సాక్షి మీడియా బరి తెగిస్తోంది. లడ్డూ అంశంలో చేసిన తప్పును కప్పి పుచ్చుకోవడానికి రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. చివరికి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూడా వక్రీకరిస్తున్నారు.
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణను పురస్కరించుకుని పిటిషనర్ పై చేసిన వ్యాఖ్యలను .. చంద్రబాబుకు అన్వయించి ప్రచారంచేస్తోందిసాక్షి మీడియా. కోర్టు ప్రొసీడింగ్స్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తే… పిటిషనర్ తరపు న్యాయవాది లడ్డూలో జంతు కొవ్వు క అంశాన్ని ప్రస్తావించగా, న్యాయమూర్తి ఆయనను ఉద్దేశించి కొన్ని కీలక ప్రశ్నలు వేశారు. పిటిషనర్ నేరుగా దర్యాప్తులో జోక్యం చేసుకోవడం సరికాదన్న ఉద్దేశంతో.. మీరేమైనా నిపుణులా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
అంతేకానీ, అక్కడ జంతు కొవ్వు కలవలేదని కోర్టు ఎక్కడా ధ్రువీకరించలేదు. ఇలాంటి సాంకేతిక అంశాలను దర్యాప్తు సంస్థలకే వదిలేయాలని న్యాయస్థానం స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. యానిమల్ ఫ్యాట్ ఉందో లేదో.. లేదా ఇతర పదార్థాలు వాడారో లేదో.. ఇవన్నీ మీరు వెళ్లి దర్యాప్తు సంస్థకే చెప్పండి అని సుప్రీంకోర్టు పిటిషనర్‌కు సూచించింది. ఇప్పటికే ఈ కేసును అత్యున్నత స్థాయి దర్యాప్తు కోసం సీబీఐ కి అప్పగించినందున, మధ్యలో ఇతరులు ఇచ్చే వ్యక్తిగత నివేదికలకు తావులేదని కోర్టు తేల్చి చెప్పింది. సీబీఐ తన దర్యాప్తు నివేదికను సమర్పించిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని చెబుతూ, సదరు పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది
ఇంతటి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, సాక్షి కోర్టు వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకుని ప్రచారం చేసుకుంటోంది. కోర్టు పిటిషన్‌ను తిరస్కరించడాన్ని దాచిపెట్టి, కేవలం న్యాయమూర్తి వేసిన ప్రశ్నలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. న్యాయస్థానాల పట్ల సాక్షి మీడియా వ్యవహరిస్తున్న తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
