దేశంలో ఇప్పుడు వీధి కుక్కలపై అనేక డిబేట్లు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు నిర్ణయాలను కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఈ జాబితాలోకి మాజీ నటి రేణుదేశాయ్, యాంకర్ రష్మిగౌతమ్ చేశారు. హైదరాబాద్ లో ప్రెస్మీట్ నిర్వహించి కుక్కల కోసం ఆవేశపడ్డారు. ఐదు కుక్కలు కరిస్తే మిగతా కుక్కలన్నింటినీ చంపేస్తారా అని రేణుదేశాయ్ మండిపడ్డారు. మగాళ్లు రేప్ చేస్తారు మగాళ్లే మర్డర్లు కూడా చేస్తారు అంతమాత్రాన మగాళ్లందర్నీ రేపిస్టులు, హంతకులు అంటామా? రేపులు, మర్డర్లు చేసిన మగాళ్లందర్నీ పట్టుకుని చంపేయాలా? బుద్ది ఉందా కొంచెమైనా? అని విరుచుకుపడ్డారు.
చిన్న పిల్లలపై కుక్కలు దాడి చేస్తున్న సంఘటనలు తనను కూడా కలిచి వేస్తున్నాయని అయితే వాటిని చంపడానికి బదులు ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలన్నారు. ఎక్కడైనా కుక్కలు పిల్లలకు హాని చేస్తున్నాయని భావిస్తే, ఆ ప్రాంతాల వివరాలను తమకు తెలియజేయాలని కోరారు. అలాంటి కుక్కల బాధ్యత తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రతిరోజూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, మరి ఆ కారణంతో ప్రభుత్వం మద్యం దుకాణాలను మూసివేస్తుందా అని నిలదీశారు. మనుషులు చేసే తప్పులకు లేని కఠిన నియమాలు, కేవలం మూగజీవాల విషయంలోనే ఎందుకు అమలు చేస్తున్నారని ఆమె ఘాటుగా ప్రశ్నించారు.
యాంకర్ రష్మీ గౌతమ్ కూడా గట్టిగా మాట్లాడారు. మనకు అవసరం లేదనో లేదా ఇబ్బంది కలిగిస్తున్నాయనో పావురాలను, కుక్కలను చంపేసుకుంటూ పోతే.. రేపు పొద్దున వృద్ధాప్యంలో ఉండి భారంగా మారే తల్లిదండ్రులను కూడా ఇలాగే చంపేస్తారా? అని ఆమె ప్రశ్నించారు. మూగజీవాల పట్ల కనీసం మానవత్వం ప్రదర్శించాలని, వాటి సంతతిని నియంత్రించే శాస్త్రీయ పద్ధతులు పాటించాలే తప్ప ప్రాణాలు తీయడం పరిష్కారం కాదని రష్మీ స్పష్టం చేశారు.
ఈ ప్రెస్ మీట్ సందర్బంగా ఒక జర్నలిస్టు రేణు దేశాయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్న వేయడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కుక్కల సమస్యపై మాట్లాడుతుంటే వ్యక్తిగత విషయాలను లాగడంపై రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ మేము ఒక సామాజిక సమస్యపై చర్చిస్తుంటే వ్యక్తిగత దాడులకు దిగడం మీ సంస్కారమా అని ఆమె సదరు జర్నలిస్టుపై మండిపడ్డారు.


