రాఘవేంద్రరావు ‘పెళ్లి సందD’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రోషన్. శ్రీకాంత్ తనయుడిగా తనకు ఎంట్రీ కార్డ్ త్వరగానే లభించింది. తొలి సినిమా ఓకే అనిపించింది. అయితే మార్కులన్నీ శ్రీలీల పట్టుకెళ్లిపోయింది. ఆ తరవాత మూడేళ్ల గ్యాప్ తీసుకొని… ఛాంపియన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈనెల 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. స్వప్న సినిమాస్ నిర్మాణం నుంచి రావడం, ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు రోషన్ లుక్స్ కూడా బాగున్నాయి. ఓ మాస్ హీరోకి ఉండాల్సిన కటౌట్ రోషన్‌కు ఉంది. అందుకే ‘ఛాంపియన్’ విడుదల కాకముందే.. రోషన్‌కు మంచి ఆఫర్లు అంతున్నాయి. స్వప్నదత్ నిర్మాణంలోనే రోషన్ మరో సినిమా చేయబోతున్నాడని టాక్. అందుకు తగిన కథ కూడా రెడీ అయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమా ఓ స్టార్ దర్శకుడు టేకప్ చేయబోతున్నాడట. ఆ స్టార్ దర్శకుడు ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.
ఇది కాకుండా.. మరో రెండు కథలు కూడా రోషన్ కోసం సిద్ధం అవుతున్నాయి. శైలేష్ కొలను దర్శకత్వంలో రోషన్ ఓ సినిమా చేసే ఛాన్స్ వుందని టాక్. నాగవంశీ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించే వీలుంది. క్లాస్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకొన్న ఇంద్రగంటి మోహనకృష్ణ కూడా రోషన్ కోసం ఓ కథ రెడీ చేశారట. ఇది భారీ సినిమానే. బడ్జెట్ అటూ ఇటుగా రూ.100 కోట్లు అవుతాయని టాక్.
శ్రీకాంత్ హీరోగా ఎదగడానికి చాలా టైమ్ పట్టింది. ముందు చిన్న చిన్న పాత్రలు చేసుకొంటూ వెళ్లాడు. ఆ తరవాత హీరో అయ్యాడు. ఇప్పుడు విలన్ గా, క్యారెక్టర్ నటుడిగా బిజీగా ఉన్నాడు. శ్రీకాంత్ ఒకప్పుడు చిన్న సినిమాలకు కేరాఫ్ గా నిలిచాడు. తనయుడు రోషన్ రావడం రావడంతోనే పెద్ద లీగ్ లో పడిపోవడానికి రెడీ అయిపోయాడు. రోషన్ లాంటి యంగ్ హీరోపై రూ.100 కోట్ల సినిమా అంటే మామూలు విషయం కాదు. మరి.. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ముందుకు వెళ్తుందో చూడాలి.
