జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత భారీ బహిరంగ సభను నిర్వహిస్తుండగా, పార్టీలో అత్యంత కీలక నేతగా పేరున్న హరీష్ రావు గైర్హాజరు కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. హరీష్ రావుతో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్ కుమార్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లడం వెనుక రాజకీయ చీలిక ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మామూలు సమయాల్లో ఈ పర్యటన ఇంత చర్చనీయాంశం అయ్యేది కాదు కానీ, కేసీఆర్ రీ-లాంచ్ సభ రోజే వారు అందుబాటులో లేకపోవడం వల్లే ఎక్కుగా చర్చ జరుగుతోంది.
బీజేపీతో చర్చలు జరుపుతున్నారని కాంగ్రెస్ ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాన్ని అస్త్రంగా చేసుకుని బీఆర్ఎస్లో ముసలం మొదలైందని ప్రచారం చేస్తోంది. మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి పార్టీలో చేరుతుండటాన్ని హరీష్ రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ఆ అసంతృప్తితోనే సభకు దూరంగా ఉండి ఢిల్లీకి వెళ్లారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. హరీష్ రావు బీజేపీ అగ్రనేతలతో మంతనాలు జరుపుతున్నారంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని మరింత పెంచాయి. పార్టీలో తన ప్రాధాన్యత తగ్గుతోందన్న భావనలో హరీష్ రావు ఉన్నట్లు కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతూనే ఉంది.
కేసీఆరే ఢిల్లీకి పంపారంటున్న బీఆర్ఎస్
బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నాయి. కేసీఆర్ ఆదేశాల మేరకే ఈ త్రిసభ్య కమిటీ ఢిల్లీకి వెళ్లిందని, ఏప్రిల్ 22న కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు వెలువడనున్న తరుణం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో చర్చించేందుకే ఈ పర్యటన అని స్పష్టం చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో కూడా న్యాయపరమైన సలహాల కోసం వారు అక్కడే ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ కేసీఆర్ సభ లాంటి కీలకమైన పార్టీ కార్యక్రమాన్ని వదిలి వెళ్లాల్సినంత అత్యవసర న్యాయ చర్చలు ఏమున్నాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
కేసీఆర్ పంపితే.. హరీష్ రావు రాక ఆయనకు ఇష్టం లేనట్లే !
ఇక్కడ రెండు కోణాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ కేసీఆరే వారిని ఢిల్లీకి పంపించి ఉంటే, తన సభకు హరీష్ రావు లాంటి క్రౌడ్ పుల్లర్ అవసరం లేదని కేసీఆర్ భావించి ఉండాలి, లేదా పార్టీలో ప్రాధాన్యతలపై స్పష్టమైన సంకేతం ఇచ్చి ఉండాలి. ఒకవేళ హరీష్ రావు స్వయంగా ఈ సమయాన్ని ఎంచుకుని ఉంటే, అది పార్టీ నాయకత్వంతో ఆయనకు ఉన్న గ్యాప్‌ను బహిర్గతం చేసినట్లే అవుతుంది. ఏది ఏమైనా, జగిత్యాల సభ సాగుతున్న వేళ హరీష్ రావు ఢిల్లీలో ఉండటం అనేది యాదృచ్ఛికం కాదని, ఇది బీఆర్ఎస్ భవిష్యత్తు రాజకీయాల్లో ఒక కీలక మలుపునకు సంకేతమని అర్థమవుతోంది.
