లోక్‌సభ స్థానాల సంఖ్యను 850కి పెంచాలనే ప్రతిపాదనపై రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లను పెంచితే, దశాబ్దాలుగా జనాభా నియంత్రణ పాటిస్తూ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా బలహీనపడతాయని హెచ్చరించారు. అభివృద్ధిని ప్రోత్సహించాల్సింది పోయి, జనాభాను అదుపులో ఉంచినందుకు శిక్ష విధించడం సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధమని, ఇది దేశ సమగ్రతపై ప్రభావం చూపుతుందని ఆయన స్పష్టం చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలుపుతూనే, దీనిని డిలిమిటేషన్‌తో ముడిపెట్టవద్దని రేవంత్ రెడ్డి కోరారు. సీట్ల పెంపు ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి చూడకుండా, ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల్లోనే మహిళా కోటాను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ సాధికారత అనేది నైతిక బాధ్యతని, దీనిని జనాభా లెక్కలు లేదా నియోజకవర్గాల విభజన సాకుతో కాలయాపన చేయకూడదని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ఈ సమస్యకు పరిష్కారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన హైబ్రిడ్ మోడల్ ను ప్రధాని ముందు ఉంచారు. దీని ప్రకారం.. కొత్తగా పెంచే సీట్లలో 50 శాతాన్ని మాత్రమే జనాభా ప్రాతిపదికన కేటాయించాలి. మిగిలిన 50 శాతం సీట్లను ఆయా రాష్ట్రాలు దేశానికి అందిస్తున్న జిడిపి వాటా , సామాజిక అభివృద్ధి, పనితీరు సూచికల ఆధారంగా కేటాయించాలని ప్రతిపాదించారు. ఈ పద్ధతి ద్వారా అభివృద్ధి చెందిన రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా, ప్రాతినిధ్యంలో సమతుల్యత ఉంటుందని ఆయన వివరించారు.
దేశ భవిష్యత్తును మార్చే ఇంతటి కీలకమైన అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవద్దని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తక్షణమే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ ఆమోదయోగ్యమైన, పారదర్శకమైన విధానం ద్వారానే ముందడుగు వేయాలని కోరారు.
