రాజకీయాలు అంటే మైండ్ గేమ్. ఎవరు ఎక్కువగా మైండ్ గేమ్ ఆడతారో వారిదే ఎక్కువగా పైచేయి అవుతుంది. ఈ మైండ్ గేమ్ ను అర్థం చేసుకోలేక ఫ్రస్ట్రేషన్ కు గురైతే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అదే జరుగుతోంది. విజయాలతో కూల్ గా ఉన్న రేవంత్.. మైండ్ గేమ్ గట్టిగా ఆడుతున్నారు. దీన్ని కేటీఆర్, హరీష్ రావు తట్టుకోలేకపోతున్నారు. ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నారు. ఈ పరిస్థితిని కాంగ్రెస్ మరింత అనుకూలంగా మల్చుకుంటోంది.
బీఆర్ఎస్లో మరిన్ని సమస్యలు సృష్టించేలా రేవంత్ వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందించడానికి ప్రెస్‌మీట్ పెట్టారు. మెజార్టీ సీట్లు సాధించారు కాబట్టి ఆయన చాలా కూల్ గా మాట్లాడారు. రాజకీయంగా బీఆర్ఎస్ పై ఎలాంటి విమర్శలు చేయాలో అలాంటివి చేశారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బీఆర్ఎస్ ఒక్క ఎన్నికలోనూ గెలవలేదని అన్నారు. అదే సమయంలో హరీష్ రావు పార్టీ నాయకత్వాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. వెంటనే హరీష్ రావు కంగారుగా స్పందించారు. కేటీఆర్‌కు తనకు మధ్య మిత్రభేదం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎప్పటికీ తన గుండెల్లో కేసీఆర్, గులాబీ జెండా ఉంటాయని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే కవిత హరీష్ రావును టార్గెట్ చేస్తున్నారు. హరీష్ పై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో హరీష్ ఒత్తిడికి గురవుతున్నారు.
ఫ్రస్ట్రేషన్ కు గురై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కేటీఆర్
పంచాయతీ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చాయని చెప్పుకుంటున్న బీఆర్ఎస్లో ఏ మూల కూడా ఆ జోష్ కనిపించడం లేదు. కేటీఆర్ పదే పదే ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారు . కేసీఆర్ కంటే పెద్ద వయసు ఉన్న పోచారంను పట్టుకుని చనిపోవడమే మేలని వ్యాఖ్యానించారు. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపైనా అదే విధంగా నోరు పారేసుకుంటున్నారు. బీఆర్ఎస్ వైపు నుంచి అంతా క్లీన్ గా ఉండి అలా మాట్లాడినా ఓ అర్తం ఉంటుంది కానీ.. పదేళ్ల పాటు ఏ పార్టీని వదలకుండా.. చివరికి కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేలను కూడా చేర్చుకున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన అలా మాట్లాడటం మాత్రం అభ్యంతరకరంగానే ఉంటుంది. పంచాయతీలు గెలిచామని కాంగ్రెస్ కు ప్రజలు షాకిచ్చారని ప్రచారం చేస్తున్నప్పుడు దానికి తగ్గ రాజకీయాలు చేయాలి. కానీ రేవంత్ రాజకీయ వ్యూహాల్లో చిక్కుకుని ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారు.
రేవంత్ ను ఎదుర్కోవాలంటే కేసీఆర్ రావాల్సిందేనా?
ప్రస్తుత పరిస్థితి చూస్తూంటే రేవంత్ రెడ్డిని ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ తంటాలు పడుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. సిరిసిల్లలో ఆయన మెజార్టీ పంచాయతీలను కోల్పోయారు. కానీ హరీష్ రావు మాత్రం మెజార్టీ పంచాయతీలను సిద్ధిపేటలో గెల్చారు. గజ్వేల్ లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డిని ఎదుర్కొనేందుకు కేసీఆర్ రావాల్సిందేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. 21వ తేదీన పార్టీ ఎల్పీ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం తర్వాత కేసీఆర్ ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారా మళ్లీ ఫామ్ హౌస్ కు వెళ్లిపోతారా అన్నది క్లారిటీ వస్తుంది. కేడర్ మాత్రం కేసీఆర్ రావాలని.. అప్పుడే రేవంత్ కు కౌంటర్ ఇవ్వగలుగుతామని అనుకుంటున్నారు.
