హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత, సుమారు 40-50 కిలోమీటర్ల పరిధిలోని పెరి-అర్బన్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ముఖచిత్రం వేగంగా మారుతోంది. కేవలం ప్లాట్లు వేసి అమ్ముకోవడం అనే పాత పద్ధతి నుంచి, ఈ ప్రాంతాలు ఇప్పుడు స్వయం సమృద్ధి కలిగిన శాటిలైట్ నగరాలుగా రూపాంతరం చెందుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన 340 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు ఈ మార్పుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది.
ఇప్పటికే ఉత్తర భాగం ( కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసి, భూసేకరణ పనులను వేగవంతం చేయడంతో భువనగిరి, చౌటుప్పల్, సంగారెడ్డి వంటి ప్రాంతాల్లో భూముల ధరలు గత రెండేళ్లలో రెట్టింపు అయ్యాయి. కేవలం నివాస అవసరాలకే కాకుండా, ఈ ప్రాంతాలు ఇప్పుడు లాజిస్టిక్స్ , వేర్‌హౌసింగ్ హబ్‌లుగా అవతరిస్తున్నాయి. ఇ-కామర్స్ రంగం విస్తృతి, క్విక్ కామర్స్ పెరుగుదల వల్ల నగరానికి చేరువలో పెద్ద ఎత్తున గిడ్డంగుల అవసరం పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా ఇదే తరహా ట్రెండ్ కనిపిస్తోంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం, సుమారు రూ. 25,000 కోట్ల వ్యయంతో ఈ పనులు మొదలుకాబోతుండటంతో రాజధాని శివారు గ్రామాల్లో రియల్ ఎస్టేట్ జ్యోతి మళ్ళీ వెలిగింది. విజయవాడ-గుంటూరు పశ్చిమ బైపాస్ , అమరావతి వెలుపలి మండలాలు ఇప్పుడు ఇన్వెస్టర్ల హాట్స్పాట్లుగా మారాయి. అమరావతిని కేవలం పరిపాలనా నగరంగానే కాకుండా, క్వాంటం వ్యాలీ వంటి పారిశ్రామిక హబ్‌లతో కలిపి నిర్మిస్తుండటంతో చుట్టుపక్కల 50 కి.మీ. పరిధిలోని భూములకు భారీ డిమాండ్ ఏర్పడింది.
వచ్చే ఐదు నుండి పది ఏళ్లలో ఈ ప్రాంతాలు కేవలం నగరానికి శివార్లలా కాకుండా, స్వతంత్ర ఆర్థిక కేంద్రాలుగా ఎదగబోతున్నాయని అనుకోవచ్చు.
