తెలంగాణలో జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు రేవంత్ రెడ్డి ఆరు నెలల గడువు ఇచ్చారు. ఈ లోపు మంచి పనితీరు చూపించకపోతే ప్రత్యామ్నాయంగా మరో నేతను చూసుకుంటానని ముఖం మీదనే చెప్పారు. డీసీసీ అధ్యక్షులందరితో గాంధీభవన్ లో సమావేశమయ్యారు. రాజకీయంగా ఎదగాలంటే.. డీసీసీ పదవిలో ప్రతిభను చూపితే .. అవకాశాలు అవే వస్తాయని వారికి చెప్పారు.వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సలహా ఇచ్చారు.
కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా రేవంత్ విధానాన్ని స్పందించారు. గుజరాత్ లో అయితే డీసీసీ అధ్యక్షులకు మూడు నెలల గడువు ఇచ్చామని తెలంగాణలో ఆరు నెలలు ఇస్తున్నాం కాబట్టి.. తేడా చూపించి పార్టీని బలోపేతం చేయాలన్నారు. అసలు మంచి పనితీరు అంటే ఏమిటి.. ఎవరు లెక్కలేస్తారు అన్నదానిపైనా పార్టీ క్లారిటీ ఇచ్చింది. ఏఐసీసీ అబ్జర్వర్లు ఉంటారని అంటున్నారు. అయితే అబ్జర్వర్ను సంతృప్తి పరిస్తే బాగా పని చేసినట్లేనని కొంత మంది అనుకుంటారు. కానీ అలాంటి పరిస్థితి ఉండదని పార్టీకోసం చేసే పనితీరే ముఖ్యమని అంటున్నారు.
డీసీసీ అధ్యక్షుల్లో ఎక్కువ మంది రేవంత్ రెడ్డి సిఫారసు చేసిన వాళ్లే ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.సామాజిక సమీకరణాలు, పదవులు రాకపోవడం వంటి కారణాలతో తన వర్గానికి పెద్ద పీట వేసుకునేలా చేశారని అంటున్నారు. ఈ క్రమంలో ఆయన హెచ్చరికలు ఇచ్చినా.. రేవంత్ సూచనలు మేరకే పని చేస్తారు. పని చేసినా చేయకపోయినా ఆయనే పదవుల్ని కాపాడతారని వారనుకుంటారు.