చంద్ర‌బాబు పరాజ‌య భారాన్ని ఇత‌ర పార్టీలు ఎందుకు మోస్తాయి?

ఎగ్జిట్ పోల్ ఫ‌లితాల‌ను సెలెబ్రేట్ చేసుకునే మూడ్ లో వైకాపా ఉంది. ఇదే స‌మ‌యంలో సీఎం చంద్ర‌బాబు నాయుడు వీవీప్యాట్ల స్లిప్పుల లెక్కింపుపై ఢిల్లీలో చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను… రాష్ట్రంలో ఎదురుకాబోయే ఓట‌మికి సాకుగా వైకాపా చూస్తోంది. ఇదే అంశ‌మై ఇవాళ్టి సాక్షి పత్రిక‌లో… ప్ర‌జాతీర్పుతో ప‌రిహాసం అంటూ ఒక సుదీర్ఘ క‌థ‌నం రాసింది. ఈవీఎంల ప‌నితీరును వివాదాస్ప‌దం చేస్తూ, ఆ అంశాన్ని స‌జీవంగా ఉంచ‌డం కోసం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌య‌త్నిస్తున్నారంటూ రాశారు. ఈసారి ఎన్నిక‌ల్లో త‌న‌కు ప‌రాజ‌యం ఖాయ‌మ‌ని చంద్ర‌బాబు నిర్ధార‌ణ‌కు వ‌చ్చార‌నీ, సాకుగా ఈవీఎంల‌ను చూపించేందుకు సిద్ధ‌మౌతున్నార‌నీ, అందుకే ఇత‌ర పార్టీల‌ను కూడా ఇందులోకి లాగుతున్నార‌ని పేర్కొన్నారు.

ఎన్నిక‌ల షెడ్యూల్ ముందే కొన్ని స‌ర్వేలు జ‌గ‌న్ గెలుపు ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశాయ‌నీ, అప్ప‌ట్నుంచే ఈవీఎంల ప‌నితీరుపై అనుమానాలు వ్య‌క్తం చేయ‌డం చంద్ర‌బాబు మొద‌లుపెట్టార‌ని క‌థ‌నంలో చెప్పారు! మూడు రాష్ట్రాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ కూడా చివ‌రికి చంద్ర‌బాబు మాట‌ల‌కు త‌లొగ్గింద‌ని రాశారు. విప‌క్షాల‌ను ఏకం చేసేందుకు తానొక్క‌డినే పెద్దన్న పాత్ర పోషిస్తున్న‌ట్టుగా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నీ, కానీ ఆయ‌న చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు విప‌క్షాల నుంచి మ‌ద్ద‌తు స‌రిగా రావ‌డం లేద‌ని విశ్లేషించింది. రాబోయే ఫ‌లితాల‌పై చంద్ర‌బాబు నాయుడు తీవ్ర ఆందోళ‌న‌తో ఉన్న‌ట్టు తెలుగుదేశం వ‌ర్గాలు చెబుతున్నాయ‌ని రాశారు.

నిన్న ఢిల్లీలో 21 రాజ‌కీయ పార్టీలూ వ్య‌క్తం చేసిన అనుమాన‌మేంటి… ఐదు శాతం వీవీప్యాట్ స్లిప్పులు, ఈవీఎంల‌లో ఓట్లు స‌రిపోల‌క‌పోతే ప‌రిస్థితి ఏంట‌ని క‌దా! ఇంత‌కీ, ఈ అంశంపై వైకాపా వైఖ‌రేంటి..? స‌రే, త‌న ఓట‌మి భారాన్ని త‌ప్పించుకోవ‌డం కోస‌మే దేశంలోని ఇత‌ర పార్టీల‌కు పెద్ద‌న్న పాత్ర‌లో క‌నిపించే ప్ర‌య‌త్నం చంద్ర‌బాబు చేస్తున్నార‌నే కాసేపు అనుకుందాం! మ‌రి, ఆయా పార్టీల‌కు చంద్ర‌బాబు ఓట‌మి భారాన్ని మొయ్యాల్సిన అవ‌స‌రం ఏముంటుంది..? కేవ‌లం ఈవీఎంల ప‌నితీరుపై వ్య‌క్త‌మౌతున్న అనుమానాల నేప‌థ్యంలోనే 21 పార్టీలు ఒక‌ట‌య్యాయి. ప్ర‌జాస్వామ్యంలో ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌పై 21 పార్టీలు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తుంటే…. ఆ తీవ్ర‌ను సాక్షిగానీ, వైకాపా నేత‌లుగానీ అర్థం చేసుకోవ‌డం లేదు. ఈవీఎంల ప‌నితీరుపై అభ్యంత‌రాలు కేవ‌లం ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో చంద్ర‌బాబు నాయుడు మాత్ర‌మే వ్య‌క్తం చేయ‌డం లేదు, దేశంలో ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన పార్టీలు కూడా ఉన్నాయి. ఒక‌వేళ‌, ఈవీఎంల ప‌నితీరే ఓట‌మికి సాకుగా చూపాల‌నుకుంటే… ఎన్నిక‌లు మ‌ర్నాటి నుంచీ ఇంత అవిశ్రాంతంగా చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించాల్సిన అవ‌స‌రం లేదు. నాలుగు ప్రెస్ మీట్లు పెట్టి… ఇంట్లోనే కూర్చున్నా స‌రిపోతుంది క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com