దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో రెండేళ్లుగా సాగిన అడ్డూఅదుపూ లేని ధరల పెరుగుదలకు ఎట్టకేలకు బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. 2024లో రికార్డు స్థాయిలో 17 నుంచి 20 శాతం వరకు ఉన్న ప్రాపర్టీ ధరల వృద్ధి రేటు, 2025 చివరి నాటికి 6 నుంచి 8 శాతానికి పడిపోయాయని రికార్డులు చెబుతున్నాయి. ధరలు ఆకాశాన్ని తాకడంతో కొనుగోలుదారులు వేచి చూసే ధోరణి అవలంబించారు. ఫలితంగా విక్రయాలు సుమారు 14 శాతం వరకు తగ్గడం మార్కెట్‌ను స్థిరీకరణ వైపు నడిపిస్తోంది. ఇది సొంతింటి కల కంటున్న మధ్యతరగతి వర్గాలకు పెద్ద ఊరటనిచ్చే పరిణామం.
ధరలు తగ్గకపోయినా, గతంలోలాగా రాకెట్ వేగంతో పెరగకపోవడమే ఈ ఏడాది ప్రధాన మార్పు. నిపుణుల విశ్లేషణ ప్రకారం, 2026లో మార్కెట్ బబుల్ పేలిపోవడం కంటే, ఒక క్రమపద్ధతిలో స్థిరపడే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ-NCR వంటి నగరాల్లో అమ్ముడుపోని ఇళ్లు పెరగడం వల్ల బిల్డర్లు కొత్త ప్రాజెక్టుల లాంచింగ్‌లో వేగం తగ్గించి, ధరలను నియంత్రణలో ఉంచుతున్నారు. పైగా ఆర్బీఐ రెపో రేట్లను తగ్గించే అవకాశం ఉండటంతో, హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గి కొనుగోలు శక్తి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం మార్కెట్ ధోరణి లగ్జరీ ఇళ్ల నుంచి మళ్లీ మిడ్-సెగ్మెంట్ 50 లక్షల నుంచి 1.2 కోట్లు వైపు మళ్లుతోంది. డెవలపర్లు కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండే ధరల్లో ప్రాజెక్టులను ప్లాన్ చేస్తున్నారు. ఇన్వెస్టర్ల కంటే ఎక్కువగా సొంత అవసరాల కోసం ఇళ్లు కొనేవారు పెరగడం వల్ల మార్కెట్లో పారదర్శకత పెరుగుతోంది. అడ్డగోలుగా ధరలు పెంచితే కొనేవారు లేరనే వాస్తవాన్ని బిల్డర్లు గుర్తించడంతో, 2026లో ప్రాపర్టీ మార్కెట్ కొనుగోలుదారులకు అనుకూలంగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయని మార్గెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
