తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ డామినేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు రాజకీయ ఎజెండాను సెట్ చేయడంలో దిట్టగా పేరుగాంచిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్థానాన్ని, నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆక్రమిస్తున్నట్లు స్పష్టమవుతోంది. రాజకీయాల్లో ఎజెండా సెట్ చేసే వారికే ఎప్పుడూ పైచేయి ఉంటుంది. గత పదేళ్లలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు, లేవనెత్తిన అంశాల చుట్టూనే రాష్ట్ర రాజకీయాలు తిరిగేవి. కానీ, అధికార మార్పిడి తర్వాత రేవంత్ రెడ్డి ప్రతి అడుగులోనూ దూకుడు ప్రదర్శిస్తూ, ప్రతిపక్షాలను డిఫెన్స్‌లోకి నెట్టి తానే ఎజెండాను నిర్దేశిస్తున్నారు.
రేవంత్ ఎజెండానే ఫాలో అయిపోతున్న బీఆర్ఎస్
బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల అధికార అనుభవం ఉన్నా, ప్రస్తుతం రేవంత్ రెడ్డి వేగాన్ని అందుకోవడంలో తడబడుతోంది. కృష్ణా జలాల వివాదం వంటి అంశాలను లేవనెత్తి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఎజెండాను తమ వైపు తిప్పుకోవాలని గులాబీ దళం ప్రయత్నించినప్పటికీ, అందులో కన్సిస్టెన్సీ లోపించడం ఆ పార్టీకి మైనస్‌గా మారుతోంది. ఒక అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే లోపే, రేవంత్ రెడ్డి మరో కొత్త నిర్ణయం లేదా విమర్శతో వార్తల్లో నిలుస్తూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. దీనివల్ల బీఆర్ఎస్ కేవలం రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలకు స్పందించే పార్టీగా మారిపోయింది తప్ప, సొంతంగా ఎజెండాను నడిపించే స్థితిలో లేదు.
మున్సిపల్ ఎన్నికలలోనూ రేవంత్ దారిలోనే !
రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పట్టణ ప్రాంత ఓటర్లను ఆకర్షించేలా రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. హైడ్రా వంటి వినూత్న నిర్ణయాలు, మూసీ పునరుజ్జీవనం, మెట్రో రైల్ విస్తరణ వంటి ప్రాజెక్టుల ద్వారా పట్టణ ప్రజల్లో ఒక చర్చను లేవనెత్తారు. ఇప్పటికే మున్సిపాలిటీల్లో బహిరంగసభలు నిర్వహిస్తూ దూసుకెళ్తున్నారు. అక్కడ రాజకీయం చేసే కామెంట్లతో బీఆర్ఎస్ నేతలకు ఆవేశం తెప్పిస్తున్నారు. ఈ అంశాలపై ప్రతిపక్షాలు ఎంత విమర్శలు చేసినా, చర్చ అంతా రేవంత్ రెడ్డి ఎంచుకున్న అంశాల చుట్టూనే తిరుగుతోంది. ప్రజలు కూడా ప్రభుత్వం ఏం చేస్తోందనే దానిపైనే ఆసక్తి చూపుతుండటం రేవంత్ రెడ్డికి లభిస్తున్న భారీ అడ్వాంటేజ్.
సమాధానం చెప్పుకోవడానికే పరిమితమవుతున్న బీఆర్ఎస్
రాజకీయ ఎజెండాలో రేవంత్ రెడ్డి నిర్ణయాలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద సవాలుగా మారాయి. రేవంత్ రెడ్డి వేసే ప్రతి అడుగుకు సమాధానం చెప్పుకోవడానికే బీఆర్ఎస్ నేతలు తమ సమయాన్ని వెచ్చిస్తున్నారు. తాము ఏం చేశామో చెప్పడం కంటే రేవంత్ ఏం చేస్తున్నారో విమర్శించడం మీదే ప్రతిపక్షం దృష్టి పెట్టాల్సి రావడం రేవంత్ రెడ్డి సృష్టించిన పొలిటికల్ ట్రాప్ అని చెప్పవచ్చు. ఈ క్రమంలో బీఆర్ఎస్ తన పాత దూకుడును ప్రదర్శించి ఎజెండాను మార్చలేకపోతే, మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఎజెండా సెట్టర్‌గా రేవంత్ రెడ్డి సాధిస్తున్న విజయం ఆయన నాయకత్వాన్ని మరింత బలపరుస్తోంది. ఒక ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తూనే, రాజకీయ వ్యూహకర్తగా ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా ఎజెండాను తన గుప్పిట్లో పెట్టుకోవడం రేవంత్ రెడ్డి చాణక్యం అనుకోవచ్చు.
