చెన్నై ఓట‌రును డ‌బ్బుతో కొనేస్తారా

డ‌బ్బిచ్చిన‌వారికి ఓట్లు వేసేంత బ‌ల‌హీన మ‌న‌స్కుడా…
దివంగ‌త జ‌య‌ల‌లిత నియోజ‌క‌వ‌ర్గం ఆర్‌కె న‌గ‌ర్‌లో ఉప ఎన్నిక‌ను పుర‌స్క‌రించుకుని వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై సోదాలు చేసిన ఆదాయపు ప‌న్ను శాఖ సేక‌రించిన వివ‌రాలు దిగ్భ్ర‌మ‌ను క‌లిగిస్తున్నాయి. రెండు ల‌క్ష‌ల ఇర‌వై నాలుగు వేల నూట న‌ల‌భై ఐదు మంది ఓట‌ర్ల‌కు నాలుగు వేల రూపాయ‌ల చొప్పున 89.5 కోట్ల రూపాయ‌లను పంచిపెట్టే బాధ్య‌త‌ను ఏడుగురు మంత్రుల‌కు అప్ప‌గించిన‌ట్లు తేలింది. ఇక్క‌డ శ‌శిక‌ళ బంధువు దిన‌క‌రన్ తో పాటు మాజీ ముఖ్య‌మంత్రి ఓ ప‌న్నీర్‌సెల్వం త‌ర‌ఫున ఇ. మ‌ధుసూద‌న‌న్, బిజెపి అభ్య‌ర్థిగా ఇళ‌య‌రాజా సోద‌రుడు గంగై అమ‌ర‌న్, జ‌య‌ల‌లిత అన్న‌కూతురు దీపా జ‌య‌కుమార్ స‌హా 62 మంది పోటీలో ఉన్నారు. ఇక్క‌డ నెగ్గితే దిన‌క‌ర‌న్ ముఖ్య‌మంత్రి అయ్యే అవ‌కాశాలు మెరుగుప‌డ‌తాయి. అక్ర‌మాస్తుల కేసులో శ‌శిక‌ళ‌లో జైలుపాల‌వ్వ‌డంతో ఆమె దిన‌క‌ర‌న్‌ని త‌న స్థానంలో పోటీకి దింపారు. అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న ఈ ఉప ఎన్నిక యావ‌త్ దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఉప్పందించింది ఎవ‌రో గాని ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌కి బ‌ల‌మైన ఆధారాలే దొరికాయి. చెన్నై ఓట‌రును అవినీతికి ప్రోత్స‌హించేలా దిన‌క‌ర‌న్ వ‌ర్గం ఆగ‌డాలు సాగుతున్నాయి.

అన్నా డిఎంకెలోని ఓ పి య‌స్, శ‌శిక‌ళ వ‌ర్గాలు రెండూ ఈ ఎన్నికలో నెగ్గి త‌మ స‌త్తా చాటుకోవాల‌ని ఉవ్విళ్లూరుతుండ‌డ‌మే దీని వెనుక ప్ర‌ధాన కార‌ణం. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి చాప కింద‌కు నీళ్లు వ‌చ్చే అవ‌కాశం ఉండ‌డంతో స‌హ‌జంగానే అన్నా డి ఎం కె లోని ప్ర‌ముఖుల క‌ళ్లు ఆయ‌న్ను అనుమానంగా చూస్తున్నాయి. ఆరోగ్య‌శాఖ మంత్రి విజ‌య‌భాస్క‌ర్ ఇంటిపై శుక్ర‌వారం సాయంత్రం ప్రారంభ‌మైన ఆదాయ‌పు ప‌న్ను శాఖ దాడులు శ‌నివారం వ‌ర‌కు సాగాయి. ఈ దాడుల్లోనే ఏడుగురు మంత్రుల‌కూ 89.5 కోట్ల రూపాయ‌ల‌ను ఓట‌ర్ల‌కు పంచిపెట్టేందుకు అప్ప‌గించార‌న‌డానికి ఆధారాలు ల‌భించాయి. త‌క్ష‌ణం ఈ అంశంపై విచార‌ణ చేప‌ట్టాల‌ని డి ఎం కె నేత స్టాలిన్ డిమాండ్ చేశారు. ఓ ప‌న్నీర్ సెల్వం కూడా ఈ అంశంపై శ‌శిక‌ళ వ‌ర్తంపై విరుచుకుప‌డ్డారు. ఎన్నిక‌ను ర‌ద్దు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. తాజా ప‌రిణామాలను చ‌ర్చించ‌డానికి ఎన్నిక‌ల సంఘం ఆదివారం స‌మావేశ‌మైంది. త‌న నిర్ణ‌యాన్ని సోమ‌వారం ప్ర‌క‌టించ‌నుంది. ఈ నెల ప‌న్నెండున ఆర్‌కె న‌గ‌ర్ ఉప ఎన్నిక నిర్వ‌హించేదీ లేనిదీ ఆరోజున స్ప‌ష్ట‌మైపోతుంది. ఎన్నిక‌లు నిలిపివేసే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఇంత‌టి ప‌క్కా ఆధారాల‌తో బ‌య‌ట‌ప‌డిన అంశాల‌పై ఆర్‌కె న‌గ‌ర్ ఓట‌రు ఒక‌వేళ ఎన్నిక జ‌రిగితే ఎలా స్పందిస్తాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఆర్కే న‌గ‌ర్లో మొత్తం 2ల‌క్ష‌ల 62వేల మంది ఓటర్లున్నారు. కింద‌టేడాది అక్టోబ‌రులో ఈ సంఖ్య 2 లక్ష‌ల 54వేలు వీరిలో ల‌క్ష 24వేల మంది పురుషులు, ల‌క్షా 29వేల మంది మ‌హిళ‌లూ ఉన్నారు. 103మంది న‌పుంస‌క ఓట‌ర్లూ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఓటుచేయ‌నున్నారు.

Subrahmanyam VS Kuchimanchi

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.