అవిశ్వాసం, ఎన్డీయేతో పొత్తు.. మ‌ధ్య‌లో ‘సాక్షి’ స‌త‌మ‌తం..!

ఇక్క‌డ రెండు అంశాలున్నాయి..! ఒక‌టి… కేంద్రంపై వైకాపా అవిశ్వాస తీర్మానం పెట్ట‌బోతోంది, దానికి టీడీపీ మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని జ‌గ‌న్ కోరారు. రెండోది… కేంద్రంపై ఒత్తిడి పెంచి రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు సాధించుకునే దిశ‌గా టీడీపీ కేంద్రమంత్రులు రాజీనామా చేశారు. కానీ, ఎన్డీయేలో టీడీపీ కొన‌సాగుతోంది. ఈ రెండూ వేర్వేరు అంశాలు. ఇంకా చెప్పాలంటే… రెండు పార్టీల‌కు సంబంధించిన వ్యూహాలు! అయితే, ఈ రెంటి మ‌ధ్యా ఉన్న సున్నిత‌మైన తేడాని గుర్తించ‌కుండా, రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు అనే ఒక ఎమోష‌న‌ల్ అంశాన్ని మ‌ధ్య‌లోకి తీసుకొచ్చి… వైకాపా రాజ‌కీయ ల‌బ్ధికి అనుకూలంగా ఒక క‌థ‌నాన్ని ‘సాక్షి’ ప‌త్రిక ప్ర‌చురించింది. వైకాపా చేస్తున్న‌దే పోరాటం, టీడీపీ ఆరాటం అన్న‌ట్టుగా రాసేశారు.

కేంద్ర‌పై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టేందుకు వైకాపా సిద్ధ‌ప‌డుతోంది. అయితే, ఈ క్ర‌మంలో టీడీపీ త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోవ‌డాన్ని ఏదో రాజ‌ద్రోహంగా చిత్రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. జ‌గ‌న్ పిలిచినా టీడీపీ మ‌ద్ద‌తుగా రావ‌డం లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. నిజానికి… ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అధికార పార్టీని ప్ర‌తిపక్షం అనుస‌రించాలి. వీలైతే టీడీపీ వెంట నడవాలి. అంతేగానీ… ‘మేం అవిశ్వాసం పెట్టేస్తున్నాం, మీరు ఎందుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌రూ.. ఇదే తెలుగుదేశం డ్రామా, ముసుగు తొలిగిందీ’ అని రాసేయ‌డం తొంద‌ర‌పాటుత‌నం. ఎందుకంటే, ఇలాంటి స‌మ‌యంలో అధికార పార్టీ బాధ్య‌త‌లు వేరుగా ఉంటాయి. కేంద్రంపై ద‌శ‌ల‌వారీగా ఒత్తిడి పెంచ‌డం అవ‌స‌రం. ఎందుకంటే, టీడీపీ తీసుకోబోతున్న ప్ర‌తీ నిర్ణ‌యం వెన‌కా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల ముడిప‌డి ఉంటాయి. ప్ర‌స్తుతం కేంద్రం నుంచి వ‌స్తున్న నిధులు, పెండింగ్ ఉన్న చెల్లింపులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, రావాల్సిన ప‌న్నుల వాటాలు.. ఇలా చాలా లెక్క‌లుంటాయి. ఇవ‌న్నీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌తిప‌క్షానికి ఉండ‌దు. కాబ‌ట్టి, వారికి కేవ‌లం రాజ‌కీయ ప్ర‌యోజ‌న‌మే ఇక్క‌డ ముఖ్యం.

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను కేంద్రం కాల‌రాస్తోంది కాబ‌ట్టి, సీఎం చంద్ర‌బాబు తమ కేంద్ర‌మంత్రుల‌తో రాజీనామా చేయించారు. త‌రువాత ద‌శ ఎన్డీయే నుంచి టీడీపీ బ‌య‌ట‌కి రావ‌డం. అయితే, ఇంకా ఎన్డీయేలో ఎందుకు కొన‌సాగడం అనేది ‘సాక్షి’ ప్ర‌శ్న‌..? కేంద్రంతో ఇప్ప‌టికీ రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ముడిప‌డి ఉన్నాయ‌నేది వారికి అర్థం కానంత‌కాలం.. ఈ ప్ర‌శ్న వేస్తూనే ఉంటారు. మంత్రుల రాజీనామా త‌రువాత కొంత గ్యాప్ ఇస్తే.. కేంద్ర ఆలోచ‌నా విధానంలో మార్పు రావొచ్చేమో. ఒత్తిడి పెరిగి.. కేటాయింపుల విష‌యంలో ఏదైనా నిర్ణ‌యం తీసుకోవ‌చ్చేమో అనే ఆశ అధికార పార్టీకి ఉండాలి. ప్ర‌తిప‌క్ష పార్టీగా వారికి ఈ బాధ్య‌త అర్థం కానంత‌కాలం… ఎన్డీయే నుంచి టీడీపీ బ‌య‌ట‌కి ఎందుకు రాదూ, ఇదే ద్వంద్వ వైఖ‌రి అంటూ ఎన్నైనా చెప్తారు.

కాబ‌ట్టి, అవిశ్వాస తీర్మానం అనేది వైకాపా రాజ‌కీయ వ్యూహం. ఎన్డీయేతో ఇంకొంత కాలం భాగ‌స్వామ్య ప‌క్షంగా ఉంటూ రాష్ట్ర ప్రయోజ‌నాల‌ను రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చివ‌రి చేయ‌డం అధికార పార్టీగా టీడీపీ బాధ్య‌త‌. నిజంగానే, వైకాపాకి కూడా ప్ర‌జా ప్ర‌యోజ‌నాలే ప్ర‌థ‌మ ప్రాధాన్య‌తాంశమైతే, అధికార పార్టీని అనుస‌రించాలి. అంతేగానీ, మేం అవిశ్వాసం పెడుతున్నాం మీరు రావాల్సిందే అంటూ ప్ర‌తిప‌క్షం పిల‌వ‌గానే… అధికార పార్టీలు ఏవైనా అలా రాలేవు, రావు! వైకాపా అవిశ్వాసం తీర్మాన వ్యూహం వేరు, ఎన్డీయేతో టీడీపీ కొన్నాళ్ల కొన‌సాగించ‌డంలో ఉన్న వ్యూహం వేరు. ఈ తేడా ‘సాక్షి’కి అర్థం కాక‌పోవ‌చ్చేమోగానీ, ప్ర‌జ‌ల‌కు ఆ స్ప‌ష్ట‌త ఉంది. ఎవ‌రి బాధ్య‌త, ఎవ‌రిది రాజ‌కీయ‌మో గుర్తించ‌గ‌ల విజ్ఞ‌త ప్ర‌జ‌ల‌కు ఉంది..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com