భాజ‌పా ఎంపీలు దీక్ష‌లు చేస్తార‌ట.. ఎందుకో తెలుసా..?

క‌రెక్టేనండీ… భాజ‌పా దీక్ష‌లు దిగ‌బోతోంది..! అదేంటీ, అవిశ్వాస తీర్మానాన్ని భాజ‌పా స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌క‌పోతే టీడీపీ నేత‌లు దీక్ష‌కు దిగాలి, లేదంటే ఇత‌ర విప‌క్షాలు దీక్ష‌లు చెయ్యాలి. చేసిందంతా వారే చేసేసి.. ఇప్పుడు దీక్ష‌లు కూడా వారే చేస్తామ‌న‌డ‌మేంటీ..? దొంగా దొంగా అని దొంగే అరిచిన‌ట్టు లేదూ..! మీరేదైనా అనుకోండి.. వారు దీక్ష‌లు చేస్తారు, ఇది ఫిక్స్‌! పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రి అనంత‌కుమార్ ఒక ప్రెస్ మీట్ పెట్టి.. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నార‌ని ప్ర‌క‌టించారు. ఈ నెల 12 నుంచి భాజ‌పా ఎంపీలంద‌రూ నిరాహార దీక్ష‌లు చేయాల‌ని ప్ర‌ధాని నిర్ణ‌యించిన‌ట్టు చెప్పారు! ఎందుక‌య్యా అంటే… పార్ల‌మెంటులో ఏర్ప‌డిన ప్ర‌తిష్టంభ‌న‌కు నిర‌స‌న‌గా ఈ దీక్ష‌లు చేప‌డుతున్నార‌న్నారు. పార్ల‌మెంటు స‌మావేశాలు స‌జావుగా జ‌ర‌క్కుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుప‌డింద‌ని ప్ర‌ధాని అభిప్రాయ‌ప‌డ్డారని చెప్పారు..!

విప‌క్షాల‌న్నీ విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్నాయ‌నీ, భాజ‌పా మాత్ర‌మే అంద‌రినీ క‌లుపుకుని వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ తీరుకు నిర‌స‌న‌గా భాజ‌పా పార్ల‌మెంటు స‌భ్యులు నిరాహార దీక్ష‌లు చేసి, ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాల‌ను తెలియ‌జేయాల‌ని న‌రేంద్ర మోడీ ఆదేశించారు. ఇదేం దారుణ‌మండీ.. మ‌ధ్య‌లో కాంగ్రెస్ ఏం చేసిందీ..? ఆ పార్టీ మీద నింద వేయ‌డం ఎందుకు..? స‌భా కార్య‌క్ర‌మాలు స‌జావుగా జ‌ర‌గ‌నీయ‌కుండా అడ్డుప‌డిన పార్టీలేవీ… అన్నాడీఎంకే, తెరాస‌ క‌దా! ప్ర‌తీరోజూ వీళ్లే క‌దా స్పీక‌ర్ పోడియం ముందు ప్ల‌కార్డులు ప‌ట్టుకుని నిన‌దించింది. వీళ్ల వ‌ల్లనే క‌దా… స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ కి స‌భ‌లో ఏం జ‌రుగుతోందో అర్థం కాకుండాపోయింది..! అవిశ్వాసానికి అనుకూలంగా ఎంత‌మంది ఎంపీలు చేతులు ఎత్తుతున్నారో కూడా పాపం ఆమె లెక్కించ‌లేక‌పోయారు. స‌మావేశాలు మొద‌లైన ద‌గ్గ‌ర నుంచీ స‌భ‌ను ఆర్డ‌ర్ లో ఉంచేందుకు పాపం ఆమె ఎంతో శ్ర‌మించారో..! దీనికి కార‌ణం ఎవ‌రు.. అన్నాడీఎంకే, తెరాస‌లు క‌దా! మ‌ధ్య‌లో కాంగ్రెస్ ఏం చేసింది..?

అన్నాడీఎంకే, తెరాస‌లు మోడీ డైరెక్ష‌న్ లో త‌మ‌కు ఇచ్చిన పాత్ర‌ల్ని బ్ర‌హ్మాండంగా పోషించాయి. స‌భ ఆర్డ‌ర్ లోకి వ‌స్తే, అవిశ్వాసంపై చ‌ర్చించాలేమో అని భ‌య‌ప‌డింది భాజ‌పా. స‌భ‌లో ప్ర‌తిష్టంభ‌న‌కు ముమ్మూర్తులా కార‌ణం భాజపా. అలాంట‌ప్పుడు, వారి చేత‌గానిత‌నాన్ని ఇంకొక‌రిపై నెట్టేస్తే ఎలా..? స‌భ‌లో చేయాల్సింది చేయ‌డం మానేసి.. ఇప్పుడు వాయిదాప‌డ్డాక దీక్ష‌లకు దిగుతాం అంటే ప్ర‌జ‌లు న‌వ్విపోరూ..! అధికార పార్టీ తీరుకు నిర‌స‌న‌గా విప‌క్షాలు దీక్ష‌కు దిగితే అర్థం ఉంటుంది. అంతేగానీ, స‌ర్వాంత‌ర్యామి పాత్ర‌లో ఉన్న భాజ‌పా నేత‌లే దీక్ష చేస్తామంటే… త‌మ వైఫ‌ల్యాన్ని మ‌రింత గ‌ట్టిగా ప్ర‌జ‌ల‌కు చాటిచెప్పుకున‌ట్టే అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.