‘అందం’ అనే అశాశ్వ‌తం వెన‌క ఎందుకీ ప‌రుగులు..?

దొండ పండు లాంటి పెద‌వులు, క‌లువ‌ల్లాంటి క‌ళ్లు, చిల‌క ముక్కు, చంద్ర బింబం లాంటి ముఖం, స‌న్న‌ని న‌డుము… అమ్మాయిలు ఇలా ఉంటేనే ‘అందం’ అనేది చాలామంది అభిప్రాయం..! ఇలా ఉండాలనే అందరూ కోరుకుంటారు. అయితే, గ్లామ‌ర్ రంగంలో ఉన్న‌వారికి కొన్ని కొల‌మానాల‌కు తగ్గట్టుగా తయారవడం క‌త్తిమీద సాము అయిపోయింది. అందం కోసం చికిత్సలు అనేది ఒక ట్రెండ్ గా మారిపోయింది. ఇది నిజ‌మో కాదో నిర్ధార‌ణ లేదుగానీ… శ్రీ‌దేవి ఆకస్మిక మ‌ర‌ణానికి కార‌ణం ఆమె చేయించుకున్న సౌంద‌ర్య చికిత్స‌లేనా అనే క‌థ‌నం ఇప్పుడు బాగా ప్ర‌చారం ఉంది.

అయితే, సౌంద‌ర్య చికిత్స‌లు చేయించుకోవ‌డం అనేది వ్య‌క్తిగ‌త నిర్ణ‌యమే. అందం అంటే ఇలానే ఉండాలంటూ కొన్ని కొల‌త‌ల్ని తెలియ‌కుండానే బ్యూటీ ఇండ‌స్ట్రీ స్థిరీక‌రించేసింది. వాటిని అందుకోవ‌డం కోసం చాలామంది ఆరోగ్యాన్ని ప‌ణంగాపెట్టి మ‌రీ చికిత్స‌ల బాట ప‌ట్టాల్సి వ‌స్తోంది. శ్రీ‌దేవి ముక్కు మొద‌లుకొని అనుష్క శ‌ర్మ పెద‌వులు, క‌రీనా క‌పూర్ సైజ్ జీరో వ‌ర‌కూ.. అందానికి అర్థం ఇదీ అంటూ వీళ్ల‌ని ఉదాహ‌ర‌ణ‌లుగా చూపిస్తూ సీనీ రంగం, మీడియా, సౌంద‌ర్య సాధ‌నాల ఉత్పుత్తుల కంపెనీలు ఎప్పట్నుంచో ఊద‌ర గొట్టేస్తున్నాయి. దీంతో ఈ తార‌ల్లా వెలిగిపోవాల‌ని అనుకునేవారు కూడా లేనిపోని డైట్ రూల్స్ పెట్టేసుకోవ‌డం, అందం కోసం ఆప‌రేష‌న్ల‌కు వెన‌కాడ‌క‌పోవ‌డం అనేది ఒక ట్రెండ్ గా మారిపోయింది.

2009లో క‌రీనా క‌పూర్ ‘సైజ్ జీరో’ ట్రెండ్‌ బాగా వార్త‌ల్లో ఉండేది. దాదాపు ఓ ఏడాది పాటు ఆమె డైట్ చార్ట్ ఇదే అంటూ ప్ర‌చారంలో నిలిచింది. ‘ఈ సైజ్ జీరో ట్రెండ్ ఎలా మొద‌లైందో నాకు తెలీదు. సినిమాలో ఒక పాత్ర కోసం కాస్త త‌గ్గాల్సి వ‌చ్చింది, త‌గ్గాను, అంతే! అప్ప‌టికి అది బాగానే ఉంది.’ అని కరీనా అంది. అనుష్క శర్మ తన పెదవుల గురించి మాట్లాడుతూ.. ‘బాంబే వెల్వెట్ లో పాత్ర కోసం పెద‌వుల చికిత్స చేయించుకోవాల్సి వ‌చ్చింద’ని చెప్పింది. అయితే, ఇలా ఓపెన్ గా ఈ చికిత్సల గురించి అంద‌రూ చెప్ప‌క‌పోయినా చేయించుకున్న‌వారు చాలామందే ఉన్నారు. ప్రియాంకా చోప్రా, శిల్పా శెట్టి, కంగ‌నా ర‌నౌత్‌, శృతీ హాస‌న్‌.. అందం కోసం చికిత్స‌లు చేయించుకున్న‌వారే. ఒక‌ప్ప‌టి డ్రీమ్ గ‌ర్ల్ హేమ‌మాలిని కూడా చ‌ర్మ సౌంద‌ర్యం కాపాడుకోవ‌డం కోసం చికిత్స చేయించుకున్నార‌నే అంటారు. ఈ అందం కోసం ఆరాటంలో పీక్స్ అంటే… పాప్ సింగ‌ర్ మైకెల్ జాక్స‌న్ గురించే చెప్పుకోవాలి. అంద‌మైన ముక్కు, చెంప‌లు, గ‌డ్డం, చర్మం రంగు.. వీటి కోసం చాలా చికిత్స‌లు చేయించుకున్నాడు.

తెల్లారి లేచింది మొద‌లు… టీవీల్లో ప‌త్రిక‌ల్లో సినిమాల్లో రోడ్డు మీద‌కి వెళ్తే వాల్ పోస్ట‌ర్ల‌లో ఇలా ప్ర‌తీ చోటా ‘అందం’ అనే పేరుతో ఆక‌ర్ష‌ణీయ‌మైన ప్ర‌క‌ట‌న‌లు ఊరిస్తుంటాయి. ఈ సైజులు, కొలతలు, రంగుల రేసులో మ‌నం లేక‌పోతే ట్రెండులో వెన‌క‌బ‌డిపోతామేమో అనే అభ‌ద్ర‌త‌ను చాలామందిలో క‌నిపిస్తోంది. గ్లామర్ రంగంలో ఉన్నవాళ్లలో మరీ ఎక్కువగా కనిపిస్తోంది. అశాశ్వ‌త‌మైన అందానికి ఆరోగ్యాన్ని ప‌ణంగా పెట్టేస్థాయి ప్రాధాన్య‌త ఇచ్చేవ‌ర‌కూ ఈ ట్రెండ్ అనే మాయాజాలం చాలామందిని లాక్కెళ్లిపోయింది..! శ్రీ‌దేవి మ‌ర‌ణానికి సౌంద‌ర్య‌ చికిత్స‌లు కార‌ణం కాదుగానీ… ఈ సంద‌ర్భంలో, ‘ఇలా ఉంటేనే అందం’ అనే భ్ర‌మ నుంచి, ‘ఎలా ఉన్నా అంద‌మే’ అనే వాస్త‌వం వైపుగా ఆలోచ‌నా ధోర‌ణి మారాల్సిన త‌రుణం ఇది అని మ‌రోసారి గుర్తు చేయ‌డ‌మే ఇక్క‌డి ఉద్దేశం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.