ఎరువుల ఫ్యాక్టరీకి పునర్జన్మ… కలా నిజమా!

రామగుండం పేరు చెప్తే ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి ఎరువుల కర్మాగారం గుర్తుకు వచ్చేది. ఇది ఒకప్పటి మాట. ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రం తర్వాత అక్కడ చూడాల్సిన ప్రదేశాల లిస్టులో ఎరువుల ఫ్యాక్టరీ ఉండేది. 1980లో దీన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 1989లో యూరియా, అమ్మోనియా ఉత్పత్తి నిలిచిపోయింది. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించిన ఈ కర్మాగారాన్ని పునరుద్ధరించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 7న దీనికి శంకుస్థాపన చేయబోతున్నారు. ఫ్యాక్టరీ మళ్లీ ఉత్పత్తి ప్రారంభిస్తుందంటే ఇది కలా నిజమా అని ఆశ్చర్యపోతున్నారు రామగుండం వాసులు.

నాఫ్తా ఆధారిత ఫ్యాక్టరీగా రామగుండం ఎరువుల కర్మాగారం దేశానికి నాణ్యమైన ఎరువులను అందించింది. రామగుండం యూరియా అంటే కళ్లు మూసుకుని కొనవచ్చని దేశ వ్యాప్తంగా పేరుండేది. అయితే నిరంతర విద్యుత్ సరఫరా చేయడంలో ప్రభుత్వ వైఫల్యం దీనికి శాపంగా మారింది. కేవలం విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్లే ఫ్యాక్టరీ భారీగా నష్టపోయింది. తర్వాతి కాలంలో ప్రయివేటు ఎరువుల కర్మాగారాల జోరు పెరిగింది. వివిధ కారణాల వల్ల ఈ ఫ్యాక్టరీ మూతపడింది.

ఇంతకాలానికి ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. తమ విన్నపం మేరకు ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారని బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. 6 వేల కోట్ల రూపాయలతో ఫ్యాక్టరీ పునరుద్ధరణ చేపడుతున్నారు. దీన్ని మూడేళ్లలో నిర్మించి ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే అతిపెద్ద ఎరువుల కర్మాగారాల్లో ఒకటి అవుతుంది. ఇందులో యూరియా ఉత్పత్తి సామర్థ్యం 13 లక్షల టన్నులు. తెలంగాణతో పాటు దక్షిణ భారతం అంతటా రామగుండం యూరియా అందుబాటులోకి వస్తుంది. అంతేకాదు, అమ్మోనియా కూడా పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతుంది. కర్మాగారం మాజీ ఉద్యోగులు, కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం తదితర అంశాలను పరిశీలించడానికి ఓ కమిటీని నియమించారు. కేంద్ర ప్రభుత్వం ఫ్యాక్టరీ పునరద్ధరణ వేగంగా చేయడానికి తగిన చర్యలు తీసుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com