్రి అర్థంతరంగా నిలిపివేశారు. ఏ కేబుల్ నెట్‌వర్క్‌లోనూ రావడం లేదు. ఓ రకంగా ఇది చట్ట ఉల్లంఘనే. ఇటీవల.. పెట్టిన నిబంధనల ప్రకారం.. ప్రేక్షకుడు కోరుకున్న వంద ఫ్రీ టు ఎయిర్ చానళ్లను కచ్చితంగా ఇవ్వాలి. కానీ ఆపరేటర్లు.. అనూహ్యగా.. మోజో టీవీని ఆపేశారు. దానికి వారు ఏదో కారణాలు చెప్పి బయటపడవచ్చు కానీ.. అసలు కారణం.. ఆ చానల్ తమపై జరుగుతున్న కుట్రల్ని బయటపెట్టి… బ్రేకింగ్‌న్యూస్‌ల పేరుతో ఆవేదన చెప్పుకోవడమే.

రవిప్రకాష్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని భావిస్తున్న మోజో టీవీ యాజమాన్యాన్ని.. అందులో పని చేసే వారిని టార్గెట్ చేశారు. ఓ వైపు.. మోజో టీవీ చైర్మన్ హరికిరణ్ చేరెడ్డిని .. కేసుల పేరుతో పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారణ పేరుతో గంటల తరబడి పోలీసులు కూర్చో బెడుతున్నారు. అయితే ఈ క్రమంలో ఆయనతో… బలవంతంగా షేర్లు బదిలీ చేయించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని..మోజో టీవీ ఆరోపణలు గుప్పిస్తోంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున బ్రేకింగ్‌న్యూస్‌లతో… తమ ఆవేదనను బయట పెట్టింది. రియల్ ఎస్టేట్, బిల్డర్, కాంట్రాక్టర్, విద్యా మాఫియా.. తమ మీడియాపై పెత్తనానికి ప్రయత్నిస్తోందని… మండి పడుతున్నారు.

ప్రధానంగా..మోజో టీవీ ఆరోపణలు… మైహోం గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు మీదనే ఉన్నాయి. ఆయనే.. స్వయంగా బెదిరింపులకు పాల్పడి… మోజో టీవీని ఉచితంగా పొందాలని చూస్తున్నారని మోజో టీవీ సిబ్బంది ఆరోపిస్తున్నారు. అదే సమయంలో.. మోజో టీవీకి సంబంధించిన సీఈవో రేవతి, యాంకర్ రఘులకు.. పోలీసులు మరో కేసులో నోటీసులు జారీ చేశారు. నాలుగు నెలల కిందట… శబరిమల ఇష్యూపై.. ఓ చర్చా కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఓ వ్యక్తి.. తనను అవమానించారంటూ… పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాన్ని ఎస్సీ, ఎస్టీ కేసుగా మార్చిన పోలీసులు.. రెండు రోజుల్లో… సీఈవో రేవతి, యాంకర్ రఘులను అరెస్ట్ చేస్తామనే హెచ్చరికలు ప్రారంభించారు. దీంతో..మోజో టీవీ సిబ్బందిలోనూ ఆందోళన ప్రారంభమయింది. తాను స్టూడియోలోనే ఆమరణదీక్ష చేస్తానని.. సీఈవో రేవతి ప్రకటించారు.

టీవీ9లో రామేశ్వరరావు అక్రమంగా చొరబడి… యాజమాన్య హక్కలను ధనస్వామ్యంతో కబ్జా చేశారని… నిన్న ముందే… టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్… ఓ వీడియో విడుదల చేశారు. అది వైరల్‌గా ఉండాగనే… మోజో టీవీపై… రామేశ్వరరావు కుట్రలు చేస్తున్నారనే వార్తలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతానికి మోజో టీవీ సీఈవోను అరెస్ట్ చేయడానికి.. పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com