జిల్లాల విభజన విషయంలో ఇంకా ఓ నిర్ణయం తీసుకోకముందే అన్ని జిల్లాల్లో జిల్లాల రద్దు, కార్పొరేషన్ల రద్దు అంటూ బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలు ప్రారంభించింది. అయితే రేవంత్ రెడ్డి ఇలాంటి రాజకీయాల్ని అసలు పట్టించుకోవడం లేదు. శాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన చేసి తీరుతామని ప్రకటించారు. శాస్త్రీయంగా ఎలా చేయాలో చేసి చూపిస్తామని.. ప్రజలందరి విజ్ఞప్తులు పరిశీలిస్తామని ప్రకటింారు.
జిల్లాల శాస్త్రీయ విభజన , మండలాలు, జిల్లాల హేతుబద్ధీకరణ కోసం రిటైర్డ్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విభజనలో ఉన్న లోపాలను సరిదిద్ది, ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలనా వ్యవస్థను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఈ కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, జిల్లాల సరిహద్దులు , మండలాల విభజనపై క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు, సూచనలు సేకరిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. కేవలం అధికార యంత్రాంగం నిర్ణయాలకే పరిమితం కాకుండా, ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రక్రియ సాగుతుందని వివరించారు. కమిషన్ నివేదిక అందిన తర్వాత, అసెంబ్లీ వేదికగా అన్ని రాజకీయ పార్టీలతో సుదీర్ఘంగా చర్చించి, అందరి అంగీకారంతోనే జిల్లాల తుది రూపురేఖలను ఖరారు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
జిల్లాల మార్పులు-చేర్పులపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫలానా జిల్లా ఉంటుంది, ఫలానా జిల్లా రద్దవుతుంది అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు. ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకమైన పద్ధతిలో, శాస్త్రీయంగా జరుగుతుందని.. తుది నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి అపోహలకు గురికావద్దని ఆయన స్పష్టం చేశారు.కానీ ఇప్పటికే బీఆర్ఎస్ రాజకీయం ఓ రేంజ్‌కు చేరుకుంది. దీనికి రేవంత్ కౌంటర్ ఇవ్వాల్సి ఉంది.


