‘కేంద్ర ప‌రిధి’పై సాక్షి ఫోక‌స్ గ‌మ‌నించారా..?

కాపుల రిజ‌ర్వేష‌న్ల విష‌యంపై ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎలా యూ ట‌ర్న్ తీసుకున్నారో తెలిసిందే. త‌న వ్యాఖ్య‌ల వ‌క్రీక‌ర‌ణ అనేశారు. ఎల్లో మీడియా దుష్ప్ర‌చారం అని ఆయ‌న వ్యాఖ్యానిస్తున్నా… జ‌గ‌న్ చెప్పిన మాటేంటీ, మార్చిన త‌రువాత మాటేంటి అనే వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. స‌రే, ఇక వైకాపా ప‌త్రిక సాక్షి విష‌యానికొస్తే.. ‘కేంద్ర‌ప‌రిధి’ అనే అంశాన్ని ఫోకస్ చేస్తూ ఆర్థిక‌మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడి ప్రెస్ మీట్ వార్త‌ను రాసింది. కాపుల రిజ‌ర్వేష‌న్ల అంశం కేంద్ర ప‌రిధిలోనిది అని య‌న‌మ‌ల కూడా స్ప‌ష్టం చేశార‌నీ, రిజ‌ర్వేష‌న్లు 50 శాతం మించ‌కూడ‌ద‌ని సుప్రీం కోర్టు గ‌తంలో చెప్పిందంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌ను ఫోక‌స్డ్ గా ఒక‌టికి రెండుసార్లు రాశారు. ఇక‌, వైకాపా నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్రెస్ మీట్ వార్త‌ కూడా ఆ ప‌క్క‌నే ప్ర‌చురిస్తూ… జ‌గ‌న్ చెప్పిన మాట‌లే య‌మ‌న‌ల చెబుతున్నారు క‌దా అనే వ్యాఖ్య‌ల్నిహైలైట్‌ చేశారు. రిజ‌ర్వేష‌న్ల‌పై నిర్ణ‌యం కేంద్ర‌మే తీసుకోవాల‌ని టీడీపీకి తెలుసున‌నీ, కానీ ఉద్దేశ‌పూర్వ‌కంగానే కాపుల‌ను వంచిస్తోంద‌ని బొత్స అన్నారు.

ఈ రెండు క‌థ‌నాల ద్వారా సాక్షి చెప్పాల‌నుకుంటున్న‌ది ఏంటంటే… కాపుల రిజ‌ర్వేష‌న్ల‌పై జ‌గ‌న్ మాట్లాడిందే టీడీపీ కూడా మాట్లాడుతోంద‌ని! జ‌గ‌న్ మాట్లాడిన దాన్లో త‌ప్పేముంద‌ని. కానీ, అస‌లు స‌మ‌స్య మాట‌లు కాదు క‌దా, ప్ర‌య‌త్నం క‌దా కావాల్సింది! కాపుల రిజ‌ర్వేష‌న్ల‌పై టీడీపీ ఒక క‌మిష‌న్ వేసింది, అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి బిల్లు పంపింది, కేంద్రం పెండింగ్ లో ఉంచేస్తే… ప్ర‌స్తుత స‌మావేశాల్లో దానిపై కూడా టీడీపీ ఎంపీలు మాట్లాడుతున్నారు. రేప్పొద్దున్న ఇలాంటి ప్ర‌య‌త్నం వైకాపా చెయ్య‌దు అన్న‌ట్టుగా జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. రిజ‌ర్వేష‌న్ల‌పై కేంద్ర‌మే నిర్ణ‌యం తీసుకోవాల‌ని టీడీపీకి తెలుసు అని బొత్స కొత్త‌గా చెప్పాల్సిన ప‌నేముంది? ఏం చేసినా కేంద్ర‌మే క‌దా చెయ్యాలి క‌దా.

‘కేంద్ర ప‌రిధి’ ఇదే మాట‌ను ఫోక‌స్డ్ గా చూపే ప్ర‌య‌త్నం సాక్షి చేస్తోంది. కాపుల రిజ‌ర్వేష‌న్లు కేంద్ర ప‌రిధిలోని అంశ‌మే క‌దా అంటోంది. క‌రెక్టే.. ఆ మాట‌కొస్తే ఇదొక్కటేకాదు, ప్ర‌త్యేక హోదా కూడా కేంద్ర ప‌రిధిలో అంశ‌మే! రైల్వేజోన్‌, క‌డ‌ప స్టీల్ ప్లాంట్‌, దుగ‌రాజ‌ప‌ట్నం పోర్టు… ఇలా విభ‌జ‌న హామీల‌న్నీ కేంద్ర ప‌రిధిలోని అంశాలే. మ‌రి, వీటిపై కూడా తాను చేసేదేం లేదూ, కేంద్ర ప‌ర‌ధిలోని అంశాలే, నేను చెయ్య‌గ‌లిగేవి మాత్ర‌మే మాట్లాడ‌తాను అని జ‌గ‌న్ వ్యాఖ్యానించ‌గ‌ల‌రా..? ఈ ప్ర‌శ్న‌కు జ‌గ‌న్ జ‌వాబు ఎందుకు చెప్ప‌లేరో సాక్షికి తెలిస్తే… కాపుల రిజ‌ర్వేష‌న్ల‌ను ఉద్దేశించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల్లోని ఆంత‌ర్యం అర్థ‌మౌతుంది! కేంద్ర ప‌రిధి అనేది కేవ‌లం కాపుల రిజ‌ర్వేష‌న్ల అంశానికి వ‌చ్చేస‌రికి మాత్ర‌మే సాక్షికిగానీ, జ‌గ‌న్ కి గానీ ఎందుకు గుర్తుకొచ్చిన‌ట్టు..? జగన్ చేసిన వ్యాఖ్యల తీవ్రతను గుర్తించారు కాబట్టి, నష్ట నివారణ చర్యల్లో భాగంగా సాక్షి ఇలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇప్పుడు ఎంత చేసినా.. చేతులు కాలిపోయిన తరువాత ఆకుల పట్టుకోవడమే అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com