సీఎం రేవంత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును తాము వస్తే రద్దు చేస్తామని బీఆర్ఎస్ అంటోంది. అదసలు ఫ్యూచర్ సిటీ కాదని.. ఫార్మా సిటీ అని అంటున్నారు. ఈ ఫార్మా సిటీ వర్సెస్ ఫ్యూచర్ సిటీ వివాదం పెద్దది కాకుండా .. ఇన్వెస్టర్లకు నమ్మకం పెరిగేలా రేవంత్ మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. రికార్డుల పరంగా ఇప్పటికీ అది ఫార్మా సిటీ గానే ఉండటాన్ని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుండగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి చట్టపరమైన సవరణలతో గట్టి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
ఫార్మా సిటీ కోసమే వాడాలంటున్న హరీష్ రావు
ఈ వివాదానికి ప్రధాన కారణం గత నెలలో అమెరికా పర్యటనలో సీనియర్ నేత హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలే. తాము మళ్లీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ తెచ్చిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేసి, అక్కడ మళ్లీ పాత గ్రీన్ ఫార్మా సిటీ నే పునరుద్ధరిస్తామని వారు బహిరంగంగా ప్రకటించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఏ అవసరం కోసం అయితే రైతుల నుంచి భూములు సేకరించారో, అదే అవసరానికి వాడాలని, లేదంటే ఆ భూములను తిరిగి రైతులకు ఇచ్చేయాలని వారు వాదిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా సిటీని కాదని, ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
ఫ్యూచర్ సిటీకి చట్టపరమైన రక్షణ
బీఆర్ఎస్ చేసిన ఈ రద్దు వ్యాఖ్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత తీవ్రంగా పరిగణించారు. ప్రభుత్వం మారితే ప్రాజెక్టులు రద్దవుతాయనే ప్రచారం సాగితే.. అంతర్జాతీయ పెట్టుబడిదారులు వెనకడుగు వేసే ప్రమాదం ఉందని, అది రాష్ట్ర పారిశ్రామిక వృద్ధిని దెబ్బతీస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో ఏఐ సిటీ , స్కిల్స్ యూనివర్సిటీ, డేటా సిటీ వంటి మెగా ప్రాజెక్టుల కోసం ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇలాంటి తరుణంలో ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని, భరోసాను నింపడానికి కేవలం మాటలతో సరిపెట్టకుండా, శాశ్వత చట్టపరమైన రక్షణ కల్పించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
చట్టంలో మార్పు
ఇందుకోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. గతంలో ఫార్మా సిటీ కోసం జారీ చేసిన జీవోలు, నోటిఫికేషన్లలో ఫార్మా సిటీ అనే పదానికి బదులుగాఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ హబ్ గా మారుస్తూ చట్ట సవరణ చేయబోతున్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని మరింత చట్టబద్ధం చేస్తూ మార్పులు చేయనున్నారు. ఈ చట్ట సవరణ ద్వారా భూసేకరణ నిబంధనల సాంకేతిక సమస్యల నుంచి ప్రాజెక్టుకు పూర్తి రక్షణ లభిస్తుంది.
ఫార్మా సిటీని తాము పూర్తిగా రద్దు చేయలేదని, కేవలం కాలుష్య కారక పరిశ్రమలను నివాస ప్రాంతాలకు దూరంగా ఉంచి, ఇక్కడ గ్రీన్ ఫార్మా క్లస్టర్ తో పాటు ఆధునిక సాంకేతిక నగరంగా మారుస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. జూన్ నెలలోనే ఇక్కడ ఇండస్ట్రియల్ పార్కులకు శంకుస్థాపనలు చేయడానికి ప్రభుత్వం గడువు విధించుకుంది. మొత్తానికి, బీఆర్ఎస్ విసిరిన పొలిటికల్ సవాల్‌ను ఎదుర్కొనేందుకు రేవంత్ రెడ్డి చట్టాన్నే ఆయుధంగా మార్చుకుంటూ వేస్తున్న అడుగులు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.