తల్లిదండ్రులను పట్టించుకోకుంటే ఉద్యోగుతల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల జీతాల్లో కోత విధించేలా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్లును తీసుకు వస్తోంది. తల్లిదండ్రులను చూడటం లేదన్న ఫిర్యాదులు ఎక్కువగా వస్తూండటంతో ప్రభుత్వం ఈ బిల్లు తెస్తోంది. ఈ బిల్లు ప్రకారం తల్లిదండ్రులు.. తమ పిల్లలు చూడటం లేదని ఫిర్యాదు చేస్తే వారి జీతాల్లో నుంచి పదిహేను శాతం తల్లిదండ్రుల ఖాతాలకు జమ చేస్తారు.
నిర్లక్ష్యాన్ని ఎలా నిర్ధారిస్తారు?
పిల్లలు తమను పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు భావిస్తే, వారు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. తల్లిదండ్రులకు సరైన భోజనం, బట్టలు, నివాసం వంటి కనీస అవసరాలు కల్పించకపోవడం. అనారోగ్య సమయంలో వైద్య ఖర్చులు భరించకపోవడం లేదా చికిత్స చేయించకపోవడం, తమతో పాటు ఉంచుకోకుండా వదిలివేయడం లేదా వేధింపులకు గురిచేయడం వంటి వాటిని నిరాదరణకు గురి చేసినట్లుగా భావిస్తున్నాయి. ఒకవేళ తల్లిదండ్రులకు సొంతంగా పెన్షన్, అద్దెలు లేదా ఇతర ఆదాయ మార్గాలు ఉంటే ఈ నిబంధనలు వర్తించకపోవచ్చు. పూర్తిస్థాయిలో పిల్లలపై ఆధారపడి ఉండి, వారు సహకరించని పక్షంలోనే ఈ కోత విధిస్తారు.
సామాజిక బాధ్యతను గుర్తు చేసే ప్రయత్నం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ బిల్లు సామాజిక బాధ్యతను గుర్తుచేసే ఒక విప్లవాత్మక అడుగు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, ముఖ్యంగా పట్టణీకరణ పెరిగాక, వృద్ధ తల్లిదండ్రులను భారంగా భావించే ధోరణి పెరుగుతోంది. కన్నవారి త్యాగాలను మర్చిపోయి వారిని వదిలేస్తున్న పిల్లలకు ఈ చట్టం ఒక గట్టి హెచ్చరిక. ఇలాంటి చట్టం గతంలో అస్సాం వంటి రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం దీనిని మరింత పటిష్టంగా 15 శాతం జీతం కోత లేదా గరిష్టంగా రూ. 10,000 వరకు పరిమితితో తీసుకువస్తోంది.
ప్రైవేటు ఉద్యోగుకూ వర్తిస్తుంది!
ఈ బిల్లు పరిధి కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే పరిమితం కాకుండా, ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు , ప్రజా ప్రతినిధులకుకూడా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేయడం గమనార్హం. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులపై మాత్రమే ఇలాంటి ఆంక్షలు ఉంటాయి, కానీ సమాజంలోని అన్ని వర్గాల్లోని వృద్ధులకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విస్తృత నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రైవేటు సంస్థల్లో పనిచేసే లక్షలాది మంది తల్లిదండ్రులకు కూడా ఆర్థిక భరోసా లభిస్తుంది.
ఆర్ధిక కోణం నుంచి చూస్తే, కోత విధించిన మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ఈ బిల్లులోని గొప్ప అంశం. దీనివల్ల వృద్ధులు కోర్టుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఫిర్యాదు అందిన తర్వాత అధికారులు విచారణ జరిపి, నిర్లక్ష్యం నిజమేనని తేలితే వెంటనే ఈ నిబంధన అమలులోకి వస్తుంది. ఒకవేళ ఒకే తల్లిదండ్రులకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండి, వారంతా ఉద్యోగులైతే.. ఆ కోత మొత్తాన్ని అందరి జీతాల నుంచి సమానంగా వసూలు చేస్తారు.
పటిష్టంగా అమలు చేయాలి!
చి ఇది కేవలం ఒక శిక్షగా కాకుండా, బాధ్యత గా చూడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల కుటుంబ వ్యవస్థపై గౌరవం పెరుగుతుంది. తల్లిదండ్రుల పట్ల కనీస కనికరం లేని వారికి చట్టం ద్వారా బుద్ధి చెప్పడం ఒక మంచి ప్రయత్నం. ఇది దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తుందని భావిస్తున్నారు.


