ఎన్నిక అయింది క‌దా.. ఇక‌నైనా త‌గ్గొచ్చు క‌దా!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తీవ్ర ఉత్కంఠ రేపిన నంద్యాల ఉప ఎన్నిక పూర్త‌యింది. చిన్న‌చిన్న సంఘ‌ట‌న‌ల మిన‌హా, ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా జ‌రిగాయ‌నే చెప్పాలి. తెలుగుదేశం, వైయ‌స్సార్ సీపీలు ఈ ఎన్నిక‌ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌డంతో పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. గ‌డ‌చిన రెండు ఎన్నిక‌ల కంటే ఎక్కువ‌గా నంద్యాల‌లో పోలింగ్ న‌మోదైంది. 79.29 శాతం ఓట్లు పోల్ అయిన‌ట్టు అధికారులు తెలిపారు. నంద్యాల ప్ర‌జ‌లు అంచ‌నాల‌కు మించి ఓటెయ్య‌డానికి త‌ర‌లి వ‌చ్చార‌ని చెప్పుకోవ‌చ్చు. సాధార‌ణంగా అయితే.. ఎన్నిక పూర్త‌యిన వెంట‌నే పోటీ ప‌డుతున్న అభ్యర్థులు ఫ‌లితాల కోసం ఎదురుచూస్తారు, విమ‌ర్శ‌నాస్త్రాల‌ను ఇక క‌ట్టిపెడ‌తారు. కానీ, నంద్యాల ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ఇంకా స‌మ‌యం ఉన్నా స‌రే.. త‌మ‌దే విజ‌యం అన్న‌ట్టుగా ఇరు పార్టీలూ ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపేస్తుండ‌టం విడ్డూరం! కొన్నాళ్లైనా విమ‌ర్శ‌ల‌కు విరామం ఇవ్వ‌క‌పోవ‌డం ఆశ్య‌ర్యం!

ఈ ఎన్నిక త‌రువాత త‌న‌కు ఎంతో ఆనందంగా ఉంద‌ని మంత్రి భూమా అఖిల ప్రియ చెప్పారు. తెలుగుదేశం పార్టీకి మంచి మెజారిటీ వ‌స్తుంద‌ని ధీమాతో సంతోషంగా ఉంద‌న్నారు. ఎన్నిక ముగిసిన త‌రువాత, తిరిగి ఇంటికి వెళ్తూ త‌న తండ్రిని త‌ల్చుకున్నామ‌నీ, భూమా నాగిరెడ్డి ఏ విధంగా అయితే ఎన్నిక‌లు న‌డిపేవారో… అదే రీతిలో తాము కూడా ఎన్నిక‌ల‌ను న‌డిపామ‌ని చాలా గ‌ర్వంగా భావిస్తున్నామ‌ని అఖిల ప్రియ అన్నారు. రెచ్చ‌గొట్టేందుకు ఎంతోమంది ప్ర‌య‌త్నించినా కూడా ఎంతో ప్ర‌శాంతంగా ఎన్నిక‌లు జ‌రిగింద‌నీ, ప్ర‌జ‌ల తీర్పు త‌మ‌వైపే ఉంద‌ని ఆమె ధీమా వ్య‌క్తం చేశారు. ఇక‌, వైకాపా అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్ రెడ్డి కూడా దాదాపు ఇలానే మాట్లాడారు. ఉప ఎన్నిక‌ల్లో వైకాపా విజ‌యం నూటికి నూరుపాళ్లు గెలుస్తుంద‌ని ధీమా చెప్ప‌గ‌ల‌మ‌న్నారు. ప్ర‌జ‌ల స్పంద‌న చూసినా, ఓటింగ్ శాతం పెరిగిన తీరును చూసినా.. ఇదంతా టీడీపీ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌తగానే చెప్పుకోవ‌చ్చ‌ని అన్నారు! నంద్యాల‌లో వైకాపా జెండా ఎగ‌రబోతోంద‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు!

ఇక్క‌డి వ‌ర‌కూ ఓకే.. కానీ, ఇప్పుడు కూడా విమ‌ర్శ‌ల‌కు త‌గ్గ‌క‌పోవ‌డం విశేషం. త‌న‌ను స్థానికేత నాయ‌కురాలు అంటూ శిల్పా విమ‌ర్శించ‌డం త‌గ‌ద‌నీ, త‌న సొంత నియోజ‌క వ‌ర్గానికి నంద్యాల అర్ధ‌గంట ప్ర‌యాణ‌మేన‌నీ.. శిల్పా మోహ‌న్ రెడ్డి ఎక్క‌డో క‌డ‌ప నుంచి వ‌చ్చి ఇక్క‌డ పోటీ చేశార‌నీ, స్థానికేత‌రులు ఎవ‌రంటూ అఖిలప్రియ విమ‌ర్శించారు. ఎన్నిక‌ల్లో గొడ‌వ చేసేందుకు అఖిల ప్రియ వ‌ర్గం ప్ర‌య‌త్నిస్తే.. తామే సంయ‌మ‌నం పాటించామ‌నీ, ప్ర‌జాస్వామ్యంలో ఇలాంటి ధోర‌ణి త‌గ‌ద‌ని శిల్పా మోహ‌న్ రెడ్డి విమ‌ర్శించారు. ప్ర‌జ‌ల‌ను ప్ర‌లోభాల‌కు గురిచేసే ప్ర‌య‌త్నం చేశార‌ని మండిప‌డ్డారు. నంద్యాల ఉప ఎన్నిక అయిపోయింది క‌దా! ఫ‌లితాలు ఇంకా రావాల్సి ఉంది క‌దా. ప్ర‌జా తీర్పు ఏంట‌నేది ఇంకా బాక్సుల్లోనే ఉంది క‌దా. ఇలాంటి స‌మ‌యంలో కాస్త విశ్రాంతి తీసుకుంటే త‌ప్పేముంది..? కొన్నాళ్లు విమ‌ర్శ‌లు ఆపొచ్చు క‌దా. ఎవ‌రికివారు విజ‌యం సాధించేసిన‌ట్టు ఈ వ్యాఖ్య‌లేంటో వారికే తెలియాలి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com