కియా మోటార్స్ ఆంధ్రాకు రావ‌డం వెన‌క క‌థ ఇదీ..!

ప‌నిగ‌ట్టుకుని అడ్డ‌గోలు ఆరోప‌ణ‌లు ఎన్నైనా చెయ్యొచ్చు. అధికారంలో ఉన్నవారు చేసే ప్ర‌తీ ప‌ని వెన‌కా ఏదో వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నం ఉంద‌ని చూసే హ్రస్వ‌దృష్టికి క‌నిపించ‌ని వాస్త‌వాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఈ ఉదాహ‌ర‌ణ‌. కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ ఆంధ్రాలో ఉత్ప‌త్తి కేంద్రాన్ని నెల‌కొల్ప‌నున్న సంగ‌తి తెలిసిందే. నిన్న‌నే.. కియో మోటార్స్ అధినేత‌, ఇత‌ర ప్ర‌తినిధులు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుని క‌లిశారు. అనంత‌పురం జిల్లాలో ఈనెల 22న జ‌ర‌గ‌బోయే ఫ్రేమ్ వర్క్స్ పనుల ప్రారంభోత్సవానికి సీఎంని సాదరంగా ఆహ్వానించారు. ఇదే విష‌యాన్ని వెల్లడిస్తూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఓ ట్వీట్ కూడా చేశారు. నిజానికి, ఈ సంస్థ ఆంధ్రాకు రావ‌డం వెన‌కున్న ఒకే ఒక్క కార‌ణం… ఏపీలో చంద్ర‌బాబు అందిస్తున్న సుప‌రిపాల‌న‌.

ఈ కొరియ‌న్ సంస్థ మొద‌ట త‌మిళ‌నాడులో ప‌రిశ్ర‌మ‌ ఏర్పాటు చేయాల‌ని ప్ర‌య‌త్నించింది. అక్క‌డి రాష్ట్ర ప్ర‌భుత్వంతో మంత‌నాలు జ‌రిపింది. అప్ప‌టికే ఓ ప్ర‌క‌ట‌న కూడా చేసేసింది. కానీ, చివ‌రి నిమిషంలో కియా సంస్థ నిర్ణ‌యాన్ని మార్చుకుంది. త‌మిళ‌నాడు నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని అనంత‌పురానికి త‌మ ప‌రిశ్ర‌మ వెళ్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీనికి వారు చూపిన ఒకే ఒక్క కార‌ణం… ‘సంస్థ‌కు అవ‌స‌ర‌మైన భూమి ధ‌ర కంటే, అక్క‌డి రాజ‌కీయ నాయ‌కులు అడుగుతున్న లంచాలు యాభై శాతం ఎక్కువ‌గా ఉన్నాయని’! పరిశ్ర‌మ ఏర్పాటుకు కావాల్సిన రోడ్లు, నీటి సౌక‌ర్యం, మురుగునీటి పారుద‌ల వ్య‌వ‌స్థ‌, ప్రభుత్వ శాఖల నుంచి త్వ‌రితగ‌తిన అనుమ‌తులు ఇవ్వాలంటూ త‌మిళ‌నాడు నేత‌ల్ని కోరితే… వారు అడిగిన లంచాలకు కియా సంస్థ ఖంగుతినాల్సి వ‌చ్చింది. నిజానికి, భార‌త్ లో ఈ సంస్థ ఏర్పాటు చేయాల‌నుకున్న‌ప్పుడు దేశ‌వ్యాప్తంగా వారు ఒక అధ్య‌యం చేశార‌ట‌. దాని ప్ర‌కారం త‌మిళ‌నాడులో త‌మ‌కు అనువైన ప‌రిస్థితులు ఉన్నాయ‌ని వారు గుర్తించారు. ఆ త‌రువాత‌ గుజ‌రాత్‌, మూడో ఛాయిస్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని శ్రీ సిటీ వారి జాబితాలో ఉన్నవి.

అయితే, రెండోదిగా ఉన్న గుజ‌రాత్ ను కాద‌ని, ఆంధ్రాకు రావ‌డం వెన‌క ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌య‌త్నం చాలా ఉంద‌నేది ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన ప‌నిలేదు. ఈ సంస్థ అనంత‌పురానికి రావ‌డం వెన‌క ఆంధ్రా సీయీవోగా చంద్ర‌బాబు ప్రయత్నాన్ని, పరిశ్రమలకు అనువైన ప్రాంతంగా ఆంధ్రాని ఆయన ప్రొజెక్ట్ చేస్తున్న విధానాన్ని మెచ్చుకుంటూ అప్ప‌ట్లో జాతీయ మీడియాలో కొన్ని క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి. ప‌రిశ్ర‌మ‌లు రావాలంటే అనువైన వాతావ‌ర‌ణం ఒక్క‌టే ఉంటే స‌రిపోదు, పాల‌కుల చిత్త‌శుద్ధి కూడా కొల‌మాన‌మే అవుతుంది. పాల‌న అవినీతిమ‌యం అయితే , వచ్చిన ప్రాజెక్టులు కూడా ఎలా వెనక్కి పోతాయ‌నేదానికి ప‌క్క రాష్ట్రం త‌మిళ‌నాడే ఉదాహ‌ర‌ణ‌. ఒక సంస్థ రాష్ట్రానికి వ‌చ్చి, ప‌రిశ్ర‌మ‌ స్థాపించాల‌నుకుంటే… నాయ‌కుల ప‌నితీరును ప‌రిశీలించాకే సదరు సంస్థలు వ‌స్తాయ‌న్న‌ది వాస్త‌వం. కియా మోటార్స్ విష‌యంలో జ‌రిగింది ఇదే. ఎన్ని రాయితీలు ఇచ్చినా, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ప్రకటించినా, పాలనలో అవినీతి కనిపిస్తే అభివ్రుద్ధికి ఆస్కారం ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.