అమ్మా..తల్లీ…ఇక్కడ ‘ఖండిస్తున్నా’ డైలాగ్ కరెక్ట్ కాదేమో

రామ్ గోపాల్ వర్మ తీసిన క్లాసిక్ హిట్ ఫిల్మ్ ‘గాయం’ గుర్తుందా. అందులో రాజకీయనాయకుడిగా నటించిన కోట శ్రీనివాసరావు ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంటుంది. ‘ఖండిస్తున్నా’ అని భలే కామెడీగా చెప్తూ ఉంటాడు కోట. అవతలి పార్టీ వాళ్ళు ఏం చేసినా ఖండిస్తున్నా అని అనడమే రాజకీయం అన్నట్టుగా భావించే బోలెడుమంది అథమస్థాయి నాయకులను పరిశీలించి ఆ సీన్ రాసుకున్నాడు వర్మ. జనాలు కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు కోట శ్రీనివాసరావు చేసిన పనిని కన్నడ నటి రమ్య చేస్తోంది. సినిమాలో తెర చిరిగిపోయే రేంజ్‌లో చిందులేసిన రమ్యను ఏ రాజకీయ నేత చేరదీశాడో, ఎవరు ఎంకరేజ్ చేశారో తెలియదుకానీ రాత్రికి రాత్రే ప్రజాప్రతినిధి అయిపోయింది. కానీ కాలం కలిసి రాక అనతికాలంలోనే మాజీ కూడా అయిపోయింది.

అప్పటి నుంచి చేయడానికి పని ఏమీ లేకుండా పోయింది. అంటే పదవిలో ఉన్నప్పుడు పని చేసిందని కాదు…పదవి ఉంటే మీడియాలో కనిపించడం ఈజీ కదా. అదే పదవి పోయాక మీడియా వాళ్ళు పట్టించుకోరు. పదవి లేకపోయినా ఫర్వాలేదు కానీ మీడియాలో కనిపించకపోతే మాత్రం మన నాయకులకు అస్సలు నిద్రపట్టదు. చిన్న చిన్న విషయాల గురించి మాట్లాడితే మన మీడియా అస్సలు స్పందించదు. వాళ్ళకు బ్రేకింగ్ న్యూస్ కావాలి. ఓ భారతదేశ మాజీ ఎంపి… పాకిస్తాన్‌ని పొగడడానికి మించిన బ్రేకింగ్ న్యూస్ ఏముంటుంది? రమ్య కూడా అదే చేసింది. భారతదేశ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మాటలను ‘ఖండించింది. ఖండఖండాలుగా నరికేసింది’. భారత దేశ రక్షణ మంత్రి మాటలు సరికాదట. పాకిస్తాన్ కూడా చాలా మంచి దేశమట. పాకిస్తాన్‌కి వెళితే నరకానికి వెళ్ళినట్టుంటుంది అన్న మన రక్షణ మంత్రి మాటలను అలా ఖండించేసింది రమ్య.

భూమి పుట్టక ముందు పుట్టిన పార్టీ అని యువనేత(?)తో సహా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మొన్న ఒక సీనియర్ నాయకుడేమో ‘భారత ఆక్రమిత కాశ్మీర్’ అని అన్నాడు. ఇంకో కాశ్మీరీ నేతేమో కాశ్మీర్‌లో గొడవలకు పాకిస్తాన్ కారణం కాదన్నాడు. ఇప్పుడు రమ్య మేడంగారు మన రక్షణ మంత్రి మాటలను ‘ఖండిస్తూ’ మరో స్టెప్ ముందుకేశారు. ఈ కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్‌కి ఇంకెన్ని ఆయుధాలు ఇస్తారో చూడాలి. ‘నన్ను పాకిస్తానీ అని పిలవడం కంటే కుక్క అని పిలిస్తే సంతోషిస్తా…’ అన్న బెలూచిస్తాన్ వాసి మాటలు వీళ్ళకు అస్సలు వినిపించవేమో.

ఇలాంటి మాటలు మాట్లాడతారు కాబట్టే కాంగ్రెస్ పార్టీ పైన సోషల్ మీడియాలో సెటైర్స్ పడుతూ ఉంటాయి. ‘రేయ్..ఆ కాంగ్రెసోళ్ళను అలా వదిలేయకండ్రా….ఎవరికైనా చూపించండ్రా…..’ అని.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]