ఇండీవుడ్ ఎవ‌రి ప్రయోజ‌నాల కోసం?

మూడ్రోజుల క్రితం రామోజీ ఫిల్మ్‌సిటీలో మొద‌లైన ఇండీవుడ్‌కి ఈరోజు గుమ్మడికాయ్ కొట్టేస్తారు. నాలుగు రోజులు సినిమా పండ‌గ నేటితో ముగిసిపోతుంది. అంతా బాగానే ఉంది. అస‌లు ఈ ఇండీవుడ్ ఎందుకు పెట్టిన‌ట్టు? ఎవ‌రి కోసం..?

దేశం మొత్తమ్మీద ప్రతీ భాష‌కు ఓ చ‌ల‌న చిత్ర ప‌రిశ్రమ ఉంది. బాలీవుడ్‌, టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్‌,మ‌ల్లూ వుడ్ అంటూ ఎవ‌రికి న‌చ్చిన‌ట్టు వాళ్లు పిలుచుకొంటున్నారు. ఈ ప‌రిశ్రమ‌ల‌న్నింటినీ ఒకే చోట‌కు చేర్చి ఇండీవుడ్ అన్నార‌న్నమాట‌. భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్రమ‌ల‌న్నీ ఒకే వేదిక‌పై వ‌చ్చి త‌మ ప్రతిభ చూపించే ఉద్దేశంతో ఇండీవుడ్ మొద‌లైంది. ల‌క్ష్యం బాగానే ఉంది. కానీ ఇప్పటి వ‌ర‌కూ ఏం జ‌రిగింది, ఏం జ‌రుగుతోంది..? అనేవి ఆలోచిస్తే సంతృప్తిక‌ర‌మైన స‌మాధానాలు మాత్రం ల‌భించ‌వు. రూ. 70 వేల కోట్ల ప్రాజెక్ట్ ఇది. సినిమా వ్యాపారాన్ని అంత‌ర్జాతీయ స్థాయిలో చేయాల‌ని, సినిమాల‌తో మ‌రింత ధ‌నం ఆర్జించాల‌ని, సినిమాని మారుమూల ప్రాంతానికి కూడా చేర‌వేయాల‌న్నది ఇండీవుడ్ ల‌క్ష్యం. ల‌క్ష్యమైతే అద్భుతంగా ఉంది. కానీ చేసిందేమిటి? నాలుగు రోజుల పాటు ఫిల్మ్‌సిటీలో ఇండియ‌న్ కార్నీవాల్ జ‌రుగుతోంద‌న్న విష‌యం ఎవ‌రికి తెలుసు? అక్కడికి ఎంత‌మంది ప్రతినిధులు వెళ్లారు? టాలీవుడ్ నుంచి హాజ‌రైన వాళ్లెంత మంది? సినిమా భ‌విష్యత్తు మార్చే యువ‌త‌రానికి ఇండీవుడ్‌తో చెప్పిందేమిటి? వీటికి స‌మాధానాలు ల‌భించ‌వుగాక ల‌భించ‌వు.

ఓ ప్రైవేటు అవార్డు ఫంక్షన్ జ‌రిగితే సినిమా స్టార్లు పొలో మంటూ వెళ్లిపోతారు. సంతోషం లాంటి వార ప‌త్రిక ద‌క్షిణాదిలోని స్టార్లంద‌రికీ ఒకే వేదిక‌పైకి తీసుకొచ్చి ఘ‌నంగా అవార్డుల్ని అందిస్తుంది. మ‌రి ఇండీవుడ్ అని, రూ.70 వేల కోట్లు అని చెప్పుకొనేప్పుడు ఈ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో ఒక్కస్టారూ క‌నిపించ‌లేదేం? క‌నీసం టాలీవుడ్ నుంచి ఎవ్వరూ హాజ‌ర‌వ్వలేదే? టాలీవుడ్‌లో స‌గం హీరోలు రామోజీ ఫిల్మ్‌సిటీలోనే మ‌కాం వేస్తారు. క‌నీసం వాళ్లొచ్చినా పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొనేది క‌దా? మిగిలిన మీడియా ఫోక‌స్ పెట్టేది క‌దా? క‌నీసం ఆ రూపంలో అయినా ఇండీవుడ్ అనేది ఒక‌టి జ‌రుగుతోంది.. అనేది జ‌నాల‌కు తెలిసేది క‌దా? కానీ అలాంటి ప్రయ‌త్నాలేం జ‌ర‌గ‌డం లేదు.

కేవ‌లం ఈనాడు, రామోజీ ఫిల్మ్‌సిటీ, ఈటీవీల కోస‌మే ఇండీవుడ్ పెట్టారేమో అన్న విమ‌ర్శలు వినిపిస్తున్నాయి. ఈ నాలుగు రోజుల పండ‌గ మొత్తం ఫిల్మ్‌సిటీలోనే జ‌రిగింది. త‌ద్వారా ఫిల్మ్‌సిటీకి కోట్ల రూపాయ‌ల ఆదాయం ల‌భించ‌డం ఖాయం. అంత లాభం వ‌చ్చింది కాబ‌ట్టే ఈనాడు, ఈటీవీల్లో ఇండీవుడ్‌ని విరివిగా ప్రమోట్ చేస్తున్నారు. దాదాపు ఫుల్ పేజీ కేటాయిస్తున్నారు. మ‌రి మిగిలిన మీడియా ప‌ట్టించుకోని ఈ వేడుక‌ని ఈనాడే ప్రత్యేకంగా ఎందుకు ప‌ట్టించుకొన్నట్టు?? అనే ప్రశ్నకు ఇంత‌కు మించిన సమాధానం ఏం కావాలి? పైగా ఈనాడులోనూ ఫిల్మ్‌సిటీ ప్రమోష‌న్లే. అతిథి ఎవ‌రైనా స‌రే, ఫిల్మ్‌సిటీలో సౌక‌ర్యాలు అబ్బో అంటే.. ఆయా వార్తల్ని ప్రముఖంగా ప్రచురించాల్సిందే. ఇదంతా చూస్తుంటే ఇండీవుడ్ వ‌ల్ల లాభ‌ప‌డింది రామోజీ ఫిల్మ్‌సిటీనేమో అనిపిస్తోంది.

టాలీవుడ్ నుంచి సినీ సెల‌బ్రెటీల‌ను కూడా ర‌ప్పించ‌లేని ఇండీవుడ్ ల‌క్ష్యం నెర‌వేరింద‌ని ఎలా అనుకొంటాం? ఊరికి దూరంగా ఫిల్మ్‌సిటీలో ఈ వేడుక నిర్వహిస్తే.. జ‌నాల‌కు ఎలా చేరువైన‌ట్టు? చ‌ర్చావేదిక‌లు, స్క్రీనింగ్‌లూ ఇది కాదు క‌దా భార‌తీయ చ‌ల‌న చిత్రసీమ‌ను అభివృద్ది ప‌రిచే అంశాలు. అస‌లుని గాలికి వ‌దిలేసి, కొస‌రు కార్యక్రమాల‌కు పెద్ద పీట వేయ‌డం వ‌ల్ల ఎవ‌రికి లాభం?? వీటిపై క‌నీస క్లారిటీ కనీసం ఇండీవుడ్ నిర్వాహ‌కుల‌కు, డ‌బ్బులు వెద‌జ‌ల్లుతున్నవారికీ ఉందో, లేదో??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com