హుందాగా సమాధానం ఇచ్చిన జేడి, సిగ్గు “పడని” సాక్షి

సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ నిన్న ఒక టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ వైయస్ జగన్ మీద ” లక్ష కోట్ల అవినీతి” అంటూ వచ్చిన వార్తలన్నీ కేవలం రాజకీయ ఆరోపణలు మాత్రమే నని, సిబీఐ అధికారిక లెక్కల ప్రకారం కేవలం పదిహేను వందల కోట్లకు మాత్రమే అవినీతి జరిగినట్లుగా జగన్ మీద కేసులు నమోదయ్యాయని, లక్ష కోట్లు అంటూ రాజకీయ పార్టీలు చేసిన ఆరోపణలకు సిబిఐకి ఎటువంటి సంబంధం ఉండదని లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించారు. “జగన్ మీద లక్ష కోట్ల రూపాయల అవినీతి” అంటూ వస్తున్న వార్తల పై స్పందించమని అడిగినప్పుడు లక్ష్మీనారాయణ ఈ విధంగా స్పందించారు. మొత్తానికి ప్రస్తుతానికి జనసేన పార్టీలో రాజకీయ నాయకుడిగా ఉన్నప్పటికీ, వైఎస్ఆర్ సీపీ తమకు ప్రత్యర్థి పార్టీ అయినప్పటికీ, వైఎస్ఆర్ సీపీ మీద ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా లక్ష్మీనారాయణ హుందాగా సమాధానం ఇచ్చిన తీరు పలువురిని ఆకట్టుకుంది. అయితే లక్ష్మీనారాయణ వ్యాఖ్యల అనంతరం సాక్షి పత్రిక ప్రవర్తించిన తీరు మాత్రం చాలామందిని ఆశ్చర్యపరిచింది.

లక్ష్మీనారాయణ వ్యాఖ్యలను సాక్షి పత్రిక హైలెట్ చేసుకుంది. లక్ష్మీనారాయణ వ్యాఖ్యల ప్రకారం లక్ష కోట్ల అవినీతి అనేది కేవలం రాజకీయ ఆరోపణలు కాబట్టి, ఈ లెక్కన జగన్ చేసిన అవినీతి కేవలం 1500 కోట్లు మాత్రమేనని, ఈ లెక్కన ఇంతకాలం లక్ష కోట్లు అవినీతి చేశాడంటూ జగన్ మీద జరిగినంత దుష్ప్రచారం అని అర్థం వచ్చేలా సాక్షి పత్రిక కథనాన్ని ప్రచురించింది. అయితే సాక్షి తీరు చాలామందికి విస్మయాన్ని కలిగించింది. నిన్న మొన్నటిదాకా జెడి లక్ష్మీనారాయణ మీద విరుచుకుపడుతూ సాక్షి కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. సరిగ్గా ఎన్నికలకు ముందు రోజు లక్ష్మీనారాయణ అవకాశాలు దెబ్బతీసే ఉద్దేశంతో “అమ్మ జెడి!!” అంటూ ఒక కథనాన్ని సాక్షి ప్రచురించింది. ఈ కథనంలో చాలా వ్యంగ్యంగా వెటకారంగా లక్ష్మీనారాయణ విమర్శిస్తూ లక్ష్మీనారాయణ కూడాా అవినీతి చేశాడు అన్న అర్థం పాఠకులకు కలిగేలా చేయడానికి సాక్షి నానా తిప్పలు పడింది. లక్ష్మీనారాయణ 20 ఏళ్ల కిందట కొన్ని లక్షలు పెట్టి ఒక ఆస్తి ముంబై లో ఉన్నాడని ఇప్పుడు దాని విలువ కోట్లకు చేరిందని వ్యాఖ్యానిస్తూ ఇది కూడా అవినీతి కిందికే వస్తుంది అన్న అర్థం వచ్చేలా సాక్షి రాసుకొచ్చింది. కానీ సాక్షి చేసిన ఆరోపణలు అన్నింటికీ సమాధానాలు ఆ ఆర్టికల్ లోనే ఉన్నాయి. నిజంగా 20 ఏళ్ల కిందట ముంబైలో కొన్ని లక్షలు పెట్టి ఆస్తులు కొని ఉంటే దాని విలువ న్యాయబద్ధంగానే ,చట్టబద్ధంగానే ఈరోజు కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉంది. సాక్షి ఆ కథనంలో చేసిన ఆరోపణలన్నీ ఇలాంటివే. అయినప్పటికీ కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్టు గా, సాక్షి జేడిని కూడా అవినీతి పరుడు అని నిరూపించడానికి శతవిధాల ప్రయత్నించింది. తమ పార్టీ అభ్యర్థిి మంచివాాడు అని చెప్పుకోవడం అంటేే కూడా లక్ష్మీనారాయణ కూడా తమలాగేే అవినీతిపరుడు అని చెప్పడానికి సాక్షిి ప్రాధాన్యంం ఇచ్చింది.

అదలావుంచితే గత కొద్దిరోజులుగా వైఎస్ఆర్సీపీలో రెండవ స్థానంలో ఉన్న నాయకుడు విజయ్ సాయి రెడ్డి గత కొద్దిరోజులుగా లక్ష్మీనారాయణ పై విపరీతంగా వ్యాఖ్యల దాడి చేస్తున్నారు. “చంద్రబాబు జేబు లో మనిషి, మీ పార్టీకి అంత సీన్ ఎక్కడిది, మీ బతుక్కి” ఇలాంటి దారుణమైన పదాలు ఉపయోగిస్తూ లక్ష్మీనారాయణ మీద ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడికీ లక్ష్మీనారాయణ ఎంతో హుందాగా స్పందిస్తున్నప్పటికీ, విజయసాయిరెడ్డి మాత్రం పదే పదే ఒకే తరహా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ నెటిజన్ల నుండి కూడా చీవాట్లు తింటున్నారు.

అయితే, ఇప్పుడు ఇవన్నీ సాక్షికి కనిపించలేదు. లక్ష్మీనారాయణ, ” జగన్ మీద వచ్చిన లక్ష కోట్ల అవినీతి అన్న ఆరోపణలు కేవలం రాజకీయ ఆరోపణలు మాత్రమే” అని చెప్పేసరికి, నిన్న మొన్నటి దాకా ఇదే లక్ష్మీనారాయణ మీద తాము విషం కక్కె కథనాలు ప్రచురించాము అన్న సంగతి మరిచిపోయి, సిగ్గు “పడకుండా”, లక్ష్మీనారాయణ వ్యాఖ్యలను హైలెట్ చేస్తూ వార్త రాసుకుంది.

కొసమెరుపు:

లక్ష్మీనారాయణ వ్యాఖ్యలతో వైఎస్సార్సీపీ అభిమానులు కూడా సంబర పడిపోతున్నారు. అయితే జనాలు మాత్రం, లక్ష కోట్లు కాకపోయినా కనీసం పదిహేను వందల కోట్లకు జగన్ అవినీతి చేసినట్లుగా కేసులు ఉన్నాయని అంత స్పష్టంగా లక్ష్మీనారాయణ చెబుతుంటే వైఎస్సార్సీపీ అభిమానులు సంబరపడిపోవడం ఎందుకని ఆశ్చర్యపోతున్నారు. పైగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 1500 కోట్లు అంటే మార్కెట్ లెక్కల ప్రకారం దాని విలువ మరింత ఎక్కువగా ఉంటుందని వారు గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా లక్ష్మీనారాయణ చెప్పిన లెక్కలు కేవలం సీబీఐ కేసుల గురించి మాత్రమే నని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేసిన 43వేల కోట్ల గురించి కాదని కూడా వారు గుర్తు చేస్తున్నారు. ఇవన్నీ పక్కనపెడితే కూడా, 1500 కోట్లు అయినా, లక్ష కోట్లు అయినా పడే శిక్ష మాత్రం రెండు సంవత్సరాల నుండి 14 సంవత్సరాల మధ్య లోనే ఉంటుందని, రెండు సంవత్సరాలకు పైగా ఒకరోజు శిక్ష పడ్డా కూడా, ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అవుతారని వారు గుర్తు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com