‘సాక్షి’ అవార్డులకు చిరంజీవి ఎందుకు రాలేదో?

తెలుగు ప్రజలకు వైకాపా అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో బాణి-వాణి వినిపించే ప్రచార మాధ్యమాలు ‘సాక్షి’ దినపత్రిక, టీవీ. రాజకీయంగా జగన్ ఎజెండాలకు ప్రచారం కల్పించడమే ధ్యేయంగా ‘సాక్షి’ పత్రిక గానీ, టీవీ గానీ పనిచేస్తుంటాయి. అందులో ఉద్యోగులు ప్రతిరోజూ స్వామిభక్తి చాటుకుంటారు. సినిమాల విషయానికి వచ్చేసరికి అందరితో కలుపుగోలుగా ముందుకు వెళ్తుంటారు. ఒక్క ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో తప్ప. ‘అరవింద సమేత వీరరాఘవ’ ప్రారంభోత్సవంతో పాటు కొన్ని కార్యక్రమాలకు ప‌వ‌ర్‌స్టార్‌ ముఖ్య అతిథిగా హాజరైతే కనీసం ఆయన ఫొటో కూడా వేయలేదు. రాజకీయంగా జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి వ్యతిరేకంగా పవన్ ముందుకు వెళ్తున్నందున అతడిని పక్కన పెట్టారని ప్రజలకు అర్థమైంది. ఇటీవల ప‌వ‌న్‌క‌ల్యాణ్ పెళ్లిళ్ల మీద, అతడి వ్యక్తిగత జీవితం మీద జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తీవ్రంగా విరుచుకుపడిన వైనాన్నీ తెలుగు ప్రజలు చూశారు. ఇవన్నీ చిరంజీవి సృష్టిలో పెట్టుకున్నారో? మరొకటో? ‘సాక్షి’ అవార్డుల వేడుకకి దూరంగా వున్నారు.

తమ్ముడిని ఎప్పటికప్పుడు తక్కువ చేస్తూ వచ్చిన ‘సాక్షి’ యాజమాన్యం అన్నయ్యను మాత్రం సముచితంగా సత్కరించింది. కొన్నేళ్లుగా వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన వ్యక్తులను ‘సాక్షి’ గౌరవిస్తూ వస్తోంది. ‘సాక్షి ఎక్స్‌లెన్స్‌’ అవార్డులను అందజేస్తుంది. అందులో భాగంగా సినిమా వాళ్లకూ అవార్డులు ఇస్తున్నారు. 2017 సంవత్సరంలో ‘ఖైదీ నంబర్ 150’ చిత్రానికి గాను చిరంజీవికి ‘మోస్ట్ పాపులర్ యాక్టర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ఇచ్చారు. అయితే చిరంజీవి అవార్డు అందుకోవడానికి రాలేదు. గతేడాది ‘సాక్షి’ అవార్డులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతలకు పురస్కారాలు అందజేసి ‘సాక్షి’ సంస్థలను అభినందించారు. ఏడాది తిరిగేసరికి పరిస్థితిలో మార్పు వచ్చింది. స్వయంగా ఆయనకు అవార్డు వచ్చినా అందుకోవడానికి రాలేదు. వేడుకకి దూరంగా వున్నారు.

తెలుగు చిత్రపరిశ్రమలో చిరంజీవి అజాతశత్రువు, అందరివాడు. అందరితో కలుపుగోలుగా వుంటారు. ముఖ్యంగా మీడియాతో. నటీనటులకు పురస్కారాలు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయని చెప్పే చిరంజీవి గైర్హాజరుకి కావడం చర్చనీయాంశమే. తమ్ముడిపై ‘సాక్షి’ పక్షపాత ధోరణి నచ్చలేదో? లేదా తమ్ముడిపై జగన్ చేసిన విమర్శలను దృష్టిలో పెట్టుకున్నారో? దూరం పాటించారు. ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రీకరణ నిమిత్తం చిరంజీవి భాగ్యనగరంలోనే వున్నారు. ఇటీవల పలు సినిమా కార్యక్రమాలకు హాజరయ్యారు. ‘సాక్షి ఎక్స్‌లెన్స్‌’ అవార్డుల వేడుకకి రావాలనుకుంటే పెద్ద విషయం కాదు. కానీ, ఎందుకు రాలేదో మరి? ఆ పరమేశ్వరుడికే తెలియాలి.

చివరగా… కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేనని వైఎస్ జగన్ ఖరాఖండిగా చెప్పినప్పటి నుంచి, పవన్ మీద వ్యక్తిగత విమర్శలు చేసినప్పటి నుంచి డ్యామేజ్ కంట్రోల్‌కి ‘సాక్షి’ చేయని ప్రయత్నాలు లేవు. కానీ, ఏవీ సత్ఫాలితాలను ఇస్తున్నట్టు కనిపించడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.