మహిళా రిజర్వేషన్ల బిల్లు ముసుగులో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన చేస్తున్ారని దాన్ని తాము అంగీకరించబోమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి యాభై శాతం ఫార్ములాతో నియోజకవర్గాల పునర్విభజన చేపడుతున్నారని ఇది దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసినట్లేనని స్పష్టం చేశారు. ఈ విధానాన్ని అంగీకరించబోమని దక్షిణాది రాష్ట్రాలు చెప్పాయన్నారు.
డీలిమిటేషన్ తో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ల బిల్లు తేవాలని దానికి తమ మద్దతు ఉంటుందన్నారు. ఇప్పుడు ఉన్న సీట్లలోనే మహిళలకు సీట్లు కేటాయించాలన్నారు. గతంలో బల్లు పాస్ చేసినప్పుడు డీలిమిటేషన్ తో లింక్ పెట్టకుండా గత ఎన్నికల్లోనే అమలు చేయాల్సి ఉందన్నారు. చిన్న రాష్ట్రాలకూ ఈ విధానం వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.
జనాభా నియంత్రణ పాటించి అభివృద్ధి పథంలో నడుస్తున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గడం వల్ల దేశ సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కేవలం జనాభా నిష్పత్తిని మాత్రమే ప్రామాణికంగా తీసుకోకుండా, అందరికీ ఆమోదయోగ్యమైన ప్రత్యామ్నాయ నమూనాలను పరిశీలించాలని ఆయన సూచించారు. దేశ ప్రయోజనాలు పార్టీ ప్రయోజనాల కంటే మిన్న అని, ఏకపక్ష నిర్ణయాలు కాకుండా జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం సాధించాలని కోరారు.
ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలకు భారీగా సీట్లు పెరిగి, దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గితే అది దీర్ఘకాలంలో దేశ సమగ్రతకు ముప్పుగా మారుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. లోక్సభలో ప్రస్తుతమున్న ప్రాంతీయ సమతుల్యతను కాపాడుతూనే మార్పులు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, అన్ని రాష్ట్రాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ముందడుగు వేయాలని ప్రధానిని కోరారు.
